కర్నూలులో 16,17,18 తేదీల్లో దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కర్నూలులో 16,17,18 తేదీల్లో దీక్ష

కర్నూలులో 16,17,18 తేదీల్లో దీక్ష

Written By news on Sunday, May 1, 2016 | 5/01/2016


దిగువ కృష్ణకు కష్టం
డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై నిరసనగా కర్నూలులో 16,17,18 తేదీల్లో దీక్ష
అన్యాయంపై ప్రశ్నించలేని సీఎం వైఖరిపై విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది నీటిని అడ్డగోలుగా మళ్లిస్తూ తెలంగాణ ప్రభుత్వం డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ... ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ.. పాలకులకు కనువిప్పు కలిగేలా ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజులపాటు కర్నూలులో తాను స్వయంగా నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నా.. చంద్రబాబు ఏమాత్రం చలించడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలే కాదు... తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతులు కూడా దారుణంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇదేమిటని కనీసం అడిగే పరిస్థితి కూడా చంద్రబాబుకు లేకుండాపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై జగన్ మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే...

 కేసీఆర్‌ను ఎందుకు నిలదీయరు?
 ‘‘రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. కరువును నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారు? అడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నైనా నిలదీసే పరిస్థితి ఉందా? పాలమూరు-రంగారెడ్డి. డిండి ప్రాజెక్టుల ద్వారా మన కళ్లెదుటే 115 టీఎంసీల నీటిని తీసుకుపోతాను అని కేసీఆర్ చెబుతూ ఉంటే ఈ విషయంపై అడగాలని చంద్రబాబుకు ఎందుకు తట్టడం లేదు? గట్టిగా పోరాటం చేయాలని ఎందుకు అనిపించడం లేదు? మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చే నీళ్లు మహబూబ్‌నగర్ గుండా శ్రీశైలంలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు చేరాలి. ఇలా వాటి ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, కృష్ణా డెల్టాకు నీళ్లు పారాలి అనే విషయం తెలిసి ఉన్నా.. నీళ్లను తోడుకుంటామని తెలంగాణ చెబుతూ ఉంటే ఈ అన్యాయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు.

 గోదావరి పరిస్థితీ అంతే...
 గోదావరి నది విషయం చూసినా ఇదే పరిస్థితి. గోదావరి నీరు తెలంగాణను దాటుకొని సీమాంధ్రలోకి రావాలన్న విషయం అందరికీ తెలుసు. ఆ నీటిని రానివ్వని పరిస్థితి కల్పిస్తూ ఉంటే మాట్లాడని చంద్రబాబు పట్టిసీమ అంటారు. ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం నీటి నిల్వ సామర్థ్యం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడే వర్షాల వల్ల తెలంగాణ నుంచి నీరు కింది వస్తుంది. ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి అవసరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు శ్రద్ధ చూపడం లేదు. 190 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఇవాళ కేవలం 2 శాతం, 4 శాతం మాత్రమే జరిగాయని సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే కేంద్ర మంత్రులు చెప్పే పరిస్థితి.

 పోలవరం.. స్కాముల ప్రాజెక్టు
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతున్నా కాంట్రాక్టర్‌ను మార్చడం లేదు. చివరకు దీన్నొక స్కాముల ప్రాజెక్టుగా మార్చేశారు. ఓ వైపున పెట్రోలు, డీజిల్, ఉక్కు, అల్యూమినియం రేట్లు తగ్గాయి. ఇసుక ఉచితంగా దొరుకుతోంది. సిమెంట్ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు. అయినా పోలవరం నిర్మాణ వ్యయాన్ని మాత్రం పెంచేశారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం ఇదివరకు రూ.4,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని రూ.7,000 కోట్లకు పెంచారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఈ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాల్సింది పోయి ఇంకా ఆ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు.

పైగా ఆ కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్ధతిలో తెచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశంలోనే తీర్మానం చేశారు. వీళ్లకు (టీడీపీకి) నచ్చిన వాళ్లను సబ్ కాంట్రాక్టర్లుగా తెచ్చుకుని, పెంచిన రేటుతో వాళ్లకు పనులు అప్పగించి, కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఈ కుంభకోణాలను చూసి భయపడే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు నిధులు ఇవ్వడం లేదు. పట్టిసీమ వల్ల చంద్రబాబు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లోని క్లాజ్ 7ఇ, క్లాజ్ 7ఎఫ్ అమల్లోకి తెచ్చే వీలు కలిగించారు. ఈ క్లాజ్‌ను చూపించి కేసీఆర్ తనను దులిపేస్తారనే భయంతో కనీసం చంద్రబాబు ఆయనను అడిగే పరిస్థితే లేదు.

 రాష్ట్రంలోని పరిస్థితులు దేశం దృష్టికి వెళ్లాలి
 శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల మేరకు నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాటు ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు ఇవ్వొచ్చు. అలాంటిది ప్రస్తుతం శ్రీశైలంలో 780 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పేర్కొన్న ప్రకారం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ బోర్డులను ఏర్పాటు చేసి, ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి నీళ్లు వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి.

అయినా ఇంతవరకూ బోర్డులను ఎందుకు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు గట్టిగా అడగలేకపోతున్నారు. అందుకే ఆయన వైఖరికి నిరసనగా... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చూసే విధంగా.... నేను మే నెల 16, 17, 18వ తారీఖుల్లో కర్నూలులో మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేయబోతున్నా. ఈ దీక్ష ద్వారా అయినా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు కేంద్రం దృష్టికి, దేశం దృష్టికి వెళ్లాలి. రాష్ట్రంలో ఓ వైపు ప్రజలకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. మరోవైపు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు పనికిరాని ప్రాజెక్టులు విచ్చలవిడిగా కడుతున్నారు.

 ఎక్కడ ఉన్నా మనుషులు మనుషులే
 మనుషులు అన్నాక ఎక్కడ ఉన్నా మనుషులే. ఇక్కడున్న(తెలంగాణ) మనుషులు ఒక్కటే... అక్కడున్న(ఏపీలో) మనుషులు ఒక్కటే. ఇక్కడున్న పాలకులు అక్కడున్న మనుషులకు తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేయడానికి పూనుకోవడాన్ని ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే కనువిప్పు కలగాలి. ప్రజల కోసం రాజకీయాలను పక్కనపెట్టాలి’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

 ఆ ప్రాజెక్టుపై చాలాసార్లు మాట్లాడాం
 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మా అభ్యంతరాన్ని ఇప్పటికే చాలాసార్లు తెలియజేశాం. ఇపుడు మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ల మనసులు మారాలి. మేల్కొనాలి. కింద ఉన్న కృష్ణా డెల్టా బతకాలనే ఆలోచన వాళ్లకు రావాలి. ఎవరి ఇష్టప్రకారం వాళ్లు ప్రాజెక్టులు కట్టుకోవడం సరైంది కాదు. ఈ విషయాలన్నీ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి దృష్టికి కూడా తీసుకెళ్లాం’’ అని జగన్ పేర్కొన్నారు.

 రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేశారు
 రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా అమ్మేశారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తనపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికిపోయినందున, దాని నుంచి తప్పించుకునేందుకు ఎవరినీ కూడా నిలదీసే పరిస్థితుల్లో చంద్రబాబు లేరని విమర్శించారు.

 చంద్రబాబు దేన్నీ పట్టించుకోవడం లేదు
 ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆయన ఇలా మాట్లాడగలుగుతున్నాడంటే కారణం ప్రత్యేక హోదా కావాలని అడిగే నాథుడు లేకపోవడమే. కేంద్రమంత్రి అలా మాట్లాడడం ధర్మమేనా! ఆ రోజు  రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాలు కలిశాయి. చంద్రబాబు, బీజేపీ పక్కనుంచి విభజనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తే.. కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరీ ఆ పని పూర్తి చేసింది. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పెట్టుబడుల, పరిశ్రమలు వస్తాయి.

ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసి కూడా చంద్రబాబు, కేంద్రంలో ఉన్న పార్టీలు మన జీవితాలతో చెలగాటం ఆడాయి. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, నరేంద్ర మోదీ ఇద్దరూ కలిసి రాష్ట్రానికి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఊదరగొట్టారు. ఇవాళేమో చంద్రబాబు మాట మార్చారు. ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గారుస్తూ వచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానని గట్టిగా అల్టిమేటం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు’’ అని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.

 చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారో... ఎలా నీరుగార్చారో? చూడండని విలేకరుల సమావేశంలో జగన్ దృశ్య సహితంగా ప్రదర్శించారు. వీడియో క్లిప్పింగ్‌లలో చంద్రబాబు మాట్లాడిన తీరు ఇలా ఉంది.

 ఎన్నికలకు ముందు...
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలే ఇస్తామన్నారు. పదిహేను సంవత్సరాలు ఇవ్వండి అని నేనడుగుతున్నా. ఒక పరిశ్రమ రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. పని ప్రారంభమయ్యే లోపు ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వారిని(బీజేపీ) కోరుతున్నా...
 2014 ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు...

 ఎన్నికల తర్వాత...
 కొంతమంది మాట్లాడుతున్నారు.  స్పెషల్ స్టేటస్ ఇస్తే అదేదో సంజీవని లాగా ఉంటుందని... ప్రత్యేక హోదాతో ఏమొస్తాయండీ... రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ, రెండు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములు(కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పథకాలు). సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు ఇప్పుడు తగ్గించేశారు. 62 నుంచి 52 శాతానికి తగ్గించేశారు. ఈఏపీ కోసం ఢిల్లీకి వెళ్లాలి, కేబినెట్‌లో ఆమోదం పొంది రావాలి. నా మొదటి డిమాండ్ ప్రత్యేక హోదాయే. వారు(కేంద్రం) ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తానన్నారు కదా! ఇస్తే కాదనను కదా! కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?
 ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు...

 ‘‘స్పెషల్ స్టేటస్‌తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని అంటున్నారు. పదేళ్లు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదే! వాటీజ్ ది రీజన్’’
 సీఎం హోదాలో విలేకరులతో మాట్లాడుతూ...
Share this article :

0 comments: