ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే గేట్లెత్తినోళ్లు గొప్పా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే గేట్లెత్తినోళ్లు గొప్పా?

ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే గేట్లెత్తినోళ్లు గొప్పా?

Written By news on Wednesday, March 23, 2016 | 3/23/2016


ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే గేట్లెత్తినోళ్లు గొప్పా?
అసెంబ్లీలో నిలదీసిన విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. ప్రాజెక్టులు కట్టినవాళ్ల కంటే నీళ్లొచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తే లస్కర్లే గొప్ప వాళ్లన్నట్లు బాబు మాట్లాడుతున్నారు’’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడారు. అంతర్జాతీయ జల దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్‌ల గురించి వాస్తవాలను బహిర్గతం చేశారు. చంద్రబాబు మాటల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, పోలవరం కుడి కాలువ, పట్టిసీమ వంటి ప్రాజెక్టులపై చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు.
‘‘తోటపల్లి ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని ముఖ్యమంత్రి అంటు న్నారు. దీని అంచనా వ్యయం రూ.527.23 కోట్లయితే ఆయన తొమ్మిదేళ్ల హయాంలో ఖర్చు చేసింది కేవలం రూ.3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల హయాంలో రూ.398 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం పగ్గాలు చేపట్టిన పాలకులు రూ.51.95 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో తోటపల్లిని తానే ప్రారంభిస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. అంటే ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు గేట్లు ఎత్తే లస్కర్లు గొప్పవాళ్లని చంద్రబాబు చెబుతున్నట్టుగా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయాలు, చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో చేసిన ఖర్చు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల హయాంలో వెచ్చించిన మొత్తం, వైఎస్ మరణానంతరం చేసిన ఖర్చును గణాంకాలతో సహా అసెంబ్లీలో వివరించారు.
కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మీరే
ఈపీసీ(ఇంజనీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్) కాంట్రాక్టుల్లో పెంపుదల వెసులుబాటు లేకపోయినా కాంట్రాక్టు వ్యయం పెంచుకునేందుకు జీవో 22, జీవో 63లను తెచ్చి కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మీరు కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ జీవోల ప్రకారం మీకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి, వ్యయం పెంచి వారికి లబ్ధి కలిగేలా చేయడం అందరికీ తెలిసిందేనన్నారు.
 ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేని అధ్వాన్న పరిస్థితి
అంతర్జాతీయ జల దినోత్సవానికి సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలని, దీనికి సంబంధం లేని విషయం గురించి మాట్లాడకూడదని ప్రతిపక్ష నేతను స్పీకర్ పలుమార్లు అడ్డుకున్నారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ... ఇది ఎలా రిలవెంట్ కాదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులకు ఎంత కేటాయించారు? ఇప్పుడు సీఎం అయ్యాక ఎంత కేటాయింపులు చేశారు? అనేది రిలవెంట్(సంబంధిత అంశం) ఎందుకు కాదు అని పేర్కొన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. చివరకు పట్టిసీమకు పెట్టే ఖర్చులను పోలవరం ప్రాజెక్టులోనే చూపిస్తున్నారు. పట్టిసీమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేని అధ్వాన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ నీటికి సంబంధించినవి కాదా?’’ అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సభలో గంటసేపు మాట్లాడిన తర్వాత స్పీకర్ ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. జగన్ ప్రసంగానికి దాదాపు 6 సార్లు అడ్డు తగులుతూ మైక్ కట్ చేశారు.
 హాస్టళ్లు తగ్గించే కార్యక్రమం చేయొద్దు
రాష్ట్రంలో హాస్టళ్లను తగ్గించే కార్యక్రమం చేయవద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బాలుర ఆశ్రమ పాఠశాల గురించి టీడీపీ సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత లేచి హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా చేయడం మంచిదేనని, దీనిని ఎవరూ కాదనడానికి లేదని, అయితే ఈ కార్యక్రమం పేరుతో ఉన్న హాస్టళ్లను తగ్గించవద్దని కోరారు. స్పందించిన మంత్రి.. తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లలోని విద్యార్థులను వేరేచోటకు పంపిస్తామని చెప్పారు. తద్వారా హాస్టళ్ల మూసివేత తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు.

Share this article :

0 comments: