వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం

వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం

Written By news on Tuesday, April 5, 2016 | 4/05/2016


వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం
♦ పార్టీ శ్రేణులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు
♦ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం
♦ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో ఓ సందేశం ఇప్పిద్దాం
♦ వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పనిచేద్దాం

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని, అందుకు అందరూ కంకణబద్ధులు కావాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సందిగ్దతతో రకరకాల ప్రచారాలు, కామెంట్లు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

ప్రచారాలు, అపోహలు సర్వసాధారణమని, దీనికి కార్యకర్తలు భయపడొద్దని, మనసు నొచ్చుకోవద్దని సూచించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ఉన్నారని, వారున్నంత వరకూ పార్టీ దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు పరిష్కారంకాక అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజలు నిరంతరం ఎదుర్కొనే సమస్యలపై పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 8 తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలసి, ఆయనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఒక సందేశం ఇప్పిద్దామని అన్నారు. కష్టపడటం నేర్చుకుంటే, భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసి ఉండాల్సిందని, అయితే ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి శిరసావహించి, చివరి క్షణంలో పోటీ ప్రతిపాదన వెనక్కు తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేయటానికి వెనకాడవద్దని సూచించారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులు అందరికి ఉంటాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మా కిష్టారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి పనిచేయాల్సి ఉందన్నారు.

పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్దామన్నారు. మరో ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు హెచ్‌ఏ రహమాన్, మతీన్, గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గున్నం నాగిరెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, జిల్లాల అధ్యక్షుడు ఆదం విజయ్ కుమార్, పి.సిద్ధార్థరెడ్డి, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, బి. అనిల్ కుమార్, జీవీ శ్రీధర్ రెడ్డి, మహిళా నేతలు షర్మిలా సంపత్, అమృత సాగర్, శ్యామల, జులీ, క్రిష్టోలైట్, డాక్టర్ నగేష్, రాష్ట్ర కార్యదర్శులు ఎం భగవంత్ రెడ్డి, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, కుమార్ యాదవ్, ఇరుగు సునీల్ కుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎన్ బిక్షపతి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, వెల్లాల రామ్మోహన్, మల్లాది సందీప్ కుమార్, నాయకులు రఘురామిరెడ్డి తదితరులు
 పాల్గొన్నారు.

 14వ ఆర్థిక  సంఘం నిధులు గ్రామాలకే ఖర్చు చేయించాలి..
 కేంద్రం నేరుగా గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పొంగులేటి ఆరోపించారు. గ్రామాలను బలోపేతం చేసేందుకు, మౌలిక సౌకర్యాల కల్పనకు, తాగునీటి, విద్యుత్ అవసరాలకు ఉద్ధేశించి ఈ నిధులను నేరుగా పంచాయతీలకే కేంద్రం కేటాయిస్తుం డగా, వాటిని ఇతరత్రా రూపాల్లో దారిమళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ నిధులను ఇతర పథకాలకు లేదా జిల్లా, మండల పరిషత్‌లకు మళ్లించకుండా, గ్రామ పంచాయతీలకే ఖర్చుచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల పవర్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలని చూడటం సరైంది కాదన్నారు.
Share this article :

0 comments: