ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?

ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?

Written By news on Monday, April 11, 2016 | 4/11/2016


ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ సవాల్

 సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కోసమే టీడీపీలోకి వెళ్లామని చెబుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్తేమీ కాదని, ఆ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత పార్టీ ఫిరాయిస్తే సమంజసంగా ఉండేదన్నారు. బొత్స సత్యనారాయణ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను ప్రజలు ఏవగించుకుంటున్నారని చెప్పారు. చట్టాలు చేసే చట్టసభల్లోనే చట్టాలు అమలు కావడం లేదని అన్నారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ అసలు పట్టించుకోవడం లేదన్నారు. చేతిలో చట్టం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో జాప్యం చేయవచ్చు గానీ పూర్తిగా తిరస్కరించలేరని, ఎప్పటికైనా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చేతులతో మరో పార్టీ ఎమ్మెల్యేలు పసుపు కండువాలు కప్పించుకుంటున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తమ పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు.

 జేజమ్మ దిగొచ్చినా రాజ్యసభ సీటు దక్కకుండా చేయలేరు
 తల్లో జేజమ్మ దిగొచ్చినా తమ పార్టీకి రాజ్యసభ సీటు దక్కకుండా టీడీపీ చేయలేదని బొత్స పేర్కొన్నారు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

 కుటుంబ కార్యానికి కలెక్టర్లతో ఆహ్వానాలా?
  చంద్రబాబు తన మనవడి పుట్టిన రోజును వైభవంగా జరుపుకోవడంలో తప్పులేదని, అయితే ఆ కార్యక్రమం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడానికి జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బొత్స సత్యనారాయణ ఆరోపించా రు. తనయుడు లోకేశ్‌బాబును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చంద్రబాబు అతిగా ఆర్భాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటివరకు చినబాబు బయట ఉండి కలెక్షన్ చేస్తే ప్రభుత్వంలో ఉన్న పెదబాబు శాంక్షన్ చేస్తారనే మాట ఉండేదని, ఇపుడు చినబాబు కూడా మంత్రివర్గంలో చేరితే కలెక్షన్, శాంక్షన్ తేలికవుతుందని బొత్స ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: