చంద్రబాబు అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు

చంద్రబాబు అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు

Written By news on Wednesday, April 20, 2016 | 4/20/2016


25న ‘సేవ్ డెమొక్రసీ’
April 23 సేవ్ డెమొక్రసీ
చంద్రబాబు అనైతిక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు

 సాక్షి, హైదరాబాద్: అవినీతి సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తూ రాష్ట్రంలో ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) అనే పేరుతో April 23 ఆందోళన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.  ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమానికి పిలుపు నిచ్చింది. రాష్ర్టంలో తెలుగుదేశం అధినేత సాగిస్తున్న అనైతిక రాజకీయ కార్యకలాపాలపై ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలోనూ గళం విప్పాలని, రాష్ర్టపతికి, ప్రధానమంత్రికి నివేదించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మే 2వ తేదీన నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన జిల్లా అధ్యక్షుల, పరిశీలకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో కరువు పరిస్థితులు, టీడీపీ అధికార దుర్వినియోగం, ప్రతిపక్ష నేతలపై వేధింపులు, జన్మభూమి కమిటీల ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగతమైన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అధికార  పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి పోరాటం దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఈ సందర్భంగా జగన్ దిశానిర్దేశం చేశారు.

పార్టీ నేతలందరితోనూ విసృ్తతంగా చర్చలు జరిపి, ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. పార్టీని మరింత పటిష్టంగా నిర్మించి మరింత ముందుకు తీసుకు పోవడమే లక్ష్యంగా ఆయన జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో ఆయా జిల్లాల వారీగా చర్చించారు. పలువురు నేతలు ఆయనతో ముఖాముఖిగా కూడా మాట్లాడారు. పార్టీ శ్రేణులను క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా జగన్ పలు సూచనలు చేశారు. టీడీపీ అభివృద్ధి అని ఓవైపు చెబుతూనే తీవ్రమైన అవినీతికి, దోపిడీకి పాల్పడుతుండటాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టేలా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది.

 బాబు అనైతిక చర్యలు, వైఫల్యాలపై ఉద్యమం
 సాక్షాత్తూ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి కొనుగోలు చేయడాన్ని సమావేశం తీవ్రంగా గర్హించింది. సమావేశానంతరం పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. చంద్రబాబు అనైతిక చర్యలు, ఫిరాయింపుల గురించి ప్రజలకు తెలియ జెప్పడానికి ఏప్రిల్ 23న సాయంత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.  ప్రదర్శన అనంతరం ఆయా కేంద్రాల్లో  బహిరంగ సభలు కూడా జరుగుతాయన్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలను చేపట్టడంలో ఘోరంగా విఫలం కావడాన్ని ప్రశ్నిస్తూ మే 2న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న మంచి నీటి కటకటను ప్రతిబింబించేలా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరుతున్నామన్నారు. పార్టీ కార్యకర్తలతో పాటుగా ఆయా జిల్లాల్లోని నాయకులు తప్పనిసరిగా మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనలలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియ జెప్పాలన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటారని, అయితే ఎక్కడ పాల్గొనేది త్వరలో తెలియ జేస్తామని వారన్నారు. ఈ సమావేశంలో ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఫిరాయింపులపై సమీక్షలా!
 గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎండ దెబ్బకు తాళలేక వృద్ధులు, చిన్న పిల్లలు మరణిస్తున్నారు కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితులపై సమీక్షా సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షం నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు? ఎంత మందిని ఎలా లాగగలం అనే అంశాలపై సమీక్షించడం దారుణమని పార్థసారథి, వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేయడం గాని, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం పొందడం గానీ చేయకుండా ఈ ప్రభుత్వం ఫిరాయింపులకే ప్రాధాన్యం ఇస్తోందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిపారు.

ఈ దఫా వేసవి తీవ్రంగా ఉండబోతోందని ముందస్తు హెచ్చరికలున్నా ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. పశువులకు గ్రాసం లేక రైతులు వాటిని ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకుంటున్నారని, పశువులకు తాగే నీరు కూడా లేక కబేళాలకు తరలిస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు వచ్చినపుడు రైతులకు ఇబ్బందులు కలక్కుండా ఉండేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పశుక్రాంతి పథకాన్ని ప్రవేశ పెట్టి పేదవారికి వాటిని పంపిణీ చేశారని వారు గుర్తు చేశారు. మంచి నీటి కటకట ఉన్న గ్రామాలకు తాగునీటిని తరలించాలన్న ఆలోచన లేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ పాలిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు పరిస్థితిని, ఎండ తీవ్రతను ప్రభుత్వం గుర్తించక పోవడం సిగ్గు చేటని వారన్నారు.

 ఫిరాయింపులు, ప్రలోభాలపై రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు

 అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలు ఇస్తామని, మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు కొనుగోలు చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఈ నెలాఖరున గాని, మే మొదటి వారంలో గాని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నందున ఆ అవకాశాన్ని వినియోగించుకుంటామని, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరమూ ఢిల్లీ వెళతామని  పార్థసారథి, వెంకటరామిరెడ్డి మీడియాకు వివరించారు. ఫిరాయింపు నిరోధక చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో వివరిస్తామన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు మాత్ర మే పోతున్నారని, ఇతర నాయకులు, కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినపుడు సంతలో పశువుల్లాగా కొంటున్నారని విమర్శించిన చంద్రబాబు ఏపీలో తానేం చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దమ్ముంటే తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాలు విసిరిన చంద్రబాబు ఏపీలో కూడా తాను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళతారా అనే అంశాన్ని ఆయన విచక్షణకే వదలి వేస్తున్నామన్నారు. పోయిన ఏడాది మంచి నీటి సరఫరాకు కేటాయించిన నిధులనే ఇప్పటికీ విడుదల చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తోందో అర్థం అవుతోందని వారు అన్నారు.
Share this article :

0 comments: