హైకోర్టు కీలక తీర్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైకోర్టు కీలక తీర్పు

హైకోర్టు కీలక తీర్పు

Written By news on Saturday, March 19, 2016 | 3/19/2016

- ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్‌పై కేసు కొట్టివేత
- కంపెనీ పెట్టుబడులకు శ్రీనివాసన్‌కు సంబంధం లేదు

సాక్షి, హైదరాబాద్: 
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్విడ్ ప్రోకోలో భాగంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్‌కు చేసిన భూ, నీటి కేటాయింపులకు, జగన్ కంపెనీల్లో శ్రీనివాసన్ పెట్టిన పెట్టుబడులకు సంబంధం లేదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఈవ్యవహారంలో శ్రీనివాసన్ వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు. కంపెనీ చర్యలకు శ్రీనివాసన్ బాధ్యుడు కాదన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ఇండియా సిమెంట్స్‌కు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం కడప జిల్లా, చౌడూరులో 2.60 ఎకరాల భూమి లీజు పొడిగింపు, కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటి కేటాయింపులు చేసిందని ఆరోపిస్తూ శ్రీనివాసన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకోలో భాగంగా రూ. 140 కోట్లు శ్రీనివాసన్ పెట్టుబడులుగా పెట్టారని చార్జిషీట్‌లో పేర్కొంది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శ్రీనివాసన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కంపెనీ చర్యలకు శ్రీనివాసన్‌ను బాధ్యుడిని చేయడం తగదని సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి విచారణ సందర్భంగా తెలిపారు.

బోర్డు తీర్మానం మేరకే పెట్టుబడుల నిర్ణయం జరిగిందన్నారు. రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎండీకి అధికారాన్ని కల్పిస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఏకీభవించారు. కంపెనీ చర్యలకు ఎండీని బాధ్యుడిగా చేయడం తగదంటూ సునీల్ భారతి మిట్టల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు తీర్పును న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. శ్రీనివాసన్‌పై నమోదు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా న్యాయమూర్తి ఈ సందర్భంగా రద్దు చేశారు.
Share this article :

0 comments: