కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు

కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు

Written By news on Thursday, February 4, 2016 | 2/04/2016


టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో బీసీ ఉద్యమం
చంద్రబాబుపై అంబటి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, కాపు నేత అంబటి రాంబాబు దుయ్యబట్టారు. బీసీలకు, కాపులకు శత్రుత్వం లేనేలేదని, అయితే చంద్రబాబు కావాలని సమాజంలో చీలిక తెచ్చే యత్నం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కాపుల రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ద్వారా బీసీల ఉద్యమానికి తెరలేపారని తెలిపారు.

కాపు రిజర్వేషన్లు ఇవ్వడానికి చర్చ జరగాలని చంద్రబాబు చెప్పగానే టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య ఈ అంశంపై చర్చకు పెట్టడాన్ని ఆయన గుర్తు చేశారు. అంబటి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు నష్టం కలుగజేసి తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపులు కోరుకోవట్లేదని చెప్పారు. బీసీల ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినకుండా చేయాలని కోరుతున్నారన్నారు. బీసీలకు హానిచేసి కాపులకు మేలు చేయాలని వైఎస్సార్‌సీపీ కోరుకోవట్లేదన్నారు. అయితే ఒకపక్క కాపులకు రిజర్వేషన్ ఇస్తానని బాబు చెబుతూనే మరోపక్క బీసీల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అదే సమయంలో కాపు ఉద్యమంలో చీలికతెచ్చి దాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే చౌకబారు ఎత్తుగడతో బాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఉద్యమిస్తున్న ముద్రగడను మినహాయించి.. కొం దరు కాపు నేతలతో సీఎం సమావేశమవడాన్ని ఆయన గుర్తు చేశారు. మరోవైపు కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానంటున్న బాబు తుని కాపు గర్జనలో పాల్గొన్న 27 మంది కాపు నేతలపై కేసులు పెట్టించడాన్ని ప్రశ్నించారు.

 తుని ఘటనల్లో ‘తుళ్లూరు’ దుండగులు..
 తునిలో కాపు ఉద్యమానికి చెడ్డపేరు తేవాలన్న తలంపుతోనే రైలు దగ్ధం, విధ్వంసం వంటి ఘటనలకు అధికార పార్టీకి చెందినవారు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్నది తుళ్లూరు దుండగులేనని అంబటి ఆరోపించారు. తుళ్లూరులో ఎవరైతే దుండగులు రైతుల్ని భయభ్రాంతులను చేయడానికి పంటల్ని తగులబెట్టారో వారే తునిలో ఈ చర్యలకు  పాల్పడ్డారన్నారు. తుళ్లూరులో నేరస్తులు టీడీపీవారేనని చిత్తశుద్ధి గల అధికారులు నిజాలు తేల్చినా ప్రభుత్వం వారిని అరెస్టు చేయలేదన్నారు. టీడీపీలో విధ్వంసాలకు పాల్పడే గ్యాంగ్‌ను ఏర్పా టు చేసుకున్నారని.. వారే ఇలాంటివి చేస్తుంటారన్నారు.

తుని ఘటనలకు జగనే బాధ్యుడని, రాయలసీమ నుంచి వచ్చిన దుండగులే రైలును తగులబెట్టారని చెప్పడం చంద్రబాబు విడ్డూరమని, మరైతే ఈ ఘటనలకు సంబంధించిన కేసుల్లో రాయలసీమ వారిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జగన్‌పై ఆరోపణలు చేయడమంటే.. బట్ట కాల్చి ముఖాన వేయడం తప్ప మరొకటి కాదన్నారు. ‘కాపులు చాలా శాంతిపరులంటూనే కాపు నేతలపై చంద్రబాబు ఎందుకు కేసులు పెట్టారు? మొత్తం 13 జిల్లాల్లో కాపులున్న పల్లెల్లో పోలీసు పికెట్లు ఎందుకు పెట్టారు? స్థానిక కాపు నేతల్ని పోలీసులు పిలిచి ఎందుకు బెదిరించారు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసుల్ని అడ్డుపెట్టుకుని కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరేది లేదన్నారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేవారెవ్వరూ లేరన్నారు.

 బీసీ కమిషన్ జీవో జారీలో పచ్చి మోసం
 కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి జారీ చేసిన బీసీ కమిషన్ జీవోలో చంద్రబాబు పచ్చి మోసానికి పాల్పడ్డారని, ఇంతవరకూ కమిషన్‌కు పరిశీలనాంశాలు కూడా తెలియజేయలేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపుల్ని బీసీల్లో చేర్చడానికి నియమించిన మంజునాథ కమిషన్‌లో నాన్ జ్యుడీషియల్ సభ్యుల్నే నియమించలేదన్నారు. 9 నెలల వ్యవధిలో నివేదికను సమర్పించాలని ఓవైపు పేర్కొంటూనే కమిషన్ గడువును మూడేళ్లపాటు నిర్ణయించడమంటే పచ్చి మోసమేనన్నారు. కమిషన్ విచారణాంశాలేమిటో తనకింకా తెలపలేదని, అవి చూస్తేగానీ ఏమీ చెప్పలేనని చైర్మన్ మంజునాథ ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్యూలో అన్నారని, నిర్దేశించిన 9 నెలల గడువులోపు నివేదికిచ్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారేతప్ప కచ్చితంగా ఏమీ వెల్లడించలేదన్నారు.

కాపుల్ని బీసీల్లో చేర్చడానికి అవసరమైన సమాచారాన్ని తీసుకోవడానికే సుదీర్ఘకాలం పడుతుందని మం జునాథ చెప్పడాన్ని అంబటి ప్రస్తావించారు. ప్రభుత్వ జీవోను, మంజునాథ ఇంటర్యూను చూసిన ఏమాత్రం జ్ఞానమున్న వారికైనా కాపులకు మేలు చేస్తానని బాబు చెప్పేదంతా శుద్ధ అబద్ధమని తేలిపోతుందన్నారు. ముద్రగడ తునిలో కాపు గర్జన నిర్వహిస్తున్నట్లు ప్రకటించగానే హడావుడిగా చంద్రబాబు జీవో ఇచ్చినట్లుగా ఉంది తప్ప కాపులకు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఆయనలో కనిపించట్లేదని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: