ఆ రోజు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ రోజు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు

ఆ రోజు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు

Written By news on Monday, March 14, 2016 | 3/14/2016


ఆ రోజు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు'
హైదరాబాద్ : కులాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటలాడుకుంటున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సోమవారం సభలో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు గాండ్లను బీసీ-బి నుంచి ఎస్సీకి...ఆరె కటికలను బీసీ-డీ నుంచి ఎస్సీకి...కురుమ, కురబలను బీసీ-బి నుంచి ఎస్సీకి, వాల్మీకి, బోయిలను ఎస్టీల్లోకి మార్చేందుకు చర్యలు  తీసుకుంటామన్న టీడీపీ ...ఇప్పుడేమో పరిశీలిస్తామని మాట మారుస్తున్నదని అన్నారు.
 
టీడీపీ మేనిఫెస్టో చూస్తే ఎవరు కులాలతో ఆడుకుంటున్నారో అర్థం అవుతుందన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారని, అదే హామీని అమలు చేయాలని కాపులకు ఆందోళన చేస్తుంటే సహించలేకపోతుందన్నారు. కాపులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మధ్య గొడవలు పెడుతున్నారని, ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు.

ఇక కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం కాదా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. పెద్ద ఎత్తున జనాలు ఒక దగ్గర చేరితే...భావోద్వేగాలకు గురవుతారని అన్నారు. సభ పెట్టిన దగ్గరలో రైల్వేస్టేషన్ ఉన్న సంగతి సర్కార్ కు తెలియదా, ఆ రోజు అక్కడ సెక్యూరిటీని ఎందుకు పెట్టలేదన్నారు.  తుని ఘటనపై సీఐడీ విచారణ కాదని, సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరామని వైఎస్ జగన్ తెలిపారు. 1994లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాపుల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పలువురు టీడీపీ సభ్యులు కల్పించుకుని వైఎస్ఆర్ సీపీ నేతలపై ఆరోపణలు చేశారు. మరోవైపు హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని... తుని ఘటనపై సీఐడీ విచారణ జరుగుతోందని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే బయటపడుతుందన్నారు.
Share this article :

0 comments: