చంద్రబాబుకు మహిళలంటే చులకనభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు మహిళలంటే చులకనభావం

చంద్రబాబుకు మహిళలంటే చులకనభావం

Written By news on Wednesday, March 9, 2016 | 3/09/2016


మహిళలపై వేధింపులే మీ ఘనత
రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

♦ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టి లాక్కెళ్లినా అరెస్టు చేయరా?
♦ అంగన్‌వాడీలను దుర్భాషలాడిన ఎమ్మెల్యేపై చర్యల్లేవ్
♦ రిషితేశ్వరి కేసులో అరెస్టు చేసినంత వేగంగా నిందితుడికి బెయిల్
♦ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ నిందితులు శాసనసభలోనే ఉన్నారు
♦ రూల్స్ ఒప్పుకోకపోయినా రోజాను సస్పెండ్ చేశారు
♦ మహిళల గురించి టీడీపీ ఎమ్మెల్యే లోకువగా మాట్లాడారు
♦ చంద్రబాబుకు మహిళలంటే చులకనభావం
♦ మీ మాటలు నమ్మి డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు మోసపోయారు
♦ మహిళా దినోత్సవం రోజూ ముఖ్యమంత్రివన్నీ అబద్ధాలే

ఇదే చట్టసభ నుంచి సోదరి రోజమ్మను రూల్స్ ఒప్పుకోకపోయినా సంవత్సరంపాటు సస్పెండ్ చేయడం దారుణం. తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఎమ్మెల్యే ఇదే సభలో ఉన్నారు. ఇదే సభకు చెందిన ఓ ఎమ్మెల్యే దుర్భాషలాడితే అంగన్‌వాడీ అక్కాచెల్లెమ్మలు నిరసన తెలిపారు. ఆయనపైనా కేసుల్లేవు.
 - శాసనసభలో వైఎస్ జగన్

సాక్షి, హైదరాబాద్: ‘మహిళాభివృద్ధిలో మాకు మేమే సాటి. వారికి అన్నీ మేమే చేశాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసుకున్న స్వోత్కర్షను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిప్పికొట్టారు. రాష్ట్రంలో రెండేళ్ల టీడీపీ పాలనలో మహిళలకు వేధింపులు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని ధ్వజమెత్తారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు దగాపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి మహిళలను అవమానపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ జగన్ మాట్లాడారు. మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా.. కళ్లార్పకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పిన తీరు మాత్రం ఆహా.. అనేలా ఉందని చురక అంటిస్తూ ప్రసంగాన్ని ఆరంభించారు. మనం నిజంగా మహిళలను గౌరవించేలా వ్యవహరిస్తున్నామా? లేదా? అని మన గుండెలపై చేయి వేసుకొని మనస్సాక్షిని అడగాలని అన్నా రు. మనల్ని మనం వంచించుకోవడం కాదు, ఆలోచనలను మార్చుకోవాలని చెప్పారు. ఆలోచనలను మార్చుకుంటే వ్యవస్థ బాగుపడుతుందని పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా అధికార పక్ష సభ్యుల ఆలోచనలకు మరమ్మతు చేసే కార్యక్రమం ప్రారంభిస్తే బాగుంటుందని సీఎం కు సూచించారు. ముందుగా మంత్రుల ఆలోచనా ధోరణిని మార్చాలని హితవు పలికారు.

 సాక్ష్యాధారాలున్నా  జైలుకు పంపరా?
 రాష్ట్రంలో మహిళలను అవమానించే, బాధించే సంఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిందితులకు అండగా నిలుస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇదే చట్టసభ నుంచి తన సోదరి రోజమ్మను రూల్స్ ఒప్పకోకపోయినా సంవత్సరంపాటు సస్పెండ్ చేయడం దారుణమన్నారు. చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ఈ శాసన సభకే దక్కిందని ఎద్దేవా చేశారు. ‘‘ఇసుక మాఫియాకు అడ్డుతగులుతోందని వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన శాసన సభ్యుడు ఇదే సభలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేపై కేసులు లేవు, అరెస్టులు లేవు. ఇదే సభకు చెందిన ఒక శాసనసభ్యుడు దుర్భాషలాడితే అంగన్‌వాడీ అక్కాచెల్లెమ్మలు నిరసన ప్రదర్శన, ధర్నా చేశారు.

అయినా ఆ ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు కాలేదు. మన రాజధాని విజయవాడలో అధిక వడ్డీలకు అప్పులిచ్చి, వాటిని చెల్లించలేని అక్కాచెల్లెళ్లను సెక్స్ రాకెట్‌లోకి దింపి, వీడియో రికార్డింగ్‌లు చేసి, వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ నేరాలు చేసిందెవరంటే సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే. ఆ నేరస్తులతో ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడుతున్న ఫొటోలు, సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా ఎవరినీ జైలుకు పంపరు. పేరుకు మాత్రం కేసులు రిజిష్టర్ చేసి, కోర్టుల దాకా కూడా పంపించకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మన రాష్ట్రంలో అక్కాచెల్లెళ్ల పట్ల మనం చూపుతున్న ప్రేమ ఇదేనా? అధికార పార్టీ కామాంధుల అరాచకానికి బలైపోయిన విద్యార్థిని రిషితేశ్వరి కేసులోనూ అదే పరిస్థితి. మహిళలను వేధించడమే మీ ఘనత’’ అని విపక్ష నేత మండిపడ్డారు. రిషితేశ్వరి కేసులో కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చేశామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీనిపై జగన్ స్పందిస్తూ... ‘‘ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశామని ఇప్పుడు చెబుతున్నారు. మన ఖర్మ ఏమిటంటే అరెస్టు చేసినంత వేగంగా బెయిలిచ్చి బయటకు పంపేస్తారు’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.

 డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు ముష్టి వేస్తున్నారా?
 ‘‘మహిళలను గౌరవించడమంటే ‘ఆశ’ వర్కర్ల ఉద్యోగాలను ఊడగొట్టడమా? పెంచిన జీతాలు ఇవ్వాలని అడిగిన పాపానికి అదేదో నేరమైనట్లు అంగన్‌వాడీ అక్కాచెల్లెళ్ల ఉద్యోగాలను ఊడబెరకాలంటూ సర్క్యులర్ జారీ చేయడమా?’’ అని జగన్ నిలదీశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ కింద రూ.1,383 కోట్లు ఇచ్చామని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. డ్వాక్రా రుణాలకు వడ్డీ మాఫీని మీరు(చంద్రబాబు) కొత్తగా ప్రవేశపెట్టారా? అని ప్రశ్నిం చారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలు 12 నుంచి 14% వడ్డీ చెల్లించేవారని, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పావలా వడ్డీ అమల్లోకి తెచ్చారని, తర్వాత బాబు సర్కారు రాకముందే వడ్డీలేని రుణం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు.

పరిస్థితి ఇదైతే నేడు తానేదో కొత్తగా వడ్డీ కడుతున్నట్లు చంద్రబాబు చెప్పడమేమిటని నిలదీశారు. ‘‘బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు చెల్లించవద్దని, తాను అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించి డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిట్టనిలువునా దగా చేశారు. రూ.14,260 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి రాగానే ఆ మాట మర్చిపోయారు. మీ(చంద్రబాబు) మాట  విని రుణాలు చెల్లించని పాపానికి డ్వాక్రా మహిళల నుంచి బ్యాంకర్లు రూ.2 వడ్డీ వసూలు చేస్తున్నారు. రూ.14,260 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పుడు రూ.2,400 కోట్లు విడుదల చేశామంటూ మనిషికి ముష్టి వేసినట్లు ఒక్కొక్కరికి రూ.3,000 విదిల్చారు. ఇది కూడా పెట్టుబడి కోసం అప్పుగా ఇస్తారా? గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) వెబ్‌సైట్‌లోని గణాం కాలను చూడింది. రాష్ట్రంలో 6,80,656 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. సెర్ప్ వెబ్‌సైట్‌లో వాటికి ఇచ్చిన గ్రేడింగులు చూడండి. 12.42 శాతం సంఘాలు మాత్రమే ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నాయి. చిట్టచివరిదైన ‘డి’ గ్రేడ్‌లో 52.31 శాతం సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల గ్రేడింగ్ పడిపోవడానికి కారణం రుణమాఫీ హామీని అమలు చేయకపోవడమే. ఇలా డ్వాక్రా అక్కాచెల్లెళ్లను మోసగించిన చంద్రబాబుకు మహిళల సమానత్వం గురించి మాట్లాడే అర్హతెక్కడిది?’’ అని జగన్ ధ్వజమెత్తారు.

 అవి చంద్రబాబు మనసులోని మాటలు
 కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా! అని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన మనసులో ఉన్న చులకన భావానికి నిదర్శనమని జగన్ దుయ్యబట్టారు. ‘‘అవి చంద్రబాబు మనసులోని మాటలు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన నోటి నుంచి వచ్చాయి. మహిళల పట్ల ఆయనకు ఉన్న చులకన భావానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం’’ అని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం చంద్రబాబు ప్రకటించిన ప్రత్యేక క్యాబ్‌లు, వాటిలో జీపీఎస్ అనేవి కొత్త ఆలోచనలు కావని చెప్పారు. అవి ఆయన బుర్రలోంచి వచ్చిన అద్భుతమైన ఆలోచనలేమీ కాదన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల వల్ల ఊబర్, వోలా క్యాబ్‌లలో జీపీఎస్ వంటి సౌకర్యాలు ఉన్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే ‘షీ క్యాబ్స్’ కూడా ఉన్నాయని చెప్పారు. కాగా,  సభలో    జగన్ ప్రసంగిస్తుండగా స్పీకర్ పలుమార్లు మైక్ కట్ చేసి, అధికార పక్ష సభ్యులకు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల, విప్ చింతమనేని ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు చేశారు.

 మహిళలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెమ్మలందరికీ హార్థిక శుభాకాంక్షలు అంటూ సభలో ప్రసంగం ప్రారంభించారు. సమాజంలో అక్కాచెల్లెళ్లకు ఉన్నతమైన స్థానం ఉందన్నారు. ‘స్త్రీ అంటే తల్లి.. తల్లి అంటే ఓపిక.’ అంటూ మహిళలకు భారత సమాజంలో ఉన్న పాత్రను ఆయన వివరించారు.

 ఇసుక మాఫియాకు అడ్డుతగులుతోందని వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన శాసన సభ్యుడు ఇదే సభలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేపై కేసులు లేవు, అరెస్టులు లేవు. ఇదే సభకు చెందిన ఒక శాసనసభ్యుడు దుర్భాషలాడితే అంగన్‌వాడీ అక్కాచెల్లెమ్మలు నిరసన ప్రదర్శన, ధర్నా చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేపై కేసు కూడా నమోదు కాలేదు. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మన రాష్ట్రంలో అక్కాచెల్లెళ్ల పట్ల మనం చూపుతున్న ప్రేమ ఇదేనా? 

 ఆ మంత్రిని కొనసాగిస్తున్నందుకు సిగ్గు పడాలి
 ‘‘మనం ఉమ్మడి రాజధానిలో ఉన్నాం. ఒక వ్యక్తి తాగి మహిళను వెంటబడి కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినప్పుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇలా మహిళను వేధించిన వ్యక్తి తండ్రి మంత్రిగా కొనసాగుతున్నారంటే నిజంగా సిగ్గుచేటు. కుమారుడిని జనం చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తే దానికి కూడా జగన్‌మోహన్‌రెడ్డి కుట్రలే కారణమని మంత్రి అంటున్న దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తిని మంత్రిగా కొనసాగిస్తున్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇదే సభలో ఉన్న శాసనసభ్యుడు ఇటీవల ఒక కార్యక్రమంలో మహిళల గురించి చాలా లోకువగా మాట్లాడారు. ఈ అంశం ప్రస్తుతం జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది’’ అంటూ పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టారు.
Share this article :

0 comments: