అడ్డూఅదుపూ లేని ‘పచ్చ’నోట్ల ప్రవాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడ్డూఅదుపూ లేని ‘పచ్చ’నోట్ల ప్రవాహం

అడ్డూఅదుపూ లేని ‘పచ్చ’నోట్ల ప్రవాహం

Written By news on Monday, March 28, 2016 | 3/28/2016


ఇదేమి దిగజారుడు రాజకీయం?
అడ్డూఅదుపూ లేని ‘పచ్చ’నోట్ల ప్రవాహం
 

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. నైతిక విలువలన్నింటికీ తిలోదకాలిచ్చి రకరకాల ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు మళ్లీ మొదలుపెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ప్రలోభాల పర్వంలో నిమగ్నం కావడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీ స్థాయిలో ఆఫర్లు ఎరవేస్తున్నారు. రూ.30 కోట్లకుపైగా నగదు, రాజధానిలో విలువైన భూములు, పదవులను ఎర చూపుతున్నారు. గతంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తరహాలోనే మరోసారి ప్రయత్నాలను ముమ్మరం ప్రారంభించారు.

 వైఫల్యాల నుంచి మళ్లించేందుకే
 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన అధికార పార్టీ.. దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. అవినీతితో అన్ని రంగాలనూ భ్రష్టుపట్టించారు. అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పరువు పూర్తిగా పోవడంతో వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అవినీతి సొమ్మును వెదజల్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు.

సమర్థుడినని, తాను వస్తే రాజధానిని సింగపూర్ చేస్తా, బీజింగ్ చేస్తానంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు రాజధానిలో చిన్న భవనం కూడా కట్టలేని పరిస్థితి. కేవలం డిజైన్లు విడుదల చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. రైతులు, యువకులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే రెండేళ్ల నుంచి వెనకేసిన అవినీతి డబ్బుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 అభివృద్ధి కాదు... డ్రామా
 ‘మమ్మల్ని చూసి వస్తున్నారు. మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. ‘అభివృద్ధిపై మీకు అంత నమ్మకం ఉంటే.. మీరు ఏమన్నా అభివృద్ధి చేశామని అనుకుంటే మీ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేయించండి’ అని వైఎస్సార్‌సీపీ సవాల్ విసురుతోంది. దానిపై స్పందించడానికి అధికార పార్టీ సాహసించడం లేదు. దానిని బట్టే ఈ 22 నెలల్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని అర్థమవుతోందని విశ్లేషకులంటున్నారు. నిజంగానే అభివృద్ధి చేశామని అధికార పార్టీకి నమ్మకముంటే ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేయించవచ్చు కదా అని అంటున్నారు.

 సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా అధికార పార్టీ అనేక అడ్డదారుల్లో బయటపడాలని చూసింది. ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే గత సాంప్రదాయాలకు విరుద్ధంగా అదే రోజు చర్చ చేపట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయించి, ప్రతిపక్ష పార్టీ తన సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం లేకుండా చేసింది. సభ్యులంతా డివిజన్‌కు పట్టుబడుతున్నా మూజువాణి ఓటుతో తప్పించుకుంది. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టిన సందర్బంలోనూ ఇలాగే పలాయనం చిత్తగించింది. ఇపుడు ద్రవ్య వినిమయ బిల్లు విషయంలోనూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఓటింగ్ కోరుతోంది. సభ్యులందరికీ విప్ జారీ చేసింది.

అయితే, టీడీపీ నాయకత్వం మందబలంతో రాజ్యాంగ వ్యవస్థలను కూడా మేనేజ్ చేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధిపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలను ఎదుర్కోవాలి. లేదంటే అవిశ్వాస తీర్మానాలనన్నా నిబంధనల ప్రకారం ధైర్యంగా ఎదుర్కోవాలి. అలా చేయడం లేదు కాబట్టి అధికార పక్షం చేస్తున్న ‘అభివృద్ధి వాదం’ ఉత్తడొల్లేనని తేలిపోతుంది. ఎన్నికలకు వెళ్దాం రండి అని సవాలు చేయడంతోపాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టిందంటే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో మద్దతుపై నమ్మకం ఉండబట్టేనని విశ్లేషకులంటున్నారు.

 తప్పు చేస్తూ ప్రతిపక్షంపై దుష్ర్పచారం
 అధికార పక్షం ఒకవైపు ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగిస్తూనే రకరకాల దుష్ర్పచారాలకు దిగుతుండడం గమనార్హం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయిస్తుండడానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమని, కార్యకర్తల అభీష్టమని, రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అలాగే అనుకూల మీడియాలోనూ దుష్ర్పచారాలకు తెరతీశారు. ఉన్నవి లేనట్లు... లేనివి ఉన్నట్లు భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమని వైఎస్సార్‌సీపీ అంటోంది.

ఇటీవల పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేకు ఇవ్వలేదు కాబట్టి కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, అందువల్లే ఆయన అలకబూనారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి గోబెల్స్ ప్రచారంలో అందెవేసిన అధికారపార్టీ నాయకులకు.. వారి అనుకూల మీడియా యథాశక్తి సహకరిస్తోంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూకు అన్యాయం జరిగినట్లుగా పచ్చ మీడియాలో గోబెల్స్ ప్రచారం జరుగుతోంది. ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. జ్యోతుల నెహ్రూ అసంతృప్తితో ఉండే అవకాశమే లేదు.

ఎందుకంటే జ్యోతుల నెహ్రూ ఇప్పటికే అటు పార్టీలోనూ, ఇటు సభలోనూ కీలకమైన నేతగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్నారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో ప్రతిపక్షనేత జగన్‌తో కలసి ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. అన్నిటికీ మించి పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు. వీటన్నిటితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ని కీలకమైన బాధ్యతల్లో ఉండడం వల్ల పీఏసీ చైర్మన్‌గా కేంద్రీకరించి పనిచేయలేనని ఆయనే స్వయంగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా పీఏసీ చైర్మన్‌గా ఉన్న నేతనే మంత్రిపదవి ఎరవేసి అధికారపార్టీ ఆకర్షించింది. అలాంటపుడు పీఏసీ పదవో లేదా మరొకటో ఈ ఫిరాయింపులకు కారణం కాదని అర్థమవుతోంది. ఇదంతా పథకం ప్రకారం అధికార పార్టీ ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు.

 విలువలకు తిలోదకాలు
 ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారదలచుకుంటే ముందు ఆ పార్టీకి రాజీనామా చేయడం, పదవికి రాజీనామా చేయడం సాంప్రదాయం. కానీ, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తూ వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకోవడం, విలువలకు తిలోదకాలివ్వడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడినని, తనను ప్రపంచమంతా గౌరవిస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చంద్రబాబుకు ఇలాంటివి మామూలేనని విశ్లేషకులంటున్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఏపీలో కూడా అలాంటి వ్యవహారాలు చేయకుండా ఉంటారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా రంగంలో దిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ చంద్రబాబు.. రాజకీయాల్లో విలువలను అథఃపాతాళానికి తీసుకెళ్లారని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

 సీనియర్లతో చర్చించే నిర్ణయం
 పీఏసీ చైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై వైఎస్సార్‌సీపీలో సీనియర్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వ పథకాలలో విపరీతమైన అవకతవకలు జరుగుతుండడం, నిధులు పక్కదారి పట్టించడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక విషయాలలో మంచి పట్టు ఉన్న, ఫోకస్డ్‌గా ఉండే వ్యక్తి అయితే బాగుంటుందని అధినాయకత్వం ఆలోచించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ, బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగానూ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆర్థిక విషయాలలో మంచి అవగాహన ఉందన్న విషయం వెల్లడయ్యింది. సభలో ఆకట్టుకునే రీతిలో ప్రసంగించడం నాయకత్వాన్ని ఆకర్షించింది. ఆర్థిక అంశాలలో కేంద్రీకరించి పనిచేయగలగడంతోపాటు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తోనూ సమన్వయం చేసుకునే నేర్పు ఉన్న వ్యక్తిగా గుర్తించింది. అవకతవకలకు పాల్పడుతున్న అధికార పార్టీని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇరుకున పెట్టగలుగుతాడని పార్టీ నాయకత్వం భావించింది. అందుకే పీఏసీ చైర్మన్ బాధ్యతలకు బుగ్గనను ఎంపిక చేసినట్లు వైఎస్సార్సీపీ వర్గాలంటున్నాయి.
Share this article :

0 comments: