హైదరాబాద్, ఏపీలలో ఒకేసారి ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైదరాబాద్, ఏపీలలో ఒకేసారి ఎన్నికలు

హైదరాబాద్, ఏపీలలో ఒకేసారి ఎన్నికలు

Written By news on Thursday, April 28, 2016 | 4/28/2016


'హైదరాబాద్, ఏపీలలో ఒకేసారి ఎన్నికలు'
► అలా చేయపోతే రెండుచోట్లా ఓట్లేసే ప్రమాదం
► పార్టీలు మేనిఫెస్టోలలో ఇచ్చే హామీలను కూడా చూడాలి
► ఎన్నికల కమిషన్‌కు వైఎస్ జగన్ విజ్ఞప్తి
► ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం
► ఏపీలో జరిగే అరాచకాలను ఇప్పుడు దేశం దృష్టికి తీసుకొచ్చాం
► తర్వాత కోర్టులోనూ పోరాటం కొనసాగిస్తాం


న్యూఢిల్లీ
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ నగరంలో (జీహెచ్ఎంసీ పరిధిలో) కూడా ఒకేసారి పోలింగ్ ఉండేలా చూడాలని ఎన్నికల కమిషన్‌కు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండుచోట్లా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహిస్తే, కొంతమంది ఓటర్లు అక్కడ, ఇక్కడ కూడా ఓట్లు వేస్తున్నారని.. దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదీని గురువారం కలిసి ఈ మేరకు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వైఎస్ జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారాన్ని అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోంచి తీసేసి ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి తెచ్చేలా ప్రతిపాదించాలని కోరామన్నారు. లేకపోతే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతుందని చెప్పామన్నారు.

ఒక పార్టీ నుంచి గెలిచి, అధికార పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యేలపై అధికార పార్టీకి చెందిన స్పీకర్ అనర్హత వేటు వేయరని, వీళ్లు కూడా రాజీనామా చేయరని తెలిపామన్నారు. అలా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అదే పదవుల్లో కొనసాగే పరిస్థితి మారాలని.. అలాంటివాళ్లు మంత్రి పదవులు పొందడం మరీ దౌర్భాగ్యమని ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. దాంతోపాటు.. ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీలు ఇచ్చే 10 ముఖ్యమైన హామీలేంటో అడగాలని.. వాటిని నెరవేర్చకపోతే ఆయా పార్టీలను తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని ఆయన తెలిపారు.

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏ రకంగా అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేశారో ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి.. చివరకు ఇప్పుడు మాత్రం వడ్డీలకు కూడా సరిపోకుండా డబ్బులు విదిలిస్తున్నారని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కూడా పంగనామాలు పెట్టారని ఆయన అన్నారు. జాబు కావాలంటే బాబే సీఎం కావాలని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారని, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజల జీవితాలను ఎలా మోసం చేస్తున్నారో, దానిపై ప్రజల గొంతు ఎక్కడ వినపడుతుందోనన్న భయంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎలా తాపత్రయపడుతున్నారో కూడా ఎన్నికల కమిషన్‌కు చెప్పామన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను మళ్లీ ఎన్నికల్లో పోటీచేయిస్తే, ప్రజలు వీళ్లకు మళ్లీ ఓట్లేయరేమోనన్న చంద్రబాబుకు ఉందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

వ్యవస్థలో మార్పు తేవాలంటే ప్రతిచోటా మనవాణిని గట్టిగా వినిపించాలని, చేతనైనంత ప్రెజర్ పెడితే ఏదో ఒకరోజు సాకారం అవుతుందని.. ప్రజాస్వామ్యంలో న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందన్నారు. ఢిల్లీలో సాగించిన 'సేవ్ డెమొక్రసీ' అనేది ఇది ఒక పోరాటమని, ఇందులో తమకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ పోరాటం ద్వారా దేశం దృష్టికి తెచ్చామని అన్నారు. ముఖ్య నాయకులందరికీ దీని గురించి చెప్పామని, తర్వాత కోర్టుల్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో గానీ నిరాకరించరన్నది తన నమ్మకమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాము ఇదే విషయమై ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కూడా అడిగాం గానీ, ఇంతవరకు దొరకలేదని, బహుశా టీడీపీ వాళ్ల మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదేమోనని ఆయన చెప్పారు. కానీ తాము ప్రధానికి ఏం చెప్పాలనుకున్నామో అదంతా పోస్టు ద్వారా ఆయనకు పంపిస్తామని తెలిపారు.
Share this article :

0 comments: