ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు

ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు

Written By news on Thursday, March 31, 2016 | 3/31/2016


♦ పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకుండా కుట్రలు
♦ అందుకే ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాణి ఓటింగ్
♦ డివిజన్‌కు అనుమతించకపోవడం అన్యాయం కాదా?
♦ స్పీకర్  కోడెల టీడీపీ ఎమ్మెల్యేలా వ్యవహరించారు
♦ రాజ్యాంగపరంగా ఉన్న హక్కునే కాలరాశారు
♦ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ సర్కారు తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులు కాకుండా కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ లేకుండా చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. డివిజన్ జరగాలన్న ప్రతిపక్షం అభీష్టాన్ని వ్యతిరేకిస్తూ ద్రవ్య వినిమయ బిల్లు శాసన సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం వైఎస్ జగన్ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాము పట్టుబట్టినా పూర్తిగా తమ వాదన వినకుండా డివిజన్‌కు అనుమతించకపోవడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. కోడెల శివప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మూజువాణి ఓటింగ్‌కు పెట్టే ప్రతి అంశంపై డివిజన్ కోరే హక్కు రాజ్యాంగపరంగా ఉందని చెప్పారు. కౌల్ అండ్ షక్దర్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, (ఆ పుస్తకాన్ని జగన్ చూపిస్తూ) ఇందులోని 917 పేజీలో ఉన్న నిబంధనలను తాను చదివి వినిపిస్తున్నా స్పీకర్ పూర్తిగా వినకుండా మధ్యలోనే ఆపారని అన్నారు.

‘నువ్వు చదివింది చాలు.. మాకు అంతా తెలుసు.. మేమేది చేయాలో అది చేసేస్తాం’ అన్నట్లుగా స్పీకర్ వ్యవహరించారని విమర్శించారు. స్పీకర్‌ను ఉపయోగించుకుని ఈ శాసనసభా సమావేశాల్లో ఇలా చేయడం ఇది మూడోసారి అని పేర్కొన్నారు. స్పీకర్ డివిజన్ ఓటింగ్‌కు అనుమతించకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జగన్ తెలిపారు. ప్రభుత్వ చర్యల్లోని అనేక లోపాలను ‘కాగ్’ నివేదిక బయటపెట్టిందని, వాటిపై సర్కారును గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు.

 అది చట్ట ప్రకారం జైలుకు వెళ్లేంత నేరం
 రుణమాఫీ, విద్యార్థుల ఫీజుల చెల్లింపు, పింఛ న్లు, గృహ నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి నందుకే తాము ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించామని విపక్ష నేత చెప్పారు. పద్దులన్నింటిలోనూ ప్రభుత్వం చూపిన ఖర్చులకు, చేసిన కేటాయింపులకు ఏ మాత్రం సరిపోవడం లేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘వాస్తవానికి ఈపీఎఫ్ వంటి పబ్లిక్ డిపాజిట్ల నుంచి రూ.22 వేల కోట్లను ప్రభుత్వం వాడేసింది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల ప్రకారం జీఎస్‌డీపీలో 3 శాతానికి మించి రుణాలు తీసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతించకపోయినా ఉద్యోగుల డబ్బు మన దగ్గరే ఉంది కదా అని, అత్తగారి సొత్తే అన్నట్లుగా వాడుకున్నారు. ఇది చట్ట ప్రకారం జైలుకు వెళ్లాల్సినంత నేరం. ఇదేదో సాదాసీదా విషయం అయినట్లుగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో దీనిని సమర్థించుకుంటూ మాట్లాడతారు. ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించడానికి ఇంతకన్నా వేరే కారణాలేమైనా కావాలా? అసలు 2014-15 సంవత్సరపు ఆడిటెడ్ అకౌంట్లను ఎందుకు చూపలేదు? 2016-17 బడ్జెట్‌కు వెళుతున్న ఈ సందర్భంలో 2014-2015 సంవత్సరంలో అకౌంట్లను చూపించాలి కదా! అయినా చూపలేదంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.22 వేల కోట్ల మళ్లింపు జరిగింది. ఇంతకన్నా దారుణం ఏమీ ఉండదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
 
 ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు
 ‘‘వేరే పార్టీ బీ ఫారంపై ఎన్నికైన ఎమ్మెల్యేలను బాబు ప్రలోభాలు పెట్టి, డబ్బులు ఆశ చూపి, మంత్రి పదవులిస్తామని చెప్పి కొనుగోలు చేశారు. అసెంబ్లీలో ద్రవ్య విని మయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరిగితే.. టీడీపీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లేస్తే వారి పదవులు పోతాయి.(అనర్హులవుతారు) అందుకే డివి జన్ ఓటింగ్‌కు పెట్టలేదు. రాజ్యాంగపర హక్కునే కాలరాశారు. టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం, అనర్హత వేటు వేయించే ధైర్యం బాబుకు లేవు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ గెలిపించుకొని, వెనక్కి తీసుకొస్తామన్న నమ్మకం, విశ్వాసం బాబుకు లేవు. కనీసం ద్రవ్య విని మయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరిపించి,  ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో బాబు ఉన్నారు. ప్రజల్లో తన గ్రాఫ్ ఏ స్థాయిలో పడిపోయిందో బాబే అందరికీ చూపిస్తూ ఉన్నారు. అదే వైఎస్సార్‌సీపీ నైతిక విజయం, టీడీపీకి నైతిక పరాజయం’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: