నాకు చంద్రబాబుకు అదే తేడా: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాకు చంద్రబాబుకు అదే తేడా: వైఎస్ జగన్

నాకు చంద్రబాబుకు అదే తేడా: వైఎస్ జగన్

Written By news on Tuesday, February 23, 2016 | 2/23/2016


నాకు చంద్రబాబుకు అదే తేడా: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జీవితమంతా దొడ్డిదారినే నడిచిందని, దొడ్డిదారిన ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే ఆయన జీవిత కాలం అంతా గడిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ.. దొడ్డిదారిలోనే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి దివంగత నేత ఎన్టీఆర్‌ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి, అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. 'చంద్రబాబుకు నాకు చిన్న తేడా ఉంది. చంద్రబాబు తన జీవితమంతా దొడ్డిదారిన ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే సరిపోయింది. పూర్వం ఎన్టీఆర్‌ చలువతో గెలిచిన ఎమ్మెల్యేలను దొడ్డిదారిలో తనవైపు లాక్కొని.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు.

అలాగే వైఎస్ఆర్ సీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలను కూడా దొడ్డిదారిన లాక్కున్నారు. ఇప్పుడు తాజాగా నలుగురు ఎమ్మెల్యేలను దొడ్డిదారిలో లాక్కున్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటుపడకుండా జాప్యం చేసేందుకు చూస్తున్నారు. ఇప్పుడు కానీ, ఇంతకుముందు నేను అధికారంలో లేను. అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల పక్షమే నిలబడ్డాను. చంద్రబాబులా దొడ్డిదారిలో ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించలేదు. ఒకవేళ ఎమ్మెల్యేలు మాతో కలిసి వస్తే.. వారితో అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయిస్తామని, వారు డిస్ క్వాలిఫై అయ్యాక... ప్రజల ఆశీస్సులతో మళ్లీ గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అదే తనకు చంద్రబాబుకు ఉన్న తేడా అని వైఎస్ జగన్ అన్నారు.

చంద్రబాబు ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా తన అనుకూల మీడియాతో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని, నిస్సిగ్గుగా ఈ విషయాన్ని సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్‌భవన్‌ వద్ద తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతామని  అనకపోయినా అన్నట్టు ప్రచారం చేశారని, అందుకే తాము వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నామని తాను చేసిన వెధవ పనిని చంద్రబాబు సమర్థించుకుంటున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అంత అన్యాయమైన వ్యక్తి దేశంలో ఎవరూ ఉండరని, ఆయనను నమ్మేవారు ఎవరూ లేరని, చంద్రబాబుది మునిగిపోయే పడవ అని వైఎస్ జగన్  పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారని, ఆయన మాత్రం తప్పుడు మార్గంలో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండో సంవత్సరం దాటిందని, మూడో సంవత్సరం దాటితే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు క్యూ కడతారని, ప్రజా వ్యతిరేకతతో గ్రామాల్లోకి వెళితే ప్రజలు చంద్రబాబును తరిమికొడతారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల విషయంలో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని, ప్రభుత్వం తన చేతిలోనే ఉన్నా, పోలీసులు ఉన్నా, రిగ్గింగ్ చేసినా ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని, పైన దేవుడు, కింద ప్రజలు చూస్తున్నారని, ఆ ఇద్దరు కలిసి కొడితే చంద్రబాబు గూబ ఏరకంగా గుయ్యిమంటుందోనని జగన్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: