22 నెలలు ఎన్నో కుంభకోణాలు.. కొల్లగొట్టింది 1,35,063 (రూ. కోట్లలో) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 22 నెలలు ఎన్నో కుంభకోణాలు.. కొల్లగొట్టింది 1,35,063 (రూ. కోట్లలో)

22 నెలలు ఎన్నో కుంభకోణాలు.. కొల్లగొట్టింది 1,35,063 (రూ. కోట్లలో)

Written By news on Tuesday, March 8, 2016 | 3/08/2016


అవినీతి విశ్వరూపం
22 నెలలు ఎన్నో కుంభకోణాలు.. కొల్లగొట్టింది 1,35,063 (రూ. కోట్లలో)
 చంద్రబాబు ఒక్క అడుగు వేస్తే.. అవినీతి కోట్ల అడుగులు వేస్తోంది. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగరి..
 ఏ పేరైతే ఏం.. ప్రాజెక్టు పేరు చెబితే చాలు అవినీతి ప్రవాహం ఏరులైపారి నారా వారి బ్యాంకు ఖాతాల్లో దూరిపోతోంది.  ఇసుక రేవు నుంచి విమానాల రేవు దాకా, భూమిపైన మట్టి, ఇసుక నుంచి, భూమిలోని బొగ్గు, బెరైటీస్ నుంచి, భూమిపైన సోలార్ పవర్, ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకూ అన్నింటా కరప్షన్ కరప్షన్. అసలు మొత్తం భూములనే కుంభకోణాల పుడమిగా మార్చి రాజధానినే పెద్ద స్కాముగా చేసిన ఘనత మరెవ్వరికీ సాధ్యంకాదని నిరూపిస్తున్న బాబు కుంభకోణాల బాగోతాలు ఆధారాలతో సహా మీ ముందుకు తెస్తున్నాం..

ఇద్దరు సీఎస్‌లు కాదన్నా... ఇరిగేషన్‌లో దోపిడీ..6,000 కోట్లు
 గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్), హంద్రీ-నీవా సుజల ్రసవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్), గోరకల్లు పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 60(సి) కింద తొలగించి, ఆ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచి, పాలనా అనుమతులు తీసుకోకుండా టెండర్లు పిలిచారు. అదేమి విచిత్రమో గానీ.. 25 ప్యాకేజీల్లో ఇలా టెండర్లు పిలిస్తే.. అన్నీ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఇతర నేతలకే వచ్చాయి. కాదు.. కాదు.. ఇచ్చారు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా రూ. 6 వేల కోట్లు నొక్కేయడానికి అంతా సిద్ధమైపోయారు. అని ప్యాకేజీల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులూ చెల్లించేశారు. సగానికిపైగా బిల్లులూ ఇచ్చేశారు. పరిపాలనా అనుమతులు లేకుండా బిల్లులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని, ఆడిట్ అభ్యంతరాలు వస్తాయని ఆర్థిక శాఖ.. కుంభకోణాన్ని పసిగట్టిన తర్వాత ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని అవినీతి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ దశలో అవినీతిని ఎత్తిచూపుతూ ‘సాక్షి’ విస్తృతంగా కథనాలు రాయడంతో.. తీగ, డొంక కదిలాయి. రూ. 6 వేల కోట్ల కుంభకోణానికి నీతిపూత పూయడానికి.. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, గోరకల్లు అంచనాల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. ఇంత అడ్డగోలు వ్యవహారాలను తమ సర్వీసులో కనీవినీ ఎరుగమని, సంతకాలు చేయడానికి అప్పటి సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఇప్పటి సీఎస్ ఎస్పీ టక్కర్ తిరస్కరించారు. అయినా పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం.. అడ్డగోలు అవినీతికి.. నీతి ముసుగు తొడగడానికి ‘మంత్రివర్గం’ మంత్రాన్ని చినబాబు, పెదబాబు పఠించి, విజయవంతంగా అవినీతికి ఆమోదముద్ర వేయించడం అధికారులకే ఆశ్చర్యం కలిగించింది. సీఎస్‌లు తిరస్కరించడంతో.. మూడుసార్లు ఇదే అంశం మంత్రివర్గం ముందుకు వెళ్లాల్సి వచ్చింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడా ఒకే అంశం మూడుసార్లు మంత్రివర్గం ముందుకు వెళ్లిన సందర్భమే ఉండదు. మంత్రివర్గ నిర్ణయాన్ని, ఉత్తర్వులు మార్చడానికి సంతకాలు చేయబోమని ఒకరు కాదు ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించారంటే.. ఎంత అడ్డగోలు అవినీతి జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

 ఈపీసీకి టాటా.. అదనపు చెల్లింపుల్లో వాటా 1,500 కోట్లు
 ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేసి ఆ ‘అదనం’ నుంచి భారీగా ముడుపులు కొట్టేయడానికి పథకం పన్నారు. జలవనరుల శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంక్రీట్ పనులకు తాజా ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనివల్ల ఖజానాపై రూ. 3,000 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. అదనపు చెల్లింపుల్లో సగం వాటా ముడుపుల రూపంలో ప్రభుత్వ పెద్దలకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని వినిపిస్తోంది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో మంజూరు చేసిన కాంట్రాక్టుల్లో అదనపు చెల్లింపులకు అవకాశం లేదు. కానీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22, జీవో 63 ప్రకారం ఇప్పటికే క్యూబిక్ మీటర్ కాంక్రీట్‌కు రూ. 2,500 నుంచి రూ. 4,000కు పెరిగింది. ఆ మేరకు అదనపు చెల్లింపులు చేస్తున్నారు. అయితే తాజాగా క్యూబిక్ మీటర్‌కు రూ.7,000 చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడడం గమనార్హం.  కాంట్రాక్టర్లకు అదనపు సొమ్ము చెల్లించడం కోసమే జీవో 22, 63లను ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మికులు, ఇసుక, మిషినరీ, డీవాటరింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్, కఠిన నేలల తవ్వకం, అత్యంత కఠిన నేలల తవ్వకం.. ఇలా పలు అంశాల్లో తాజా ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం అదనపు చెల్లింపులు చేయడానికి ఈ రెండు జీవోలు అవకాశం కల్పించాయి.

 పోలవరం అంచనా వ్యయం పెంపు

 పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టిన సమయంలో (2005-06) ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,151.40 కోట్లు. ఆ తర్వాత  2010-11లో సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 16,010.45 కోట్లు. ఇందుకు ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 31,000 కోట్లకు పెంచేసింది. అందులో రూ. 3,000 కోట్లకు పైగా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి చేరనున్నాయని అధికారవర్గాలంటున్నాయి. అలాగే ప్రస్తుత కాంట్రాక్టర్ చేస్తున్న ప్రాజెక్టు పనుల వ్యయాన్ని రూ. 4,054 కోట్లకు రూ. 2,907 కోట్లను చేర్చి ఆ పనుల విలువను రూ. 6,961. 70 కోట్లకు పెంచేశారు. ఇందులో కూడా రూ.690 కోట్లు ప్రభుత్వ పెద్దలకేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

 ముడుపుల పట్టిసీమ 700 కోట్లు
 ఆంధ్రప్రదేశ్‌కి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాల్సింది పోయి అందులో భాగమైన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ముడుపుల కోసమే తెరపైకి తెచ్చారు. దీని వెనక పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. రూ. 1,300 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు టెండర్లు కమీషన్ కోసం తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కే దక్కేలా చేశారు. 21.9 శాతం అధిక ధరలకు కోట్ చేసిన మెగా సంస్థకు పనులు కట్టబెట్టేశారు. ఇందుకు ప్రతిఫలంగా చినబాబుకు రూ. 400 కోట్ల మేర ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇచ్చిన గడువులో పూర్తి చేస్తే 5 శాతం పైన కోట్ చేసిన మొత్తాన్ని అదనంగా ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? తమతో అవగాహన ఉన్న కంపెనీకి కాంట్రాక్టు దక్కడం తద్వారా కాంట్రాక్టర్ నుంచి కాసులు రాల్చుకోవడం కోసం అడ్డగోలుగా నిబంధనలు మార్చేశారు. సవరణలు చేశారు. డిజైన్ మార్చడం, మోటార్లు - పైప్‌లైన్ల సంఖ్యను తగ్గించడం వల్ల ఖర్చు తగ్గుతున్నా అదనంగా రూ.250 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడానికి ముడుపులే కారణమని నీటిపారుదల శాఖ అధికారులంటున్నారు. మొత్తంగా పట్టిసీమ అంచనా వ్యయాన్ని రూ.1,600 కోట్లకు పెంచి ఆ మేరకు తమ వాటాగా రూ. 700 కోట్లు నొక్కేయాలన్నది పెదబాబు, చినబాబు పథకంగా కనిపిస్తోంది.

 ‘అదనపు మద్యం...’2,000 కోట్లు
 ఎక్సైజ్ శాఖలో గత ఏడాది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అమలవుతున్న మద్యం పాలసీని తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే తమిళనాడు తరహా పాలసీతో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాల్సి ఉంది. మద్యం అమ్మకాల్లోనూ ఎంఆర్‌పీ ధరకు మించి అమ్మేందుకు సిండికేట్లు ప్రతినెలా 13 జిల్లాల్లో కలిపి రూ.100 కోట్ల ముడుపులు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ 20 నెలల్లో రూ. 2,000 కోట్ల మేర ముడుపులు అందాయన్నమాట. అలాగే రాష్ర్టంలో మద్యం కొరత పేరుతో అదనపు మద్యం ఉత్పత్తికి డిస్టిలరీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకున్న 12 డిస్టిలరీలలో నాలుగు డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. ఈ వ్యవహారంలో రు. 40 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.

 బినామీకి బడా ప్రాజెక్టులు 1,400 కోట్లు
 ఈవీఎం దొంగ.. వాటి ట్యాంపరింగ్ కేసులో నింది తుడు.. టీడీపీ ఐటీ సలహాదారు.. హెరిటేజ్ సంస్థలో సన్నిహిత సంబంధాలు ఉండే తన బినామీ వేమూరు హరికృష్ణ ప్రసాద్‌కు పలు విలువైన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు. ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన టెరా సాఫ్ట్‌వేర్ అనుబంధ సంస్థలకు ఇప్పటికే రూ.320.85 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును కృటాయించారు. అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  యు-విన్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.45 కోట్ల నుంచి రూ.180 కోట్లకు పెంచేసి.. అదే సంస్థకు ఇచ్చేశారు. అలాగే పాలనలో పారదర్శక.. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా రూ.2,398 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ-ప్రగతి ప్రాజెక్టునూ టెరా సాఫ్ట్‌వేర్ భాగస్వామ్య సంస్థ అయిన సిస్కో సాఫ్ట్‌వేర్‌కు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు దాదాపు రూ. 2,800 కోట్లు విలువైనవి.. అంటే దాదాపు రూ. 1,400 కోట్లు వరకు లబ్ది చేకూరినట్లేనని అధికారవర్గాలంటున్నాయి.

 గాలేరు-నగరి, అవుకు...153 కోట్ల రూపాయలు
 గాలేరు - నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) 29వ ప్యాకేజీలో మిగిలిపోయిన పనుల విలువ రూ. 11 కోట్లు. కానీ వీటి విలువను రూ.110 కోట్లకు పెంచేశారు. పరిపాలనా అనుమతులు లేకుండానే టెండర్లను పిలిచి అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’కి అప్పగించారు. రూ. 35 కోట్ల బిల్లులు చెల్లించిన తర్వాత వాటాల పంపకంలో సాగునీటి శాఖ మంత్రికి, ఎంపీకి మధ్య విభేదాలు తలెత్తడంతో పరిపాలనా అనుమతులు లేని విషయం బైటపడింది. దాంతో సీఎం రమేష్ కంపెనీకి నిధుల చెల్లింపు ఆగిపోయింది. దాంతో జీఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా చేపట్టిన అవుకు సొరంగం (ప్యాకేజీ -30) లో అవినీతిని సీఎం రమేష్ బైటపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్ల మేర అదనంగా చెల్లించడానికి నీటి పారుదల శాఖ సిద్ధమైందంటూ ప్రభుత్వానికి ఎంపీ లేఖ రాశారు. ఈ రెండు ఉదంతాలలో బైటకు కనిపించిన అవినీతి రూ. 99 కోట్లు, రూ. 44 కోట్లు... వెరసి రూ. 153 కోట్లు..

 బెరైటీస్ గనుల్లోనూ దందా..178 కోట్లు
 బెరైటీస్ ఖనిజ విక్రయ టెండర్లలోనే హీనపక్షం రూ. 178 కోట్ల దందా సాగింది.  బెరైటీస్ ఖనిజ విక్రయాలకు గ్లోబల్ టెండర్లంటూ అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై బెరైటీస్ ఖనిజ కనీస ధరను తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఖజానాకు చిల్లు పెట్టింది. తదుపరి సర్కారు పెద్దల అండతో  టెండర్లలో పాల్గొన్న సంస్థలన్నీ ‘రింగ్’గా మారాయి. సర్కారు తీరువల్ల ఏపీఎండీసీకి  రూ. 178.60 కోట్ల  మేరకు గండి పడింది. వైఎస్సార్ జిల్లాలోని మంగంపేట బెరైటీస్ ఖనిజ విక్రయ ధరలను తగ్గిం చడం ద్వారా కొనుగోలు సంస్థలకు ప్రభుత్వం పరోక్షంగా లాభం చేకూర్చింది.  కనీస ధరల ప్రకారం చూసినా.. మూడు లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్ ఖనిజం మీద రూ. 22.50 కోట్లు, లక్ష టన్నుల ‘బి’ గ్రేడ్ ఖనిజం మీద 6.10 కోట్లు కలిపి మొత్తం రూ. 28.60 కోట్ల  రాబడిని ప్రభుత్వం కోల్పోయినట్లే. ఈ మేరకు బెరైటీస్ బేసిక్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో 163 జారీ చేసింది.

 విదేశీ బొగ్గును మింగేశారు 500కోట్ల రూపాయలు
 ఏపీ జెన్‌కో విదేశీ బొగ్గు కొనుగోలులో రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమయ్యింది. దీనిపై హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు  విదేశీ బొగ్గు కొనేందుకు 2013 మే 6న  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఈసీ లిమిటెడ్, ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌తో జెన్‌కో ఒప్పందాలు చేసుకుంది. కాంట్రాక్టు గడువు ఆరు నెలలే అయినా 2015 వరకూ ఈ కొనుగోళ్ళు జరిగాయి. తెరమీద ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నా, సబ్ కాంట్రాక్టు ముసుగులో కోల్ మాఫియా చక్రం తిప్పింది. అందుకే కాంట్రాక్టు సమయంలో 12 లక్షల టన్నుల బొగ్గు కొంటే, కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువగా 19.25 లక్షల టన్నులు కొనుగోళ్లు జరిగాయి.

కాంట్రాక్టు సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు 69.15 డాలర్లు ఉంది. సముద్ర రవాణా ఛార్జీలు (11 డాలర్లు) కలుపుకుంటే టన్ను 80.15 డాలర్లు అవుతుంది. 2015 మార్చి నాటికి బొగ్గు ధర టన్నుకు 52.40 డాలర్లకు పడిపోయింది. రవాణా ఛార్జీలతో కలిపి (7.23 డాలర్లు) 59.63 డాలర్లు అవుతుంది. ఈ లెక్కన ఏపీ జెన్‌కో టన్నుకు 20.55 డాలర్లు అధికంగా చెల్లించింది. 19.25 లక్షల టన్నులకు ఏపీ జెన్‌కో అదనంగా రూ. 246 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కృష్ణపట్నం పోర్టు నుంచి థర్మల్ ప్రాజెక్టుకు చేర్చడం కాంట్రాక్టర్ల బాధ్యత. అయినా ఈ ఛార్జీలనూ చెల్లించారు. దీనికి మొదటి కాంట్రాక్టు సమయంలో రూ. 100 కోట్లు, కాంట్రాక్టు తీరిన తర్వాత రూ. 200 కోట్లు హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో చెల్లించారు. ఇలా మొత్తం రూ. 546 కోట్లు ఏపీ జెన్‌కో సొమ్ము ఖర్చు చేశారనేది ఆరోపణ. ఇందులో ప్రభుత్వాధినేతకు భారీగా ముడుపులుగా వెళ్ళాయనే ఆరోపణలు వచ్చాయి.

 బామ్మర్ది వియ్యంకుడికి...245 కోట్లు
 కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతి పురంలో రూ. 250 కోట్ల విలువైన భూమిని రూ. 4.99 కోట్లకే విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి టీడీపీ సర్కారు రాయించేసింది. ఈ కంపెనీ యజమాని సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, సీఎం బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబానికి చెందినది కావడం గమనార్హం. ఎకరా రూ. 50 లక్షల విలువైన భూమిని రూ. లక్ష ధరతో విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి  చెందిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు ఏకంగా 498.93 ఎకరాలు ధారాదత్తం చేయడం అత్త సొత్తు (సర్కారు ఆస్తి) అల్లుడు (సీఎం) దానం చేసినట్లు ఉంది. ఈ భూమిని పారిశ్రామిక పార్కు కోసం ఏపీఐఐసీకి కేటాయిస్తూ గత ప్రభుత్వం 2013 సెప్టెంబరు 28వ తేదీన ఉత్తర్వులు (జీవో 523) జారీ చేసింది. ప్రస్తుత చంద్రబాబు సర్కారు ఈ భూమిని ఇండస్ట్రియల్ పార్కుకు బదులు వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు యూరియా కర్మాగారం ఏర్పాటు నిమిత్తం కేటాయిస్తున్నట్లు 2015 జులై 15వ తేదీన ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబరు 269) జారీ చేయడం గమనార్హం.

 పత్తి కుంభకోణంలో మంత్రికి వత్తాసు 200 కోట్ల రూపాయలు
 అన్నదాతల కడుపుకొట్టి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న గుంటూరు జిల్లాకు చెందిన పత్తి వ్యాపారి, సీఆర్‌డీఏలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారన్న ఆరోపణలొచ్చాయి. గుంటూరుజిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సేకరించిన పత్తిలో 80శాతం బోగస్ రైతుల నుంచే కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చింది. కానీ ఆ విజిలెన్స్ నివేదికను ముఖ్యమంత్రి బుట్టదాఖలు చేశారు. కుంభకోణంలో సూత్రధారిగా ఉన్న మంత్రికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న ఈ కుంభకోణంలో రైతులకు దక్కాల్సిన రూ. 200 కోట్లను మంత్రి బంధువులు, బ్రోకర్లు బొక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

 ‘సోలార్’ గోల్‌మాల్ 755 కోట్లు
 సోలార్ టెండర్ల వ్యవహారంలో ప్రైవేటు కంపెనీలకు మేలుచేసేలా ఏపీజెన్‌కో వ్యవహరిం చింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారిచెరువులో ఏపీ జెన్‌కో 500 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈపీసీ కాంట్రాక్టులకు టెండర్లు పిలిచింది. ఎల్-1గా బీహెచ్‌ఈఎల్ మెగావాట్‌కు రూ. 6.26 కోట్లకు రివర్స్ బిడ్డింగ్ ద్వారా ఎంపికైంది. ఇదే ధరను మిగతా సంస్థలు (స్టెర్లింగ్, టాటా, ఎల్ అండ్ టీ, మెగా)కు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. బీహెచ్‌ఈఎల్‌ను ముందు పెట్టి అదే ధరకు ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టడానికి ఏపీ జెన్‌కో సిద్ధమవుతోంది.  ఇదే జిల్లాలో ఎన్‌టీపీసీ ఆరు ప్యాకేజీలలో మెగావాట్ రూ. 4.91 కోట్లకు ఖరారు చేసింది. దీనిని బట్టి చూసినా ఏపీ జెన్‌కో అదనంగా వెచ్చిస్తోందని అర్థమౌతుంది. వాస్తవానికి  ప్రస్తుత రేట్ల ప్రకారం రాష్ట్రంలో మెగావాట్ రూ. 4.75 కోట్లతో పూర్తి చేసే వీలుందని నిపుణులు అంటున్నారు. ఇందుకు విరుద్ధంగా ఏపీజెన్‌కో మెగావాట్‌కు రూ. 1.51 కోట్ల చొప్పున ఎక్కువకు ఇస్తోంది.  దీనివల్ల సంస్థకు రూ. 755 కోట్ల నష్టం జరుగుతోంది.

 ఆ పదింటికి ‘అంతకుమించి’ రాయితీలు 5000 కోట్లు
 నూతన పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలకు అనేక రాయితీలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న చంద్రబాబు ఓ పది పరిశ్రమలకు మాత్రం ‘అంతకుమించి’ ప్రయోజనాలు కల్పించింది. రాష్ర్ట ఖజానాకు గండి కొడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం విలువ రూ. 5,000 కోట్లు పైమాటే. 10 పరిశ్రమలకు ఏకంగా రూ. 5 వేల కోట్లకు పైగా వ్యాట్, విద్యుత్ చార్జీలలో అదనంగా రాయితీలను కల్పించారు. పారిశ్రామిక విధానానికి మించి రాయితీలు పొందిన ఈ సంస్థల నుంచి ప్రభుత్వంలోని ‘పెద్ద’లకు వ్యక్తిగతంగా భారీగా ఆర్థిక ప్రయోజనాలు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన పారిశ్రామిక విధానం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు వ్యాట్, విద్యుత్ చార్జీలలో 50 శాతం మాత్రమే రాయితీలను కల్పిస్తున్నారు. ఈ పది పరిశ్రమలకు మాత్రం వ్యాట్, సీఎస్‌టీలలో నూరుశాతం రీయింబర్స్‌మెంట్‌కు సర్కారు ఆమోదం తెలపడం గమనార్హం.

 పుష్కర నిధులు గోదారిపాలు...700 కోట్లు
 గత ఏడాది జులైలో గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రాష్ర్టప్రభుత్వం రూ. 1,500 కోట్లను కేటాయించింది. అందులో రహదారులు, భవనాల శాఖకు రూ.782 కోట్లు కేటాయించింది. మిగిలిన నిధులను ఇతర పనులకు కేటాయించారు. ఈ పనుల్లో నిబంధనలన్నీ గోదాట్లో తొక్కేశారు. టీడీపీ నేతలకు పనులు కట్టబెట్టేందుకు పనులను విభజించారు. రూ. 10 లక్షల లోపు పనులను నామినేషన్ పద్దతిలో అయినవారికి కట్టబెడుతూ ఆర్‌అండ్‌బి శాఖకు ఉత్తర్వులు జారీ చేయించారు. రూ.782 కోట్ల పనుల్లో రూ. 400 కోట్ల మేర అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అప్పట్లోనే విజిలెన్స్‌కు ఫిర్యాదులు చేశారు. మొత్తంగా పుష్కరాల పనుల్లో రూ. 700 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి.

 ఇసుక మాఫియా దోపిడీ 4,500 కోట్లు
 రాష్ట్రంలో 383 రేవుల ద్వారా ఇసుక వ్యాపారం జరుగుతోంది. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా తదితర నదులపై దాదాపు 83 వరకు పెద్ద రేవులున్నాయి. ఒక్కొక్క పెద్ద రేవుల నుంచి రోజుకు కేవలం 50 లారీల ఇసుక అమ్మకం జరిగిందని లెక్కకట్టినా.. 83 రేవుల నుంచే ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి  3,174 కోట్లు ఆదాయం రావాలి. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన కొత్త ఇసుక విధానం ప్రకారం.. ఒక్కొక్క లారీ ఇసుక ధర రూ. 15 వేలుగా లెక్కకడితే.. రోజుకు 50 లారీల చొప్పున 83 రేవుల ద్వారానే ప్రభుత్వానికి 3,174 కోట్లు ఆదాయం వస్తోంది. మిగిలిన 300 చిన్న రేవుల ద్వారా రోజుకు కేవలం పది లారీల ఇసుక వ్యాపారమే జరిగిందని లెక్కతేల్చినా, వీటి ద్వారా మరో రూ. 2,295 కోట్ల  ఆదాయం రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇసుక వ్యాపారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5,469 ఆదాయం వచ్చి ఉండాలి. అయితే, ప్రభుత్వ ఖజానాకు జమ అయింది మాత్రం కేవలం రూ. 964 కోట్లు మాత్రమే. అంటే  రూ. 4,505 కోట్లకు తక్కువ కాకుండా ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లో వెళ్లిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా సీఎం కనుసన్నల్లోనే సాగుతోందని అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు వేల కోట్ల వరకు ఇసుక దోపిడీ జరిగిందని స్వయంగా రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారంటే.. ఇసుక దోపిడీ ఎంత యథేచ్ఛ కొనసాగిందో తెలుస్తూనే ఉంది.

 జెన్‌కో థర్మల్ ప్రాజెక్టుల్లో 2,680 కోట్ల రూపాయలు
 కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం ప్రతిపాదిత థర్మల్ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టు పనులను ఎక్కడా లేని ఎక్కువ ధరకు ఓ రెండు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టి చంద్రబాబు భారీ స్థాయిలో కమీషన్లు దండుకున్నారని విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తేవడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఈ రెండు ప్రాజెక్టుల బీటీజీ కాంట్రాక్టులను ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చారు. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ కాంట్రాక్టు విషయంలో బీహెచ్‌ఈఎల్ ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైనట్టు విమర్శలొచ్చాయి. ఫలితంగా కృష్ణపట్నం కాంట్రాక్టు టాటాకు, ఇబ్రహీం పట్నం పనులు బీజీఆర్‌కు కట్టబెట్టే ప్రయత్నం జరి గింది. ఈ సంస్థల కోసం ఎన్టీపీసీ అర్హత నిబంధనలు కూడా పట్టించుకోకపోవడం విశేషం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టుల్లో దాదాపు రూ.  2,680 కోట్లు ఎక్కువగా చెల్లించేందుకు జెన్‌కో సాహసించింది.

 విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున స్వాహా 4,000 కోట్లు
 ఏపీ విద్యుత్ సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. దాదాపు రూ. 15,000 కోట్ల ఆర్థిక లావాదేవీలపై విమర్శలున్నాయి. ఇందులో రూ. 4,000 కోట్లకు పైచిలుకు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు మొదలు కొని, జెన్‌కో, ట్రాన్స్‌కో కాంట్రాక్టుల అప్పగింత వ్యవహారంలో ప్రభుత్వాధినేత హస్తం ఉందనే సందేహాలున్నాయి. కొన్ని కాంట్రాక్టుల్లో అధినేత కుమారుడికీ ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చాయి. మిగులు విద్యుత్ పేరుతో అవసరం లేకున్నా స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళు చేసుకున్నారు. జెన్‌కో ఉత్పత్తి పెంచకుండా ప్రైవేటు కొనుగోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. అధికారం చేపట్టిన మరుక్షణమే ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. వినియోగం లేకపోయినా డిస్కమ్‌ల నెత్తిన ఈ భారం మోపింది. మే 2014 నుంచి అక్టోబర్ 2015 వరకూ మొత్తం 13,180 మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేశారు. దీని విలువ 8,286 కోట్ల పైమాటే. ఇందులో కొంత భాగాన్ని ఎక్కడా లేని విధంగా యూనిట్ రూ. 10కు కొనుగోలు చేయడం విశేషం. జెన్‌కో విద్యుత్ యూనిట్ రూ. 4.50 మాత్రమే ఉంది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి ప్రభుత్వాధినేత కుమారుడికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్టు విద్యుత్ వర్గాల్లో చర్చ జరిగింది

http://www.sakshi.com/news/district/corruption-vishwaroopam-320984?pfrom=home-top-story.
Share this article :

0 comments: