ఇలా అయితే బడ్జెట్ సమావేశాలెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇలా అయితే బడ్జెట్ సమావేశాలెందుకు?

ఇలా అయితే బడ్జెట్ సమావేశాలెందుకు?

Written By news on Wednesday, March 9, 2016 | 3/09/2016


ప్రజాసమస్యలను ప్రస్తావించవద్దా?
హైదరాబాద్ :
♦ అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీసిన వైఎస్ జగన్
♦ సభను మధ్యాహ్నం రెండు గంటలకే వాయిదా వేస్తారా?
♦ ఇలా అయితే బడ్జెట్ సమావేశాలెందుకు?

 సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చ ఉంటుందని మొదట ప్రకటించి ఒక్కరోజుకు కుదించడమే కాకుండా అబద్ధాలు చెప్పడం ఏమిటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి 1.30 గంటల సమయం కేటాయించినట్లు స్పీకర్ ప్రకటించగానే జగన్ లేచి ‘‘సభలో అధికార పక్షం, విపక్షమే ఉంది. గవర్నర్ ప్రసంగంపై చర్చకు ఒక్కరోజే కేటాయించడం మొదటి తప్పు. ఇంత సమయంలోనే పూర్తి చేయాలని చెప్పడం  దారుణం.

ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇలాగైతే బడ్జెట్ సమావేశాలెందుకు? ప్రజలు గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ‘‘బీఏసీలో ఒకరోజే చర్చకు మీ (వైఎస్సార్‌సీపీ) సభ్యులు అంగీకరించారు’’ అని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల చెప్పారు. తాము ఒక రోజుకు అంగీకరించినట్లు అసత్యాలు చెప్పడం సరికాదని, సమయం లేకపోతే ఎలాగోలా సర్దుకుందామని సూచించాలేగానీ అబద్ధాలను తమపై రుద్దొద్దని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. ‘‘రెండు రోజులపాటు గవర్నర్ ప్రసంగంపై చర్చ అని మీరే చెప్పారు. అజెండాలోనూ అదే ఉంది. అయితే ఈరోజు (మంగళవారం) మహిళా దినోత్సవ చర్చను విపరీతంగా పొడిగించారు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రానీకుండా చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ మధ్యలో అంబేడ్కర్ ప్రస్తావన తెచ్చి ఇలాగే చేశారు. మా ప్రసంగాన్ని మధ్యలోనే కట్ చేస్తే బయట మీడియా సమావేశంపెట్టి ఇక్కడ మిగిలిపోయిన విషయాలను వివరిస్తాం’’ అని జగన్ తెలిపారు.

 అధికార పక్షం అసత్యాలు బట్టబయలు
 వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాసమస్యలపై చర్చను పక్కనపెట్టి మధ్యాహ్నం 1.30 గంటలకే సభను వాయిదా వేయించేవారంటూ సభలో తాము చేసిన అరోపణలు తప్పని అధికార పక్ష నేతలు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకే సభను వాయిదా వేయాలని ఏమైనా చట్టముందా? నాలుగు వరకో ఐదు గంటల వరకో పొడిగించవచ్చు కదా! అని జగన్ ప్రశ్నించారు.  దీనిపై యనమల స్పందిస్తూ... ‘‘మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నా మధ్యాహ్నం ఒంటి గంటన్నరకే వాయిదా వేసేవారు’’ అని యనమల రామకృష్ణ పేర్కొన్నారు.

దీనికి స్పందించిన జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా సభను జరిపించారని, ఏడాదిలో 25 రోజులు కాదు 75 రోజులు కూడా ఆయన హయాంలో సభ జరిపారు అని గుర్తుచేశారు. దీంతో టీడీపీ సభ్యుడు దూళిపాళ నరేంద్ర లేచి విపక్షనేత సభలోకి కొత్తగా వచ్చారని, తాను 1998 నుంచి సభలో ఉన్నానని, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మధ్యాహ్నం 1.30కే సభను వాయిదా వేసేవారని చెప్పారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... ‘రాజశేఖరరెడ్డి హయాంలో ముఖ్యమైన అంశాలున్నప్పుడు మధ్నాహ్నం మళ్లీ సభను పెట్టి రాత్రి తొమ్మిది గంటల వరకూ చర్చలు కొనసాగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినన్ని రోజులు టీడీపీ హయాంలో రెండేళ్లలో కూడా నిర్వహించలేదు. కావాలంటే రికార్డులు పరిశీలించండి’’ అని సవాల్ చేశారు.

 దీనిపై దూళిపాళ నరేంద్ర స్పందిస్తూ... అది వాస్తవమేనని అంగీకరించారు. తదుపరి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను దూళిపాళ నరేంద్ర ఆరంభించిన తర్వా త ఐదు నిమిషాలకే స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
Share this article :

0 comments: