ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి

ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి

Written By news on Friday, April 29, 2016 | 4/29/2016


కొనుగోళ్ల పర్వాన్ని వివరించాంఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
♦ ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి
♦ మూడు నెలల కాలవ్యవధి పెట్టి ఈసీకి అప్పగించాలి
♦ 10 ప్రధాన హామీలు నెరవేర్చని పార్టీని పోటీనుంచి నిషేధించాలి
♦ సీమాంధ్ర, జీహెచ్‌ఎంసీలో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి
♦ ఎన్నికలను అర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీకి మూడు సూచనలిచ్చాం
♦ చంద్రబాబు అనైతిక రాజకీయాలపై ప్రధానికి లేఖ రాస్తాం
♦ న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో.. నిరాకరణ ఉండదు
♦ పోరాటం ఇంతటితో ఆగదు.. న్యాయస్థానాలకూ వెళతాం
♦ ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంపై వైఎస్ జగన్ సంతృప్తి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక రాజకీయాలను, అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా సాగిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల  తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసి ప్రజల ఆకాంక్షలకు రక్షణ కవచంగా మార్చాలని వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయం జరగడంలో ఆలస్యం ఉండవచ్చే మో కానీ.. న్యాయం తప్పకుండా జరుగుతుందంటూ తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గురువారం ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘రూ. 20-30 కోట్ల అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేని అధికార టీడీపీ కొనుగోలు చేస్తున్న తీరును వివరించాం. కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఎర చూపుతున్న పరిస్థితిని విడమరిచి చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికలను మరింత అర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గాలను సూచించాలని వివిధ రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో తమ పార్టీ తరఫున మూడు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించామని చెప్పారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక తదితరులతో కూడిన బృందం జగన్ నేతృత్వంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదిని కలిసి ఈ వినతిపత్రం సమర్పించారు.
 ప్రధానమంత్రికి లేఖ రాస్తాం
ఏపీలో సాగుతున్న అక్రమాలు, అవినీతి, అనైతిక రాజకీయాలను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాస్తానని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు. ‘‘ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ అడిగాం. మీరన్నట్లుగా (బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదా? అని అడిగిన విలేకరిని ఉద్దేశించి) మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదోమో! మా వాదనలు, విజ్ఞప్తులు వివరిస్తూ ప్రధానికి లేఖ రాస్తాం. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపిస్తాం’’ అని తెలిపారు. ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర సంతృప్తికరంగా సాగిందా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘‘వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే మన వాదన గట్టిగా వినిపించాలి.
సాధ్యమైనంత మేర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది’’ అని సమాధానమిచ్చారు. మీ పోరాటం ఫలిస్తుందనే నమ్మకం ఉందా? అని మరో విలేకరి ప్రశ్నించగా... ‘‘ఇదో పోరాటం. న్యాయం జరుగుతుందా, జరగదా అనే విషయం పక్కనబెడితే.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చాం. దేశంలోని ముఖ్య నాయకులు, ముఖ్యమైన సంస్థలు, వ్యవస్థల దృష్టికి ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అనైతిక రాజకీయాల తీరును వివరించగలిగాం’ అని జవాబు చెప్పారు. ‘ఇంతటితో ఆగం. కోర్టులకూ వెళతాం. అక్కడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ... నిరాకరించడం మాత్రం జరగదు’ అని మరో ప్రశ్నకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు.
గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వినతి
కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను జగన్ గురువారం మధ్యాహ్నం ఇక్కడి శాస్త్రిభవన్‌లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘‘హోం మంత్రి, ఆర్థిక మంత్రికి ఇచ్చిన వినతిపత్రాలను ఇక్కడ కూడా ఇచ్చాం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పర్వం, ఫిరాయింపుల పర్వాన్ని వివరించాం. అలాగే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవలే కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో ఇవ్వాలని కోరాం..’’ అని వివరించారు.
ఈసీకి వైఎస్సార్‌సీపీ ఇచ్చిన సూచనలు
సూచన-1

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకునేలా ఎన్నికల సంఘానికి అప్పగించమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. అలా చేయకుంటే ప్రజాస్వామ్యం బతకదు. అనైతిక రాజకీయాలతో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆకాంక్షలను ఖూనీ చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి... అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయరు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు. ఇటు అనర్హత వేటు పడకుండా, అటు రాజీనామాలు చేయకుండా.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ మంత్రి పదవులూ చేపట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.
సూచన-2
ఎన్నికల మేనిఫెస్టోలోని 10 ముఖ్యమైన హామీలను అన్ని పార్టీలను అడగండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 హామీలను నెరవేర్చలేకపోతే.. తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీలు పోటీ చేయకుండా నిషేధం విధించండి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో చూస్తే అర్థమవుతుంది.
♦ రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కింద చంద్రబాబు ఇచ్చిన సొమ్ము..  రైతుల వడ్డీలకు సరిపోలేదు. రుణాలన్నీ మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకూ పంగనామాలు పెట్టారు.
♦ జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు టీడీపీ ఊదరగొట్టింది. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇంటికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. ఉద్యోగాల ఇచ్చే సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్నారు. నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు.
♦ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాగ్రహానికి, వ్యతిరేకతకు భయపడి ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను రూ. 20-30 కోట్లకు  కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినపండకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. ఫిరాయింపుదారులతో రాజీనా మా చేయించి ఎన్నికలకు వెళ్లడానికి బాబు భయపడుతున్నారంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.
 సూచన-3
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ దాదాపు ఆరు దశాబ్దాలపాటు రాజధాని. సీమాంధ్రకు చెందిన వారు పెద్ద సంఖ్యలో జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సీమాంధ్ర, జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి. తద్వారా రెండు చోట్లా ఓట్లు వేసే (డబుల్ ఓటింగ్) అవకాశం లేకుండా చేయవచ్చు.
Share this article :

0 comments: