5 కోట్ల మంది జీవితాలతో ఇద్దరు సీఎంల చెలగాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 5 కోట్ల మంది జీవితాలతో ఇద్దరు సీఎంల చెలగాటం

5 కోట్ల మంది జీవితాలతో ఇద్దరు సీఎంల చెలగాటం

Written By news on Tuesday, May 17, 2016 | 5/17/2016


5 కోట్ల మంది జీవితాలతో ఇద్దరు సీఎంల చెలగాటం
జలదీక్షలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన
♦ తెలంగాణ ప్రాజెక్టులతో సీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణాడెల్టాకు నష్టం
♦ ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ నష్టమే... కృష్ణా,గోదావరి నీటిలో ప్రతి బొట్టూ అందరిదీ
♦15 రోజులకొకమారు వాటా సర్దుబాటు జరగాలి..

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజుల జల దీక్షను సోమవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నించకుండా సీఎం చంద్రబాబు మౌనంగా ఎందుకున్నారని జగన్ నిలదీశారు. వారి స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేసీఆర్, చంద్రబాబులను విమర్శించారు. ఈ ప్రాజెక్టులతో నీటి యుద్ధాలు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల వ్యవహారం గురించి కేంద్రంతో పాటు అందరికీ తెలియజేసేందుకు చేస్తున్న ఈ నిరాహార దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని  కోరారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

 శ్రీశైలానికి నీరొచ్చే దారేది?: శ్రీశైలానికి నీరు రాకమునుపు మహబూబ్‌నగర్‌లో 120 టీఎంసీల నీటిని అటు నుంచి అటే పైకి తీసుకుపోతే శ్రీశైలానికి నీళ్లు ఎలా వస్తాయి అని కేసీఆర్‌ను, చంద్రబాబును అడుగుతున్నా. పాలమూరు-రంగారెడ్డి, డిండిల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు పైకి తీసుకుపోవాలని ప్రణాళిక వేసుకున్నారు. 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీరు అందించే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టులకు నీరందాలంటే శ్రీశైలం వద్ద 854 అడుగులపైన నీరు ఉండాలి. హంద్రీ నీవాకు అందాలంటే 833 అడుగులుండాలి... అటువంటిది 800 అడుగుల్లోనే ఇన్‌టేక్ పాయింటు పెట్టుకుని నీరు తోడేసుకుపోతే తాగడానికైనా నీరు దొరుకుతాయా? సీమలోని 4 జిల్లాలతో పా టు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు... చివరకు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకూ అన్యాయం చేసే కార్యక్రమం కేసీఆర్ చేస్తున్నారు.

 చంద్రబాబు పుణ్యమే..: శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్‌లోనే కనీస నీటి మట్టం 854 అడుగులుగా నిర్ధారించారు. మన ఖర్మ ఏమిటంటే చంద్రబాబు ఈ కనీస నీటి మట్టాన్ని తగ్గిస్తూ జీవో 69ను తెచ్చారు. ఇది మనకు శాపంగా పరిణమించింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు రైతుల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా, డ్యామ్‌ను కట్టిన ఉద్దేశ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బాబు కనీస నీటి మట్టాన్ని తగ్గించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆ అన్యాయాన్ని సరిచేస్తూ... కనీస నీటి మట్టం 854 అడుగులకు తగ్గరాదంటూ జీవో 107 తెచ్చారు.

తద్వారా రాయలసీమతో పాటు ఆరు జిల్లాలకు జరిగిన అన్యాయాన్ని సరిచేశారు. 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీరు రాదు. కానీ 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నా.. రోజుకు ఏకంగా 30వేల క్యూసెక్కుల నీటిని తోడుకుపోయేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఏమి చేస్తున్నారు?  అనుమతులు లేకపోయినా కేసీఆర్ ప్రాజెక్టులు ఎలా కడతారు?  అటు గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల, దేవాదుల ఎత్తిపోతల, తుపాకులగూడెం, సీతారామ, భక్తరామదాసు... మొత్తం 5  ప్రాజెక్టుల ద్వారా 70 వేల క్యూసెక్కుల నీరును రోజూ తోడుకునేందుకు కేసీఆర్ ప్రణాళిక వేసుకున్నారు. దీనిని నిలదీయాల్సిన చంద్రబాబు కిమ్మనకుండా ఉన్నారు.

 ప్రతి బొట్టులో ఎవరి వాటా వారికుండాలి..
 కృష్ణా, గోదావరి నదుల నీటి కేటాయింపులపై 2011లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు 26 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేశాం. ప్రతీ బొట్టులో ఎవరివాటా వారికి ఇవ్వండని కోరా. 15 రోజులకు ఒక్కసారి అందరికీ సర్దుబాటు చేయాలని కోరా. ఇవాళ మనం చేయాల్సింది కూడా అదే. ప్రతి నీటి బొట్టులో ఎవరి వాటా వారికి ఇవ్వాలి. 15 రోజులకొకమారు వాటా సర్దుబాటు చేస్తే ఎవరూ బాధపడకుండా ఉంటారు.  

 అందరూ కలిసి పోరాడాలి...
 ఇద్దరు సీఎంలకూ జ్ఞానోదయం కావాలి. ఇప్పటికైనా కేంద్రం, చంద్రబాబు, కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయాలి. పాలకులు మార్గనిర్దేశకులుగా ఉండాలి. ఇదే ఏపీ పైన ఉండి తెలంగాణ కింద ఉండి...మేం నీరు వదలం అంటే మీకు నీరు వచ్చేదా? అది మీకు నచ్చేదా? ఎవరికీ నచ్చేది కాదు. కారణం.. నీరు లేకపోతే బతకలేని పరిస్థితి. వీరిలో మార్పు రావాలంటే అందరూ కలిసి కట్టుగా పోరాడాల్సి ఉంది. మన ప్రాంతాలు ఎడారులుగా మారకుండా ఉండాలంటే ఆ పోరాటంలో అందరూ భాగస్వాములం కావాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: