మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా..?

మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా..?

Written By news on Wednesday, May 11, 2016 | 5/11/2016


అల్టిమేటమ్ ఇవ్వగలవా?
కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకుంటావా?
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మంత్రులను ఉపసంహరించుకుంటానని కేంద్రానికి చంద్రబాబు అల్టిమేటం ఇవ్వగలడా? ఒక నెల మీకు గడువు ఇస్తున్నానని చెప్పగలడా? ఈవేళ ఇంత జరుగుతున్నా బాబు ఢిల్లీకి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నాడో, మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా..? ఎందుకంటే అలా అడిగిన రోజు ఢిల్లీవాళ్లు జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తారనే భయం కాబట్టే బాబు ధైర్యం చేయడం లేదు’’ అని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ఆధ్వర్యాన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

బాబు వెన్నుపోటు వల్లే హోదా దూరం..
‘‘ఏ రోజైతే చంద్రబాబు ఢిల్లీకి వార్నింగ్ ఇస్తాడో, మంత్రులతో రాజీనామా చేయిస్తామని ఏ రోజైతే అల్టిమేటం ఇస్తాడో ఆరోజు హోదా మన వాకిటకు వస్తుంది. ఇవాళ ప్రత్యేక హోదా రావాలంటే మనమంతా ఒక్కటై చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలి. బాబు ఇక్కడ ఉన్నప్పుడు బీద అరుపులు అరుస్తారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీని పొగుడుతారు. ఈమధ్య కాలంలో మనం చాలా చూశాం. చాలా విన్నాం. ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నాడు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు కుమ్మరిస్తున్నాడు. 17 మంది ఎమ్మెల్యేలు.

ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు అంటే రూ.400 కోట్లు, రూ.500 కోట్లు. ఇంత బ్లాక్‌మనీ బాబుకు ఎక్కడి నుంచి వచ్చింది అని గట్టిగా నిలదీయాలి. ఇదే చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ఈ మాదిరిగానే డబ్బులిస్తూ ఆడియో, వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం కూడా మనమంతా చూశాం. ఇవాళ ఇన్నిన్ని ధర్నాలు, దీక్షలు చేస్తున్నా కూడా ప్రత్యేక హోదా మనకు ఎందుకు రావడం లేదంటే.. కారణం చంద్రబాబే. హోదాపై ఆయన మనకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టే. ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలన్నాడు.

ఎన్నికలైపోయాక స్వరం మార్చాడు. ప్రత్యేక హోదా సంజీవని కాదట. ప్రత్యేక హోదా వల్ల స్వర్గం అయిపోదట. చివరకు ఆయన ‘కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని అంటారు. ప్రత్యేక హోదా మీద బాబు ఈ మాదిరిగా స్వరం మారుస్తూ పోయాడు కాబట్టే చివరకు ఢిల్లీ వాళ్లకు లోకువ అయిపోయాడు. అందుకే ఢిళ్లీవాళ్లు ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఏకంగా పార్లమెంటులోనే చెప్పే ధైర్యం చేశారంటే అది బాబు వల్లే.

ఓట్లకోసం ఇంత మోసమా...?
ఈ రోజు ఇంతటి మండుటెండను లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. దీక్షలు జరుగుతున్నాయి. మిమ్మల్నందరినీ ఒకే ఒక సూటిప్రశ్న అడుగుతున్నాను. మీ అందరికీ ఉద్యోగాలు కావాలా? వద్దా? (అందరూ చేతులు పెకైత్తి ఉద్యోగాలు కావాలంటూ నినదించారు) ఇదే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఇంటికి వెళ్లి ఏ టీవీ ఆన్ చేసినా మనకు వినిపించిందేమిటి? జాబు రావాలంటే బాబు రావాలన్న మాట వినిపించేది అవునా? కాదా? (అవునని జనం చేతులు పెకైత్తి చూపించారు.) ఒకవేళ జాబు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. బాబుకు ముఖ్యమంత్రి జాబు వచ్చింది.

ప్రజలతో పనైపోయింది. ఇవాళ మనకు జాబు వచ్చిందా అని అడుగుతున్నా? తన నైజం ప్రకారం.. ఎన్నికలప్పుడు ప్రజలను ఉపయోగించుకుంటాడు. ఆ తర్వాత ఆ ప్రజలను మోసం చేస్తాడు. ఇదేమీ బాబుకు కొత్త కాదు. ఇవాళ నిజంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబు వస్తాడు జాబు వస్తుందని. ఇవాళ నిజంగా రాష్ర్టంలో జాబులు రావాలంటే, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం.

ప్రత్యేక హోదా సంజీవనే...
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో కనీవినీ ఎరుగనివిధంగా పరిశ్రమలు వస్తాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. లక్షల ఉద్యోగాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు సింగపూర్, జపాన్ వెళ్లాల్సిన పనిలేదు. ప్రత్యేక విమానాలు ఎక్కి ఎక్కడకూ తిరగాల్సిన పని లేదు. ప్రత్యేక హోదా వలన పరిశ్రమలు వస్తే వాటికి రాయితీలు ఇస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెడితే పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కంట్యాక్స్‌లు కట్టాల్సిన పనిలేదు. ఆ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీతో కరెంటు, పావలా వడ్డీకే వర్కింగ్ కేపిటల్ రుణాలు అందుబాటులోకి వస్తాయి.

ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి మాత్రమే ఉన్న ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి వస్తాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే తెలుగుదేశం, బీజేపీలు అదే చట్టసభలో ఉండి ఓట్లేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఐదేళ్లు అంటోంది.. ఐదేళ్లు కాదు మేము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎన్నికల సభల్లోనూ ఊదరగొట్టారు. ఆ రోజు వాళ్లు ఆడిన ఆటలు, వాళ్లు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని వర్గాలనూ మోసం చేశారు.

రైతు రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికలప్పుడు బాబు వస్తేనే జాబు అన్నారు. ఎన్నికలయ్యాక అందరికీ పంగనామాలు పెట్టారు. ఇవాళ ఎంఆర్‌పీఎస్ సహా అనేక మంది ధర్నాలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డోలు కొట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ పంగనామాలు పెట్టారు. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలకతీతంగా ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరికీ మేలు చేస్తే.. కులాలకు, మతాలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, రైతులకు పేరుపేరునా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడుగారే.

ఎన్నో పోరాటాలు చేశాం...
ప్రత్యేకహోదాపై వీళ్లకు జ్ఞానోదయం కావాలని  ఎన్నో ధర్నాలు చేశాం. దీక్షలు చేశాం. ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో ప్రధాని నరేంద్రమోదీకి, చంద్రబాబుకు అర్థం కావాలన్న ఉద్దేశంతో... ప్రధాని రాష్ట్రానికి రావడానికి కొద్ది రోజుల ముందు నేనే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశా. కానీ ప్రధాని రాకుండానే నిరాహార దీక్ష చేస్తున్న మమ్మల్నందరినీ బలవంతంగా తరలించి దీక్ష భగ్నం చేసి ప్రత్యేక హోదాను నీరుగార్చారు. అయినా పోరాటం చేస్తూనే ఉన్నాం. ధర్నాలు, దీక్షలను ఢిల్లీ దాకా తీసుకుపోయి అక్కడ కూడా మనవాణి వినిపించాం. అయినా చంద్రబాబు కారణంగా ఫలితం దక్కకుండా పోయింది.

ఢిల్లీలో నరేంద్రమోదీని నిలదీయలేకపోతున్నాడు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా వారి జీవితాలతో చెలగాటాలాడుతున్నాడు. ఇలాంటి చంద్రబాబు పాలన మీకు కావాలా అని అడుగుతా ఉన్నా. కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయమై ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలను కొనడం కాదు.. ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవాలి అన్న విషయం ఆయనకు అర్థం కావాలి. చంద్రబాబుకు బుద్ధొచ్చేట్టుగా అందరం ఒక్కటై గట్టిగా ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం.

కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడం లేదు?
చంద్రబాబు తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజల జీవితాలను ఎడారిపాలు చేస్తున్నారు. రాష్ర్టంలో ఒకవైపున నీళ్లు లేవు. రైతులు అల్లాడిపోతున్నారు. కృష్ణానది మహబూబ్‌నగర్ దాటుకుని శ్రీశైలంలోకి రావాలి. శ్రీశైలం దాటుకుని నాగార్జునసాగర్‌కు రావాలి. మహబూబ్‌నగర్‌లో కృష్ణానదిని ఆపుతూ శ్రీశైలానికి నీళ్లు రాకుండా కేసీఆర్ పైన దుండుకుంటూ ఉంటే, ఆయనను చంద్రబాబు వ్యతిరేకించరు. కారణం వ్యతిరేకిస్తే కేసీఆర్ ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులను బైటకు తీస్తారని భయం. ఆయన జైల్లో పెట్టిస్తారన్న భయంతో రాష్ట్ర రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

డీఆర్‌వోకు వినతిపత్రం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ యాదగిరికి జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, జడ్‌పీ ప్రతిపక్షనేత సాకే ప్రసన్న కుమార్,  పార్టీ కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: