నేడు హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ

నేడు హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ

Written By news on Tuesday, April 26, 2016 | 4/26/2016


ఢిల్లీ చేరిన ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమం
♦ వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
♦ నేడు హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ
♦ శరద్ పవార్, సీతారాం ఏచూరి, శరద్‌యాదవ్‌లతో సమావేశం
♦ టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను వివరించనున్న బృందం

 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును నిరసిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధులు తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం కార్యాచరణ ప్రారంభించింది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా వివిధ పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ నేతలను వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు బృందం కలవనుంది. సోమవారం ఎమ్మెల్యేల బృందం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, అనుకున్న సమయానికి ఢిల్లీకి చేరుకోలేకపోయింది. ఢిల్లీకి చేరడంలో జాప్యం జరగడం, లోక్‌సభలో హోం మంత్రి బిజీగా ఉండటంతో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్న అపాయింట్‌మెంట్ వాయిదా పడింది. దీంతో బృంద సభ్యులు మంగళవారం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ నేత శరద్‌యాదవ్‌తో  భేటీ కానున్నారు.

అపాయింట్‌మెంట్ల ఖరారును బట్టి రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జాతీయస్థాయిలో పోరాటం సాగించడానికి ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి భూమికగా ఉపయోగించుకోనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

 మంగళవారం కలవనున్న నేతలు
 ‘సేవ్ డెమొక్రసీ’ యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బృందం మంగళవారం ఢిల్లీలో పలువురు నేతలను కలవనున్నారు. పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ఉదయం 10.15 గంటలకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మధ్యాహ్నం ఒంటి గంటకు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సాయంత్రం 7.15 గంటలకు జేడీయూ నేత శరద్‌యాదవ్‌తో పాటు మరికొంత నేతలను కలిసే అవకాశం ఉంది.
Share this article :

0 comments: