రాష్ట్రాన్ని స్కామాంధ్రగా మార్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రాన్ని స్కామాంధ్రగా మార్చారు

రాష్ట్రాన్ని స్కామాంధ్రగా మార్చారు

Written By news on Friday, April 1, 2016 | 4/01/2016


రాష్ట్రాన్ని స్కామాంధ్రగా మార్చారు
చంద్రబాబు ప్రభుత్వతీరుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

♦ సర్కారు దోపిడీ, వైఫల్యాలపై సభలో నిలదీశాం..
♦ విచ్చలవిడి అవినీతి.. దోపిడీ పాలన..
♦ మేం చెప్పిందే కాగ్ నివేదికలూ నిర్ధారించాయి..
♦ ఎస్సీ, ఎస్టీల జీవితాలతో బాబు చెలగాటం..
♦ సమయం వచ్చినపుడు ప్రజలే బుద్ధిచెప్పాలని పిలుపు

 సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని సీఎం చంద్రబాబు  ప్రజల్లో చులకన అయ్యారు. ప్రజలకు మేలు చేసే ఏ కొత్త స్కీమునూ ప్రవేశపెట్టలేని చంద్రబాబు రాష్ట్రాన్ని స్కాముల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. తమ దోపిడీ, వైఫల్యాలపై ప్రజల్ని మభ్య పెట్టేందుకు అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అవి నీతి, వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రజల తరఫున నిలదీసేది విపక్షం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేం అదే చేశాం. అయితే ప్రజల తరఫున నిలదీస్తున్నందుకే మా గొంతు నొక్కా రు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినపుడు చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలను కోరుతున్నా’ అని ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అనేక అంశాలను సవివరంగా ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే.....

 సర్కారు దుర్మార్గాలపై నిలదీశాం
 ‘‘మూడు బడ్జెట్‌లు అయిపోయాయి.. ఇక మిగిలింది రెండే రెండు బడ్జెట్‌లు.. ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ దగ్గర నుంచే ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. స్పీకర్ వ్యవహరిస్తోన్న తీరును నిరసిస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన విధానాలను ఎండగట్టాం. రోజమ్మ విషయంలో కోర్టు తీర్పును అమలు చేయకపోవడం, అప్రాప్రియేషన్(ద్రవ్య వినిమయ) బిల్లులో ప్రభుత్వ తీరును నిలదీశాం.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు, అవినీతిపై ప్రశ్నించాం. తక్కువ రేట్లకే కరెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రైవేటు వ్యక్తులతో లాలూచీ పడి ఎక్కువ ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ ఏపీఈఆర్‌సీ(ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)కి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్(ఐఈఈ) రాసిన లేఖను చూపిస్తూ అవినీతిని ఎండగట్టాం. ఆదిలోనే చంద్రబాబునాయుడు ఓత్ ఆఫ్ సీక్రసీని నీరుగార్చి రాజధాని భూముల్లో దగ్గరుండి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాల్లో రాజధాని వస్తుందని చెప్పి ప్రజల దృష్టి మళ్లించారు. ఫలానా చోటే రాజధాని వస్తుందని తన బినామీలు, అనుయాయులకు చెప్పారు.

తన బినామీలు, అనుయాయులు తక్కువ రేట్లకే భూములు కొనుగోలు చేసిన తర్వాత, తీరిగ్గా అక్కడే రాజధానిని ప్రకటించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన తీరును అసెంబ్లీలో నిలదీశాం. రైతులను మోసం చేసి తక్కువ ధరలకే బినామీలు, అనుయాయులు కొట్టేసిన భూముల రేట్లు పెరిగేలా జోనింగ్ చేశారు. రాజధాని చుట్టూ ఉన్న భూములను అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించి.. బినామీలు, అనుయాయులు భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనువుగా జోనింగ్ చేశారు. డిమాండ్, సప్లయ్‌ని మిస్ మ్యాచింగ్ చేశారు. రైతులు భూములు అమ్ముకునే స్వేచ్ఛను హరించిన తీరును ఎండగట్టాం.

ఇసుక రీచ్‌ల్లో రూ.రెండు వేల కోట్లు దోచుకున్నారని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఆరోపణ చేశారు. చంద్రబాబునాయుడు ఇసుక మాఫియాతో కలిసి నీకింతా.. నాకింత అనే రీతిలో రూ.రెండు వేల కోట్లు దోచుకున్నాక పతివ్రత అయినట్లు ఇసుకను ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించారు. రెండేళ్లు చంద్రబాబునాయుడు చేసిన పాపాలు, మోసాలను కవర్ అప్ చేసుకోవడానికే ఇసుకను ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించడాన్ని అసెంబ్లీలో ఎండగట్టాం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను సైతం ఖర్చు చేయకుండా రాజ్యాంగ హక్కులను హరించారు. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగ బద్ధంగా నియమించాల్సిన ట్రైబల్ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేయకపోవడాన్ని నిలదీశాం.

 మేం చెప్పిందే కాగ్ చెప్పింది..:
 చంద్రబాబు అవకతవకలు, అవినీతికి పాల్పడుతున్నారంటూ మేం చెప్పిందే కాగ్ నివేదికల్లో ప్రస్తావించింది. జీఎస్‌డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో మూడు శాతానికి మించి అప్పులు చేయకూడదని ఎఫ్‌బీఆర్‌ఎం చట్టం చెబుతోంది. కానీ 2014-15లో చంద్రబాబునాయుడు జీఎస్‌డీపీలో 6.10 శాతం అప్పు చేసి.. ఎఫ్‌బీఆర్‌ఎం చట్టాన్ని ఉల్లంఘించారని కాగ్ తేల్చింది. జీఎస్‌డీపీలో అప్పులు(లయబులిటీస్) 27.60 శాతానికి మించకూడన్నది ఎఫ్‌బీఆర్‌ఎం చట్టం నిబంధన. చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్ల 2014-15లో అప్పులు ఏకంగా జీఎస్‌డీపీలో 32.03 శాతానికి చేరుకున్నాయని కాగ్ తేల్చి చెప్పింది.

ఎఫ్‌బీఆర్‌ఎం చట్టాన్ని ఉల్లంఘించి అడ్డగోలుగా అప్పులు చేస్తూ తప్పులు చేస్తున్నారంటూ ఆది నుంచి మేం చెబుతున్నదే ఇప్పుడు కాగ్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా.. ఆ వర్గాల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను చంద్రబాబునాయుడు హరించారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు 2014-15 బడ్జెట్లో రూ.4,779 కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.1,504 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.1,886 కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో 69  శాతం, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన వాటిలో 40 శాతం నిధులను ఖర్చే చేయలేదని కాగ్ తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించి.. ఎస్సీ, ఎస్టీల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబునాయుడుకి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే నైతికహక్కు కూడా లేదు.

 20రోజుల్లో 32 వేల కోట్లు ఖర్చు చేశారా?
 టెక్నాలజీ వినియోగంలో తనను మించిన వారు లేరన్నట్టు చెప్పుకునే చంద్రబాబునాయుడు అదే టెక్నాలజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సీఎం సమీక్షించే కోర్ డ్యాష్ బోర్డు (సీఎం ఆఫీస్ రియల్‌టైమ్ ఎగ్జిక్యూటివ్ డ్యాష్‌బోర్డు) లో మార్చి 11, 2016 నాటికి 2015-16 బడ్జెట్‌లో రూ.68,104 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సరిగ్గా 20 రోజుల తర్వాత అంటే మార్చి 31, 2016 నాటికి అదే కోర్ డ్యాష్ బోర్డులో 2015-16 బడ్జెట్ మొత్తం వ్యయంలో రూ.1,03,046 కోట్లను ఖర్చు చేసినట్లు చూపారు. అంటే.. 20 రోజుల్లో రూ.32 వేల కోట్లను ఖర్చు చేశారా? ఏమన్నా టెక్నాలజీనా ఇది.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? 20 రోజుల్లో రూ.32 వేల కోట్లను ఎక్కడ.. ఎలా ఖర్చు చేశారు? ఎవరిని మోసం చేయడానికి ఈ టెక్నాలజీ? 2014-15లో ఎఫ్‌బీఆర్‌ఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేసిన చంద్రబాబునాయుడు.. రూ.22,619 కోట్ల పబ్లిక్ డిపాజిట్లు(ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ వంటివి)ను ఆయన అత్తగారి సొమ్మనుకున్నట్లు వాడుకున్నారు.

అప్పుగా తీసుకుని రూ.22,619 కోట్ల పబ్లిక్ డిపాజిట్లను మళ్లీ చెల్లించినట్లు చూపారు. అసలు పబ్లిక్ డిపాజిట్లను వాడుకోవడం నేరం. ఈ నేరంపై చంద్రబాబును జైల్లో పెట్టాలి.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, ఆర్.కె.రోజా, పీడిక రాజన్నదొర, చిర్ల జగ్గిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు వి.విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లా సూర్యప్రకాష్, వాసిరెడ్డి పద్మ, వి.వేణుగోపాల కృష్ణయాదవ్, కె.కన్నబాబు పాల్గొన్నారు.

 ప్రజలపై రూ.1,90,513 కోట్ల అప్పుల భారం
 రాష్ట్ర ప్రజలపై బాబు అప్పుల భారాన్ని మోపుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రూ.1,66,522 కోట్ల అప్పు లుండేవి. విభజనలో తెలంగాణ వాటా  69,479 కోట్లు, ఏపీ వాటా రూ.97,123 కోట్ల అప్పు వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ అంచనాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అప్పులు రూ.1,90,513 కోట్లకు చేరుకుంటాయన్నా రు. అంటే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 93,389 కోట్లు అదనంగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? బడ్జెట్‌లో అంకెలు తప్పుగా పేర్కొన్నారని కాగ్ తప్పుపట్టింది.
Share this article :

0 comments: