అప్పుడు పశువులు.. ఇప్పుడు కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పుడు పశువులు.. ఇప్పుడు కాదా?

అప్పుడు పశువులు.. ఇప్పుడు కాదా?

Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016


అప్పుడు పశువులు.. ఇప్పుడు కాదా?
పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు అండ్ కో వింత వ్యాఖ్యలు
 
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై నిన్న, మొన్నటివరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు ఎన్నో సుద్దులు చెప్పారు. తెలంగాణలో ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్ పార్టీ సంతలో పశువులను కొన్నట్లు కొంటోందని, ఆ పార్టీకి మగతనం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. వారి ఇళ్ల ముందు చావు డప్పులు మోగించడం, చీపుర్లు, చెప్పుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలను సైతం తెలుగుదే శం కార్యకర్తలు నిర్వహించారు. కానీ ఇప్పుడు.. ‘తాము చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి..’ అన్నట్టుగా ఉంది టీడీపీ వ్యవహారం. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని..
 
సంతలో పశువులు మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారు. చేతనైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలి. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండి.
-రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప్రకాష్‌గౌడ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. (ప్రకాష్‌గౌడ్ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు)
 
సనత్‌నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఏ పార్టీ తరఫున గెలిచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లూ.. ఇది న్యాయమా? టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే, అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్ధంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉంది.
-గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు
 
సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక టీడీపీ నేతలను ఇతర పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయి. తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేస్తే వారు పార్టీని వదలడం బాధాకరం.
 - మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు
 
టీ  టీడీపీ నుంచి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలది వెన్నెముకలేని బతుకు. ఇబ్బంది కలిగించిన వారిని ఎదిరించి నిలబడాలి, తలబడాలి. కానీ ఆ నాయకులు సీఎం కేసీఆర్ కాళ్లముందు మోకరిల్లారు. ఫిరాయింపులతో పదవులు, సొమ్ములు రావొచ్చేమో గానీ గౌరవం రాదు.
 -ఎనుముల రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ
Share this article :

0 comments: