ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు..

ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు..

Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016

♦ ప్రజల ఆశీస్సులే విజయ రహస్యం కాంగ్రెస్ విమర్శ అర్థరహితం
♦ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో దోస్తీ కట్టినందుకే పోటీలో నిలిచాం
♦ కార్పొరేషన్ ఎన్నికలొస్తే తప్ప సీఎంకు జిల్లా గుర్తురాలేదు
♦ మీట్ ది ప్రెస్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం : ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల గుండెల్లో ఆయన నిలిచే ఉన్నారు. ఆయన ఆశయసాధన కోసం ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీకి ప్రజల అండదండలు ఉన్నాయి. మాటల గారడీతో ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్స్‌లో టీయూడబ్ల్యూజే.. హెచ్143, టీయూడబ్ల్యూజే.. ఐజేయూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందని, రైతు రుణమాఫీ ఇప్పటికీ అందలేదని, డబుల్‌బెడ్రూం ఇళ్లు అడ్రస్ లేవని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడుతూ పాలిస్తారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని, పింఛన్లు అందజేస్తామని హామీలు ఇస్తూ ఓట్లు అడుగుతున్నారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ నాయకులను నమ్మరన్నారు. సీఎం కేసీఆర్‌కు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే తప్ప ఖమ్మం జిల్లా గుర్తుకు రాలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పడం, నిధుల విడుదలకు జీఓ జారీ చేయడం శోచనీయమన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థిని బరిలో దింపుదామనుకున్నామని, అయితే కాంగ్రెస్.. టీడీపీతో దోస్తీ కట్టడంతో వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థిని బరిలో దింపి తమ సత్తా ఏమిటో నిరూపించామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో ఉంటే కాంగ్రెస్ ఓట్లు చీలుతాయని, టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. జిల్లాలో తమ పార్టీ బలంగా ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు దీటుగా తమకు ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. ప్రజల మద్దతు తమకుందని, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.  ఖమ్మం అభివృద్ధి కోసం ఎంపీ నిధులు వెచ్చించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తానని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, జాతీయ రహదారుల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందిస్తామని వివరించారు. జిల్లాలో ఐటీ పరిశ్రమ లేని లోటు ఉందని, ఇందుకోసం పలు ఐటీ కంపెనీల యజమాన్యంతో మాట్లాడానని, తొలి దశలో 150 నుంచి 180 మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టు తీసువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎంపీ వివరించారు.
తనకు ప్రజాశీస్సులు ఉన్నాయని, వారి అభిమతానికి విరుద్ధంగా ఏనాడు నడుచుకోలేదని, మునుముందు కూడా ఇలాగే ఉంటానని చెప్పారు. మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, ఏనుగు వెంకటేశ్వరరావు, టెమ్‌జూ అధ్యక్ష, కార్యదర్శులు నాగేందర్, ఖదీర్, ఐజేయూ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకట్రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు బొల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: