ప్రభుత్వానికి పట్టని కరువు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వానికి పట్టని కరువు

ప్రభుత్వానికి పట్టని కరువు

Written By news on Sunday, May 1, 2016 | 5/01/2016


శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. సర్కార్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడేందుకు జిల్లాలోని 38 మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద సోమవారం ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహిం చనున్నట్లు ఆమె వెల్లడించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.
 
  ప్రస్తుతం రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కరువుపై జిల్లా యంత్రాంగంతో ఒక్కసారైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కళ్లబొల్లి హామీలు గుప్పించడమే తప్ప వారు కష్టాల్లో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. చాలా మండలాల్లో తాగునీటి సమస్య ఉందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు.
 
 జిల్లాలో కరువు తాండవిస్తోందని, పల్లెలు వలస బాట పడుతున్నాయన్నారు. పశుగ్రాసం కూడా లభించడం లేదన్నారు. కరువును ఎలా ఎదుర్కొంటారో ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రణాళిక రూపొందించుకోకపోవడం శోచనీయమన్నారు. కరువు, కాటకాలు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదన్నారు. దీనిపై కనీసం అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా రాదని, ఏపీ అభివృద్ధికి రూ.90 వేల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి చెప్పార ని, ఈ రూ.90 వేల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు.
 
 వీటిన్నింటికీ నిరసనగానే ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి మండవిల్లి రవి, నాయకులు తంగుడు నాగేశ్వరరావు, దుంగ శిమ్మన్న పాల్గొన్నారు.
Share this article :

0 comments: