అవినీతి మురికిని దాచేసేందుకు చంద్రబాబు సంత బేరం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతి మురికిని దాచేసేందుకు చంద్రబాబు సంత బేరం!

అవినీతి మురికిని దాచేసేందుకు చంద్రబాబు సంత బేరం!

Written By news on Saturday, February 20, 2016 | 2/20/2016


అవినీతి మురికిని దాచేసేందుకు చంద్రబాబు సంత బేరం!
కాసులు కురిపిస్తాం... మంత్రి పదవిస్తాం
♦ ప్రతిపక్ష శాసనసభ్యులకు పదవుల ఎర
♦ భారీగా ముడుపులు ఇస్తానంటూ ప్రలోభాల పర్వం
♦ ఇసుకనుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకూ అడ్డగోలు అవినీతితో రూ.వేల కోట్ల దోపిడీ.. ఆ సొమ్ముతో పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు యత్నాలు
♦ ఓటుకు రూ.ఐదు నుంచి రూ.20 కోట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు
♦ ఇప్పుడు సొంత రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు భారీ రేంజ్‌లో ఆఫర్‌లు

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అవహేళనచేస్తూ అటకెక్కించిన చంద్రబాబు ప్రభుత్వం నేడు ప్రజాతీర్పునూ ఎగతాళి చేస్తూ సంతబేరాలకు నడుం కట్టింది. అలవిమాలిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన నేపథ్యంలో పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతను, ప్రజల దృష్టినీ పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. పదవులు, పనులు, ముడుపులను ఎరగా చూపుతూ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు టీడీపీ అధినేత సిగ్గెగ్గులు లేనిరీతిలో వ్యవహరిస్తున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవినీతి, అక్రమాలతో సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న  బాబు, ఆయన కోటరీ... ఇప్పుడు ఆ డబ్బులను వెదజల్లి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమాలను  చేపడుతోంది. తెలంగాణలో పార్టీకి దిక్కూమొక్కూ లేకుండా పోయిన దశలో... పరువు కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే రీతిలో దుస్సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారని పరిశీలకులు దుయ్యబడుతున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ ఎంపీలపై వలవేసిన బాబు తాజాగా ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నారు. జిల్లాల్లోని ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేయిస్తూ, తన వర్గీయుల ద్వారా మంతనాలను నెరుపుతూ, తాయిలాల ఆశలు చూపుతూ  ఏదోవిధంగా టీడీపీ దరిచేర్చుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అందులో భాగంగా అనుంగు పత్రికలు, మీడియా ద్వారా అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రజలకు హామీలు ఇచ్చిన రీతిలోనే నేతలను మభ్యపెడుతూ మంత్రి పదవుల ఆశలు చూపుతున్నారనే సమాచారం పొక్కుతోంది.

 బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...
 సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని రైతన్నలను మోసం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళలను ముంచేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ వాగ్దానం చేసి వారిని వీధుల్లోకి లాగారు. ఇదే అంశంలో మరోవైపు బీసీలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అశాంతి పరిస్థితులను కల్పించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఆశలు చూపి నిరుద్యోగ యువతకు ఏమీ చేయకుండా వారిని ఎగతాళి చేశారు. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాలనుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

టీడీపీ నేతలు ఏ ఊరు వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేతలూ దిక్కులు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ పనులను తాత్కాలిక పద్ధతిలో చేపట్టి అక్రమాలను కొనసాగిస్తూ అందులో నుంచి వందలు, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు. ఏపీకి వరప్రదాయినిగా భావించే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి తాత్కాలిక ప్రయోజనాల పేరిట పట్టిసీమలో రూ.500 కోట్లకు పైగా నొక్కేశారు. గోదావరి పుష్కరాల పేరిట  1600 కోట్లతో తాత్కాలిక పనులు  చేపట్టి, ఏమాత్రం శాశ్వత ప్రయోజనాలు కల్పించకుండా అభాసుపాలయ్యారు. తన ప్రచార్భాటం కోసం తొక్కిసలాటకు కారకులై భక్తుల మృతికి బాధ్యులయ్యారు. ఆయా పండుగల సమయాల్లో పేదలకు ‘చంద్రన్న’ కానుకల పేరిట రెండేళ్లలో రూ.750 కోట్ల వరకు ఖర్చుచేశారు.

నాసిరకం వస్తువులను కూడా సరిగా పంపిణీ చేయలేక తన పరువు తీశారని బాబు మంత్రులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలు రెండు వేల కోట్లు దాటాయని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి యనమల  ప్రకటించారు. ఇక రాజధానిప్రాంతంలో చంద్రబాబు సర్కారు చేయని అరాచకం అంటూ లేదు. అమరావతిని టీడీపీ రియల్‌ఎస్టేట్ ప్రాంతంగా మార్చేసి భారీ దోపిడీకి ప్రణాళికలు కొనసాగిస్తున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం పంచిన అసైన్డ్ భూములను తనకు, తన కోటరీకి దక్కేలా వ్యవహారాలు నడుపుతున్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు చేపట్టిన ప్రతి పనిలోనూ జనానికి రోత పుట్టించే రీతిలో వేల కోట్ల అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం వాటిని మరుగుపరిచేందుకు అనైతిక రాజకీయాలను కొనసాగిస్తోంది. ప్రజల దృష్టిని మళ్లించకపోతే పార్టీ మట్టికొట్టుకు పోతుందన్న భయంతో, ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన అవినీతి సొమ్మును ప్రలోభాలకు వెచ్చించడానికి సిద్ధపడిన బాబు సర్కారు విపక్ష ఎమ్మెల్యేలతో సంతబేరానికి ఒడిగడుతోంది. ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారంటూ సాక్షాత్తు కేబినెట్‌లో మంత్రులకు టార్గెట్లు పెట్టడం బరితెగింపునకు పరాకాష్ట అని పరిశీలకులు దుయ్యబడుతున్నారు. నిత్యం రాజకీయాల్లో నైతిక విలువల గురించి ఏకరువు పెట్టే ముఖ్యనేత ఫిరాయింపులను ప్రోత్సహించలేని మీరెందుకని కేబినెట్ భేటీలో  సహచర మంత్రులను ఛీత్కరించుకున్న వైనాన్ని గుర్తుచేసుకుంటూ ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారు.

 తెలంగాణలో తెల్లారిపోవడంతో...
 తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తుడుచిపెట్టుకుపోతుండటంతో దిమ్మతిరిగిన చంద్రబాబుకు ప్రజావ్యతిరేకతతో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ పరిస్థితి తలెత్తుతుందనే భయాందోళనలు నిలువెల్లా అలముకున్నాయి. అంతకుముందు తెలంగాణ శాసనమండలిలో ఒక్క స్థానాన్ని దక్కించుకునేందుకు ఓట్ల బేరసారాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయి పరువును బజారున పెట్టుకున్నారు. ఒక్కో ఓటుకు అయిదు నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్మును ఇవ్వజూపి ఆడియో- వీడియో టేపుల్లో ఇరుక్కుపోయారు. పక్కరాష్ట్రంలోనే ఓటుకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు సొంత రాష్ర్టంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేయడానికి ఏ రేంజ్‌లో ఆఫర్లు చేస్తుంటారో ఊహించుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అవినీతి డబ్బులకు లొంగే అవసరం లేని వారికి మంత్రి పదవులను ఎరవేస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది. మరికొందరికి భారీ కాంట్రాక్టులకు కానుకగా ఇస్తామని హామీలిస్తూ ఆకర్షిస్తున్నారని తెలుస్తోంది. శాసనసభలో బలమైన ప్రతిపక్షాన్ని ఎదిరించే సత్తాలేక ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుంగు మీడియా ద్వారా ఫిరాయింపు వార్తలను ప్రచారం చేయించుకుంటున్న తీరును చూసి ప్రజాస్వామికవాదులు విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును గౌరవించే సంస్కారం లేని నాయకత్వంతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతుందనే భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఫిరాయింపుల చట్టంపై కనీసం గౌరవం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ మా వాడే, మీ సభ్యత్వానికి ఢోకా ఉండదు... రండి రండంటూ స్వయంగా కీలక నేతే ఫోన్లు చేసి పిలవడాన్ని, మంతనాలు జరుపుతుండటాన్ని పలువురు శాసనసభ్యులు ఛీత్కరించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని సంతబేరంగా మార్చిన చంద్రబాబు చర్యలపై పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Share this article :

0 comments: