వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు..

వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు..

Written By news on Tuesday, March 1, 2016 | 3/01/2016


చంద్రబాబు సర్కారుపై అవిశ్వాసం
బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వంపై రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో మునిగితేలుతోందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందడం, అవినీతిలో మునిగితేలడం, హామీల అమలులో మాటతప్పడం వంటి అంశాలకు నిరసనగా అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో పార్టీ శాసనసభ్యులంతా ముందుండాలన్నారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా పక్కదోవ పట్టించేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తుందంటూ ఎమ్మెల్యేలను ఆయన అప్రమత్తం చేశారు. అధికారపక్షం వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ప్రజాసమస్యలపైనే దృష్టినంతా కేంద్రీకరించాలని, వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జగన్ సూచించారు.

 హామీలు అమలు చేయలేక నీచ కార్యక్రమాలు..
 సమావేశానంతరం ఎమ్మెల్యేలు చిర్ల జగ్గారెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ పిల్లి సుభాస్ చంద్రబోస్‌లతో కలసి శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల మొదలు, సాగునీటి ప్రాజెక్టుల వరకూ అన్నింటా దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతోందనే చర్చ ప్రధానంగా జరిగినట్టు తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణంలో చోటు చేసుకుంటున్న అవకతవకలు, ప్రజలకు సంబంధించిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చిన వైనంపైనా చర్చించామన్నారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం, బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీగా అనుసరించాల్సిన పాత్ర తదితర అంశాలపై చర్చించినట్టు తెలిపారు.

ప్రజలకిచ్చిన హామీల్ని అమలుచేయడంలో విఫలమై ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని నెహ్రూ దుయ్యబట్టారు. ప్రతిపక్ష శాసనసభ్యుల్ని లాక్కొని చంద్రబాబు నికృష్ట చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు చూపెట్టే శ్రద్ధలో.. ఆవగింజైనా ప్రజల పరిరక్షణ గురించి ఆలోచన చేస్తే రాష్ట్రం అథోగతి పాలయ్యేది కాదన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు.. అవి అమలు చేయలేని పరిస్థితుల్లోనే ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అధికారదాహంతో సంఖ్యను పెంచుకుంటే ప్రభుత్వం బలోపేతమవుతుందనుకోవడం అవివేకమన్నారు.

 వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు..
 ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని నెహ్రూ అన్నారు. కేంద్ర నిధులు రావట్లేదని, విభజన చట్టంలోని హామీలేవీ నెరవేరట్లేదని.. చంద్రబాబుకు ప్రజాసంక్షేమంపైనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు రాజకీయఎత్తులు, కుయుక్తులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంతమందిని ప్రలోభపెట్టినా వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజల్లో వేళ్లూనుకుపోయిందన్నారు. వైఎస్ జగన్ ఎవరి భుజంపై చేయి వేస్తే వారు నేతగా ఎదిగే పరిస్థితి ఉంటుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా  జగన్‌కున్న నిబద్ధత పట్ల.. రాష్ట్ర ప్రజానీకానికి పరిపూర్ణ విశ్వాసముందన్నారు.

ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకుని ప్రజలకోసం ఆలోచన చేయాలన్నారు. ఆయన తన తప్పులు  సరిదిద్దుకుంటారన్న ప్రయత్నంలోనే.. ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించేందుకుగాను అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు నెహ్రూ ప్రకటించారు. ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని విశ్వసించే ప్రజాస్వామ్యవాదులు ఉంటే ఏక్షణానైనా ఏదైనా జరగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి 47 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. విదేశీ పర్యటనలు, వ్యక్తిగత పనుల్లో ఉండటం వల్ల పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. వారంతా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసి అనుమతి పొందినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు.
Share this article :

0 comments: