ఆ పిల్లి నడ్డి విరగడం ఖాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పిల్లి నడ్డి విరగడం ఖాయం

ఆ పిల్లి నడ్డి విరగడం ఖాయం

Written By news on Wednesday, March 2, 2016 | 3/02/2016


ఆ పిల్లి నడ్డి విరగడం ఖాయం
హైదరాబాద్ :
ఏపీ కొత్త రాజధాని ప్రాంతంలో ముందుగానే భూములు కొంటున్నారని తాము ముందే చెప్పామని, చంద్రబాబు నాయుడి బినామీలంతా అక్కడ ముందే వేల ఎకరాలు కొని చక్కబెట్టుకున్నారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగానే అక్కడ ఎకరం 2 లక్షలకు, 3 లక్షలకు కొని, ఆ తర్వాత అక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పారన్నారు. ఇది కొన్ని లక్షల కోట్ల కుంభకోణమని అప్పుడే చెప్పామని ఆయన గుర్తు చేశారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదని అనుకుంటుందని, కానీ.. ఏదో ఒకరోజు పిల్లిని చూడటం, దాని నడ్డి విరగ్గొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

బినామీలన్నింటి వివరాలను సమగ్రంగా చెబుతూ సాక్షిలో కథనం వచ్చిందని, వాటిపై స్పష్టత ఇవ్వడానికి బదులు సాక్షి మీద సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామంటూ బెదిరిపు ధోరణిలో మాట్లాడారని అంబటి రాంబాబు అన్నారు. ఇంతకుముందు.. సాక్షి ప్రభుత్వ పత్రిక అని, అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా రాస్తారని బాబు కూడా అన్నారని గుర్తుచేశారు. కానీ, ఈ అంశంపై ఐదారు నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలతో కలిపి కథనం రాశారని ఆయన తెలిపారు. నిజంగా మీకు భయం లేకపోతే.. ఏ విచారణకైనా సిద్ధమన్న మాట చెప్పచ్చు కదా అని ప్రశ్నించారు. అలాంటి విచారణ జరపించుకుని, వాళ్లు నిర్దోషులమని నిరూపించుకుంటే శభాష్ అని ప్రజలు కూడా మెచ్చుకుంటారని తెలిపారు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా, ముందే బినామీ కొనుగోళ్లు చేయించడం చంద్రబాబుకు కొత్త కాదని ఆయన అన్నారు.

ఇక మీ గురించి ఏం మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడతారని అంబటి ఎద్దేవా చేశారు. జగన్ 5 లక్షల ఎకరాలను కబ్జా చేశారంటున్నారని, అది నోరా.. తాటిపట్టా అని మండిపడ్డారు. అసలు 5 లక్షల ఎకరాలంటే ఎంతో తెలుసా.. నిజంగా అంత భూమి ఉంటే మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులకు చెరి సగం ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని సవాలు చేశారు. లేదంటే లోకేష్‌కి రాయమన్నా రాయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా మీరు గొప్పవాళ్లని నిరూపించుకోవడం సరికాదని, న్యాయవిచారణ ఎదుర్కోవాలి తప్ప బురదచల్లే కార్యక్రమాలతో తప్పుకోవాలని చూడటం ధర్మంగా ఉండదని ఆయన అన్నారు.

ఇక మంత్రులు చెప్పిన ప్రతివిషయం అసంబద్ధంగా, అతుకుల బొంతలాగే ఉంది తప్ప సరైన వివరణ ఎక్కడా లేదన్నారు. మీకు బినామీ భూములు లేకపోతే ఈపాటికే అక్కడ రాజధాని నిర్మాణం మొదలయ్యేదని రాంబాబు అన్నారు. తాత్కాలిక రాజధాని, అందులో భవనం కడతామన్నారని, అడుగు 3350 రూపాయల చొప్పున కాంట్రాక్టు ఇచ్చి అందులో లంచాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తాము ఏదో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నామని కూడా మంత్రులు అంటున్నారని ఆయన అన్నారు. మొన్నటివరకు తమఅభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారని, ఇప్పుడు మాత్రం జగన్ మోహన్ రెడ్డి అంటే గిట్టక వస్తున్నారంటున్నారని,  ఏది నిజమో మీరే తేల్చుకోవాలని చెప్పారు. ఓపక్క రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని చెబుతూ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 20 కోట్లు ఇచ్చేంత అభివృద్ధి ఎలా సాధించారని నిలదీశారు. విచ్చలవిడిగా ధనం సంపాదించి, దాన్ని ఎదుటి పార్టీ వాళ్ల మీద చల్లుతున్నారని మండిపడ్డారు.
మొత్తం బినామీ ఆస్తుల వివరాలన్నింటినీ రిజిస్ట్రేషన్ వివరాలతో సహా పత్రికలో వస్తే.. వాటిని పేరుపేరునా ఖండించే దమ్ము వాళ్లకు లేదని అన్నారు.

అసలు మంత్రి నారాయణకు ఏం సంబంధం ఉందని ఆయన భూసేకరణకు వచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఆయన అత్యంత సన్నిహితుడు కాబట్టే రెవెన్యూ కార్యక్రమాలు కూడా ఆయనకే అప్పగించారన్నారు. కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ మంత్రి అయినా, అక్కడేం జరుగుతోందో తనకు తెలియదని సాక్షాత్తు ఆయనే చెప్పారని గుర్తుచేశారు. నారాయణ అయితే గుట్టు చప్పుడు కాకుండా బినామీ సొమ్ము అంటగడతారు కాబట్టి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అక్కడ ప్రపంచస్థాయి రాజధాని కాదు, ప్రపంచస్థాయి దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు. నిజానికి మీరంతా లోకేష్ బినామీలే తప్ప.. పుల్లారావు, నారాయణ సంపాదించుకుంటున్నారని తాము అనట్లేదన్నారు. నిజాయితీగా ఉన్న పత్రికలు ఏవైనా వాళ్ల అవినీతిని బయట పెట్టడానికే ప్రయత్నిస్తాయి గానీ, ఏదో బెదిరించి ఎరేంజిమెంట్లు చేసుకుంటున్నారని అన్నారు. కొన్ని చానళ్లు, పత్రికలు కొంతకాలం భయపడుతున్నాయి గానీ... కలకాలం అలా ఉండవని స్పష్టం చేశారు. పేదల కడుపులు కొట్టి కోటీశ్వరులు కావాలనుకుంటే దానికి మూల్యం చెల్లించక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందని అంబటి రాంబాబు తెలిపారు.
Share this article :

0 comments: