‘ఉపాధి’ నిధులు పక్కదారి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఉపాధి’ నిధులు పక్కదారి

‘ఉపాధి’ నిధులు పక్కదారి

Written By Unknown on Wednesday, March 30, 2016 | 3/30/2016


‘ఉపాధి’ నిధులు పక్కదారి
- అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- పేదవాడికి అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు
- మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారు
- ప్రొక్లెయినర్లతో సిమెంట్ రోడ్ల పనులు చేయిస్తున్నారు
- నిధులన్నీ కూలీలకే ఇవ్వాలి
- సీఎం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని డిమాండ్

సాక్షి, హైదరాబాద్: పేదల ఆకలి తీర్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పేదలకు ఉపయోగపడేలా చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా కూలీలకు వంద శాతం మేలు జరగాల్సి ఉండగా మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లా డుతూ.. ‘‘ఉపాధి హామీ అంటే.. పేదవాడి కడుపు నింపే పథకం. ఈ కూలీల్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. కానీ, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించింది. నీరు-మీరుతోపాటు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తోంది. సిమెంట్ రోడ్ల పనులను ప్రొక్లెయినర్లతో చేయిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం నిధులు 100 శాతం కూలీలకే చెందేవి. ఇప్పుడు 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ అని, 60 శాతం కూలీలకు అని చెబుతున్నారు.

 చట్టం ప్రకారం 60 శాతానికి పైగా నిధులను కూలీలకు చెల్లించవచ్చు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నిస్తే 100 శాతం కూలీలకే దక్కేవి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రొక్లెయినర్లు పెట్టి పనులు చేస్తే కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుంది? గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీలకు 100 శాతం నిధులను నేరుగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో జమచేసే వారు. కేంద్రం ఈ పథకంలో మార్పులు చేస్తున్నా ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఎన్టీయేలో భాగస్వామి అయిన టీడీపీ కేంద్రంతో మాట్లాడి 100 శాతం నిధులు ఉపాధి హామీ కూలీలకు దక్కేలా చేయొచ్చు కదా! రాష్ట్రంలో 1.70 కోట్ల మంది ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటే 58 లక్షల మందికే పని కల్పిస్తున్నారు. కడుపునిండా అన్నం పెట్టే ఉపాధి హామీకి తూట్లు పొడుస్తున్నారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.

 దళిత జాతికి తీవ్ర అన్యాయం
 ఏ వెనుకబడిన దళితుల కోసమైతే బీఆర్ అంబేడ్కర్ పోరాటం చేశారో ఆ వర్గాన్నే రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంగళవారం అంబేడ్కర్ 125వ జయంతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఏ వర్గం కోసం, ఏ జాతి ఔన్నత్యం కోసం పోరాటం చేశారో ఆ జాతికి ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దళితులు క్రిస్టియన్లుగా మారితే వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దళితుల్లోనూ కులాలు, మతాలు ఉంటాయా? అని ప్రశ్నించారు.

 ఉపప్రణాళిక నిధులు రాజ్యాంగ హక్కు
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వారికోసమే ఖర్చు చేయాలని, అది దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఈ నిధుల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తోందని విమర్శించారు. ‘‘దళితుల నిధుల్లో రూ.2,500 కోట్లు, ఎస్టీల నిధుల్లో రూ.1,300 కోట్లు కోత వేశారు. ఎస్టీ, ఎస్టీల అభివృద్ధి అంటే ఇదేనా?’’ అని జగన్ నిలదీశారు. రెండేళ్లుగా గిరిజన సలహా మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదనిప్రశ్నించారు.

 విశ్వసనీయత ఉంటేనే హుందాతనం

 ఓ నాయకుడికి వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉన్నపుడే రాజకీయాల్లో హుందాతనం వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ఆయన లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ రాజీనామాపై స్పందించాలని కోరగా... ‘‘ఏముంది మేం బాధితులం. ఆయన(చంద్రబాబు) ప్రలోభానికి వారు లొంగిపోయారు’’ అని బదులిచ్చారు. ‘‘రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత రెండూ ఉండాలి, అవి లేనప్పుడు భార్య కూడా గౌరవించదు. ఈ రెండూ ఉన్నాయా లేవా అని చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మా పార్టీని వీడిపోయిన వాళ్లు కూడా వాళ్ల మనస్సాక్షిని ఇదే విషయం ప్రశ్నించుకోవాలి. పార్టీని వీడిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళితే గెలుస్తామన్న ధైర్యం, విశ్వాసం చంద్రబాబుకు లేవు. ఎమ్మెల్యేలను అధికార పక్షం దాదాపు రూ.30 కోట్లతో ప్రలోభాలు పెడుతోంది’’ అని జగన్ పేర్కొన్నారు.

 చంద్రబాబు కాలం చెల్లిన నేత
 గ్రామీణ ఉపాధి పథకం హామీ గురించి చట్టంలో ఏముందో జగన్ తెలియజేశారు. ఒక పనిలో కూలీలకు చెల్లించే వేతనాలు 60 శాతానికి మించి ఎంతైనా పెరగొచ్చని స్పష్టంగా ఉంటే చంద్రబాబుకు మాత్రం అర్థం కాదని అన్నారు. చంద్రబాబు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ (కాలం చెల్లిన రాజకీయవేత్త) ఆయనకు అర్థం కాదు అని జగన్ అన్నారు.
Share this article :

0 comments: