చంద్రబాబూ.. ముందు మీ మనసును రిపేరు చేసుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబూ.. ముందు మీ మనసును రిపేరు చేసుకోండి

చంద్రబాబూ.. ముందు మీ మనసును రిపేరు చేసుకోండి

Written By news on Tuesday, March 8, 2016 | 3/08/2016


చంద్రబాబూ.. ముందు మీ మనసును రిపేరు చేసుకోండి
హైదరాబాద్ :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు తన మనసును రిపేరు చేసుకోవాలని.. తర్వాత వ్యవస్థను రిపేర్ చేయడం మొదలుపెట్టాలని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సభలో ఆయన ఏమన్నారంటే...

''ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్పిన తీరు ఆహా.. అనిపిస్తోంది. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభలో ఉన్న అక్కచెల్లెమ్మలు, దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ హార్దిక శుభాకాంక్షలు. 1977లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తీర్మానం చేసి, ప్రపంచమంతా మహిళలకు సమానహక్కులు ఉండాలన్న ఉద్దేశంతో మార్చి 8ని మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వాళ్ల థీమ్ 'ప్లానెట్ 50:50 బై 2030, స్టెపప్ జెండర్ ఈక్వాలిటీ'. అక్క చెల్లెళ్లకు ఉన్నత స్థానం కోసం పోరాడతాం. స్త్రీ అంటే ఒక తల్లి, తల్లి అంటే ఓపిక. కానీ రాష్ట్రంలో నిజంగా స్త్రీలను గౌరవిస్తున్నామా అని మనం గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు ఇదే చట్టసభలో నా సోదరి రోజాను నిబంధనలు ఒప్పుకోకపోయినా సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘనత ఈ శాసనసభదే. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వనజాక్షి అనే ఎమ్మార్వోను ఇసుక మాఫియాకు అడ్డు తగులుతోందని జుట్టు పట్టుకుని ఈడ్చిన ఒక శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరు  చాలా హేయం. ఆ ఎమ్మెల్యే మీద కేసులు లేవు.. అరెస్టులు లేవు. ఇదే రాష్ట్రంలో, ఇదే సభకు చెందిన ఎమ్మెల్యే అంగన్‌వాడీ కార్మికులను దుర్భాషలాడుతూ తిడితే ఆ కార్మికులంతా ఆ శాసన సభ్యుడికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద కేసులు కూడా నమోదు కావు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడితే ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారని ఇప్పుడు వింటున్నాం.. అరెస్టు చేసినంత స్పీడుగానే బెయిలిచ్చి కూడా పంపిస్తున్నారు. విజయవాడ.. అంటే మన రాజధానిలో వడ్డీ వ్యాపారం పేరిట అధిక వడ్డీలకు డబ్బులిచ్చి, కట్టలేని పరిస్థితిలో ఉన్న పేద అక్క చెల్లెమ్మలను సెక్స్ రాకెట్‌లోకి దింపి, వీడియోలు రికార్డు చేసి, వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఆ నేరం చేసింది సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ముఖ్యమంత్రితో, ఇంటెలిజెన్స్ ఐజీతో నిందితులు మాట్లాడుతున్న ఫొటోలున్నా జైళ్లకు ఎవరినీ పంపరు, కేసులు నామమాత్రంగా పెడతారు. చివరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇదంతా మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల మీద మనం చూపిస్తున్న ప్రేమ ఇది. ఇదే సభలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఉన్నారు, వనజాక్షి జుట్టు పట్టుకున్న దుశ్సాసనులూ ఉన్నారు.

చివరకు అన్నింటికన్నా దారుణం ఏంటంటే ఉమ్మడి రాజధానిలో ఉన్నాం.. ఒక వ్యక్తి తాగి ఒక మహిళను వెంటపడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెబితే.. ఆ వ్యక్తి తండ్రి మంత్రిగా ఇక్కడ కొనసాగుతున్నారంటే నిజంగా దారుణం. తన కొడుకు ఇంతటి దారుణమైన పని చేస్తే.. దాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పే అన్యాయమైన వ్యవస్థ చూస్తుంటే, ఇలాంటి వ్యక్తిని మంత్రిగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తోంది.

ఇదే చట్టసభలో ఉన్న మరో ఎమ్మెల్యే .. ఒక కార్యక్రమంలో మహిళల గురించి చాలా లోకువగా మాట్లాడారు. జాతీయ చానళ్లలో కూడా దానిపై చర్చ జరుగుతోంది. అలాంటి సభ్యుడు కూడా ఇదే సభలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్ల ఉద్యోగాలు ఊడగొట్టారు. పెంచిన జీతాలివ్వమని అడగడమే నేరమంటూ వాళ్లను ఉద్యోగాల్లోంచి పీకేయండని సర్క్యులర్లు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు రూ. 1338 కోట్ల వడ్డీలు కట్టామన్నారు. మీరు ఇదేమైనా కొత్తగా మొదలుపెట్టారా.. దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీకే రుణాలు ఉండేవి. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రుణాలు 12-14 శాతం వడ్డీకి ఇచ్చేవారు. చంద్రబాబు రుణాలు కట్టొద్దని వాళ్లకు చెప్పి.. ఆ రుణాలు మాఫీ చేయాల్సింది పోయి ముష్టి వేసినట్లు ఒక్కొక్కరికీ 3 వేల రూపాయల పెట్టుబడి నిధిగా ఇచ్చారు. 14200 కోట్లు మాఫీ చేస్తామన్న పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక అప్పు ఇస్తానని అంటున్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు పోయాయి. చంద్రబాబు కట్టొద్దంటే కట్టని పాపానికి.. వాళ్ల దగ్గర 2 రూపాయల వడ్డీలు వసూలు చేస్తున్నాయి. కేవలం 12.42 శాతం మాత్రమే డ్వాక్రా గ్రూపులు ఎ రేటింగ్‌లో ఉన్నాయని సెర్ప్ తెలిపింది. గ్రేడ్ డిలో 52.31 శాతం ఉన్నాయి. డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏంటో మీరే ఒక్కసారి చూసుకోండి.

సమానత్వం గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. సీఎం హోదాలో ఉంటూ ఆయన ఇటీవల ఓ ప్రకటన చేశారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ వివక్షాపూరిత వ్యాఖ్య చేశారు. ఆడవాళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఆయనకు లేదు. ఆడవాళ్లకు ప్రత్యేకంగా క్యాబ్‌లు పెడతామని చెప్పారు. ఓలా, ఉబర్.. ఈ క్యాబ్‌లు వచ్చిన తర్వాత వీటిపై ఢిల్లీలో వివాదం జరిగిన తర్వాత కేంద్రం చాలా సంస్కరణలు పెట్టింది. చంద్రబాబు చెప్పిన వ్యవస్థ ఇప్పటికే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి 'షీ క్యాబ్'లు ప్రవేశపెట్టింది. ఈరోజు కొత్తగా ఆయన బుర్రలోంచి వచ్చిన వినూత్న ఆలోచన ఏదీ లేదు.

మహిళా దినోత్సవం రోజున.. వారిపట్ల నిజంగా మనం గౌరవంగా ఉన్నామా లేమా అని మనస్సాక్షిని మనమే అడగాలి. మంత్రి పదవుల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం కాదు.. మనం ఏం చేస్తున్నామో మన మనస్సాక్షిని అడిగి రిపేరు చేసుకుంటే వ్యవస్థ, సమాజం మారతాయి. సీఎంగారు ముందు తన మనసును రిపేరు చేసుకోవాలి, ఆ తర్వాత వ్యవస్థను రిపేర్ చేసుకోవాలి.''
Share this article :

0 comments: