మా సీట్లెక్కడ బాబూగారూ..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా సీట్లెక్కడ బాబూగారూ..!

మా సీట్లెక్కడ బాబూగారూ..!

Written By news on Saturday, March 5, 2016 | 3/05/2016

► పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వింత పరిస్థితి

విజయవాడ: అభివృద్ధి సాకుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురైంది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుతో ప్రజల్లో పరువు పలచబడి.. మరోవైపు చేరిన పార్టీలో ఇమడలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. దీనికితోడు శనివారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమకు చోటెక్కడ అనే మీమాంస వారిని వెంటాడుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రస్తావించడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

రెండు రోజుల క్రితం సీఎంను కలిసిన వీరు అసెంబ్లీలో ఎక్కడ కూర్చోమంటారు అని అడిగారు. మీరు ఎక్కడ కూర్చోవాలో నేను చూస్తాను, ఆ విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండని సీఎం వారికి బదులివ్వడం గమనార్హం. పార్టీలో చేరిన వారిని అసెంబ్లీలో ఎక్కడ కూర్చోబెట్టాలనే విషయంలో సీఎంకు స్పష్టత లేకపోవడంతో ఆ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైఎస్సార్ సీపీ టిక్కెట్‌పై గెలిచి, టీడీపీ తీర్థం పుచ్చుకొని పదవులకు రాజీనామా చేయకుండా అసెంబ్లీలో కూర్చునేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై అధికార పక్షం మల్లగుల్లాలు పడుతోంది.

అసెంబ్లీలోనే కాదు టీడీపీ సమావేశాల్లోనూ వీరు ఎక్కడ కూర్చోవాలనే మీమాంస వెంటాడటంతో చివరి వరుసకే పరిమితం కావాల్సి వస్తోంది. విజయవాడలో ఈ నెల 1వ తేదీన జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి చివరి వరుసల్లో కూర్చోవడంపై టీడీపీలో చర్చ సాగింది. గెలిచిన పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ మారి చివరి వరుసకే పరిమితం కావాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చర్చించుకోవడం గమనార్హం.
Share this article :

0 comments: