సభ నన్ను ఉరి తీయాలంటే తీసేస్తారా: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సభ నన్ను ఉరి తీయాలంటే తీసేస్తారా: రోజా

సభ నన్ను ఉరి తీయాలంటే తీసేస్తారా: రోజా

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016


సభ నన్ను ఉరి తీయాలంటే తీసేస్తారా: రోజా
హైదరాబాద్ :
కోర్టుల కంటే కూడా అసెంబ్లీయే ఉన్నతమని అంటున్నారని.. రేపు రోజాను ఉరి తీయాలి అని సభ తీర్మానిస్తే నిజంగా తనను ఉరి తీసేస్తారా అని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకపోవడంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిని కలిసి వినతిపత్రం ఇచ్చి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజును బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని ఆమె అన్నారు. మనమంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, మనకు ఎక్కడైనా అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందని వెళ్తామని చెప్పారు. ఎక్కడైనా తప్పులు జరిగితే కోర్టులు సవరిస్తాయని, వాటిని మనం పాటించాలని అన్నారు. కానీ ఏపీ అసెంబ్లీ న్యాయవ్యవస్థను ధిక్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను కోర్టు ఉత్తర్వులను గురువారమే అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చానని, శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి వస్తానని లేఖ కూడా ఇచ్చానని.. వాటిని తీసుకుని అందినట్లు అక్నాలెడ్జిమెంటు కూడా ఇచ్చారన్నారు. కానీ ఈరోజు మాత్రం మార్షల్స్‌తో తనను లోపలకు రానివ్వొద్దని చెప్పారని ఆమె తెలిపారు. చీఫ్ మార్షల్ గణేశ్ బాబు టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో తాను సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుందామని వచ్చినా బయటకు లాగేశారని, తన మీద మార్షల్స్ కూర్చోవడంతో రెండు గంటల పాటు స్పృహలేని పరిస్థితిలో ఉన్నానని.. చివరకు ఆస్పత్రిలో కూడా ఇన్ పేషెంటుగా చేర్చుకోవద్దని చెప్పారని గుర్తుచేశారు. అదే గణేశ్ బాబు ఈ రోజు మళ్లీ తనను అడ్డగించారని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పినా.. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ చెప్పారంటూ అడ్డుకున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ కన్నా స్పీకర్ పదవి పెద్దది అనుకుంటున్నారని, అలాంటప్పుడు మరి కోర్టుకు ఎందుకు లాయర్లను పంపారు, ఎందుకు వాదనలు వినిపించారని ఆమె ప్రశ్నించారు.

చిత్తకార్తె కుక్కలాగ ఒక అమ్మాయిని కారులోకి లాగిన రావెల సుశీల్ తండ్రి కిశోర్ బాబు అసెంబ్లీలో కూర్చోడానికి అర్హుడా, ఎమ్మార్వో వనజాక్షిని, ఒక ఎస్ఐని, ఫారెస్ట్ అధికారిని కొట్టిన రౌడీషీటర్ చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీలో కూర్చోవచ్చా? కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో నిందితులైన బుద్దా వెంకన్న లాంటివాళ్లు మండలిలో ఉండొచ్చా అని రోజా సూటిగా ప్రశ్నించారు. చివరకు ఎమ్మెల్యే అయ్యానన్న అహంకారంతో టీచర్‌ని చెప్పు తీసుకుని కొట్టిన అనిత కూడా సభలో ఉన్నారన్నారు. పార్టీ ఫిరాయించినవాళ్లను సస్పెండ్ చేసి బయటకు పంపాల్సింది పోయి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా స్పీకర్, ముఖ్యమంత్రి, యనమల రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ల వల్ల ప్రజలకు, తమకు కూడా రక్షణ లేదని అన్నారు. ఇది కోర్టు ధిక్కారం కాబట్టి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు, తన నియోజకవర్గ సమస్యలపై పోరాడుతానని తెలిపారు. తాను ఇప్పటివరకు చేయని తప్పునకు శిక్ష అనుభవించానని, తన నోరు నొక్కేయడానికి ప్రయత్నించారని రోజా చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో బోండా ఉమా, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, సాక్షత్తు చంద్రబాబు అనేక అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడారని.. కానీ తాను అలా ఏమీ మాట్లాడకపోయినా వాళ్ల ఇష్టానికి మాటలు రాసేసుకుని శిక్షలు వేసేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు ప్రజాస్వామ్యం మీద గానీ, కోర్టుల మీద గానీ గౌరవం లేదని.. అలాంటివాళ్లు చాలామంది మట్టిలో కలిసిపోవడం మనం చూశామని అన్నారు. తానేంటో రాష్ట్రంలో మహిళలందరికీ తెలుసని చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు మీదకు వచ్చి మండుటెండలో ప్రజాసమస్యల మీద పోరాడటంతో తాను, తన కొడుకు చనిపోయేంత పరిస్థితి వచ్చిందని.. అలాంటి తాను మహిళల గురించి అగౌరవంగా మాట్లాడానంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: