పార్టీని వీడేది లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీని వీడేది లేదు

పార్టీని వీడేది లేదు

Written By news on Wednesday, April 20, 2016 | 4/20/2016


'పార్టీని వీడేది లేదు'
బాలినేని స్పష్టీకరణ
ఆ వార్తలు అభూత కల్పనలు 
మేం వైఎస్సార్ అభిమానులం 
జగన్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉంది
 
సాక్షి, హైదరాబాద్: తామంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీని వీడబోమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను, కొంత మంది ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ వీడిపోతున్నట్లు జరిగిన ప్రచారం పూర్తిగా తప్పు అని అన్నారు.
 
 వైఎస్సార్‌సీపీని స్థాపించే రోజున తాను మంత్రిగా ఉన్నానని, మంత్రి పదవిని వదులుకుని పార్టీలోకి వచ్చానని బాలినేని గుర్తు చేశారు. పార్టీ మారుతున్నానన్న వార్తలన్నీ అభూత కల్పనలేనన్నారు. తనతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు. 2014 ఎన్నికల తరువాత వ్యక్తిగత విషయాల వల్ల పార్టీ కార్యకలాపాలకు తాను కొంత దూరంగా ఉన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. జగన్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన నాయకత్వంలో పనిచేస్తానని శ్రీనివాసరెడ్డి అన్నారు. 
 
 నాకు ప్రాధాన్యత ఇస్తున్నారు
 పార్టీ వ్యవహారాల్లో జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారని విలేకరులు ప్రశ్నించగా ‘అదేమీ లేదు. నాకు జగన్ తొలి నుంచీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల తరువాత నేనే కొంత దూరంగా ఉన్నాను, తప్ప మరేమీ లేదు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అని జగన్ అన్నారు. నా వ్యక్తిగత ఇబ్బందుల వల్ల నేనే దూరంగా ఉండటం జరిగింది’ అని బాలినేని అన్నారు. బాలినేనితో పాటుగా ఒంగోలు సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వరికూటి కొండారెడ్డి, కొండెపి అసెంబ్లీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 
 
 పార్టీని వీడను: ముత్తుముల
 తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, జగన్ నాయకత్వంలోనూ, జిల్లా స్థాయిలో బాలినేని నాయకత్వంలోనూ పని చేస్తానని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తేల్చి చెప్పారు. తాను తొలి నుంచీ వైఎస్సార్‌సీపీలో ఉన్నానని తమపై అభూత కల్పనలు, అసత్యపు ప్రచారాలు జరుగుతున్నాయని, అవి తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 బాబుకు పబ్లిసిటీ పిచ్చి: కొడాలినాని
 ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రజల సంక్షేమానికి చేసే పనులకన్నా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని విమర్శించారు. అసలు పనులకు పిసరంత ఖర్చు చేసి పబ్లిసిటీకి మాత్రం భారీగా ఖర్చు చేస్తారన్నారు. మజ్జిగ పథకం కూడా అలాగే ఉండబోతోందన్నారు. గుడివాడలో చలివేంద్రాల ఏర్పాటులోనూ ఇలాగే చేశారన్నారు. చలివేంద్రంలో అమర్చిన సామగ్రికి రూ.2,000 ఖర్చయితే దాని చుట్టూ చంద్రబాబు బొమ్మలు, ఫ్లెక్సీలకు రూ 10,000 ఖర్చు చేశారని విమర్శించారు. ఈ దఫా ఎండలు మండిపోతోంటే చంద్రబాబు ఇప్పటికింకా సహాయక పనులకు దిగలేదని ఆయన విమర్శించారు. 
Share this article :

0 comments: