భూములివ్వని రైతుల పంటను ధ్వంసం చేసిన రెండు నెలల తర్వాత విచారణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూములివ్వని రైతుల పంటను ధ్వంసం చేసిన రెండు నెలల తర్వాత విచారణ

భూములివ్వని రైతుల పంటను ధ్వంసం చేసిన రెండు నెలల తర్వాత విచారణ

Written By news on Monday, February 8, 2016 | 2/08/2016


నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు!పొలాన్ని సందర్శిస్తామంటూ బాధిత రైతులకు సీఆర్‌డీఏ రాసిన లేఖ
రాజధానికి భూములివ్వలేదని అరటి తోట ధ్వంసం
విచారణ జరిపి.. పరిహారమిస్తాం
రెండు నెలల తర్వాత బాధితులకు సీఆర్‌డీఏ లేఖ

 
సాక్షి, హైదరాబాద్: నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు! అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతుల పంటను ధ్వంసం చేసిన రెండు నెలల తర్వాత విచారణ జరుపుతామనడం విస్మయం కలిగిస్తోంది. రాజధాని అమరావతిలో భూ సమీకరణకు సహకరించని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్, ఆయన సోదరుడు గుండపు చంద్రశేఖర్‌కు చెందిన 7.3 ఎకరాల అరటి తోటను 2015 డిసెంబర్ 8న సీఆర్‌డీఏ యూనిట్-16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో మూడు బుల్డోజర్లతో తొలగించిన విషయం తెలిసిందే.

భూ సమీకరణకు అంగీకరించబోమని, పొలాన్ని సాగు చేసుకుంటామని రాజేష్ సోదరులు తేల్చిచెప్పడం వల్లే ప్రభుత్వం వారి అరటి తోటను నాశనం చేసిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పంటను నాశనం చేయడాన్ని రాజేష్ సోదరులు ప్రశ్నిస్తే..  నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో పరిహారం అందుతుందని రాజేష్ సోదరులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పంట ధ్వంసమైన పొలాన్ని అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడానికి విచారణ చేపడుతుందని పేర్కొంటూ బాధితులకు సీఆర్‌డీఏ తాజాగా లేఖ రాసింది. అధికారుల బృందం ఫిబ్రవరి 9న పొలాన్ని సందర్శించనుందని పేర్కొంది.

రాజేష్ సోదరుల భూమిలో తొలగించిన అరటి చెట్లు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. అక్కడ అరటి తోట ఉందనే ఆనవాళ్లు కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రెండు నెలల తర్వాత వస్తే నష్టపరిహారం ఎలా నిర్ణయిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, పరిహారం చెల్లించడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ వ్యవహారమే నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Share this article :

0 comments: