పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'

పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'

Written By news on Thursday, May 12, 2016 | 5/12/2016


పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు'
- అనుమానాస్పద కంపెనీలతో హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు సంబంధాలు
- ప్రసాద్‌కు చిన్న దేశాల్లో పలు కంపెనీలు, కొన్ని బినామీలతో నడుస్తున్నాయని పనామా పేపర్స్ అభియోగాలు

- చంద్రబాబు సీఎం అయిన నెలరోజులకే హెరిటేజ్ డెరైక్టర్‌గా మోటపర్తి నియామకం
- ఘనాలో ఉంటున్న ఎన్నారై ప్రసాద్‌ను డెరైక్టర్‌గా నియమించడంపై విస్మయం

- బాబుకు అత్యంత సన్నిహితుడు, ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అజయ్‌దేవ్‌గణ్ పేరు పనామాలో వచ్చిన వారానికే ఇప్పుడీ ప్రసాద్ పేరు రావడంపై చర్చ

సాక్షి, హైదరాబాద్:
 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామ వరప్రసాద్‌కు అనుమానాస్పద కంపెనీలతో వున్న లింకుల్ని  వెల్లడించింది. పన్నులు ఎగవేసేందుకు చిన్న చిన్న దేశాల్లో, ద్వీపాల్లో నెలకొల్పుతున్న కంపెనీల భాగోతాల్ని,  బినామీల పేర్లతో నెలకొంటున్న కంపెనీల గుట్టురట్టుల్ని విప్పిచెపుతున్న పనామా పేపర్స్ తాజాగా బయటపెట్టిన ప్రసాద్ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఈ మోటపర్తి ప్రసాద్ పేరును తాజా పనామా పత్రాల్లో మూడు దఫాలు ప్రస్తావించారు. ఆఫ్రికా ఖండంలోని ఘనా, టోగో దేశాల్లో ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్‌కెమీ వెంచర్స్ వంటి ఆఫ్‌షోర్ కంపెనీలతో ఆయనకున్న లింకుల్ని పనామా పేపర్స్ వెల్లడించింది.  నామమాత్రపు కంపెనీల పేర్లమీద పన్నులు ఎగవేసారన్న అభియోగాల్ని మోపింది. బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్, ఈక్వడార్, ఘనా, పనామా దేశాల్లో రిజిష్టర్ అయి వున్న పలు కంపెనీల్లో ప్రసాద్‌కు వాటాలున్నాయి.

ఎన్నెన్నో అనుమానాలు...
పనామా పత్రాల వ్యవహారం తొలిసారిగా బయటపడ్డపుడే ప్రసాద్ పేరు ప్రస్తావనకు వచ్చింది. టోగో దేశంలోని వాసెమ్ అనే కంపెనీ గురించి పనామా పేపర్స్ విస్త్రతంగా కథనాలు వెలువరించింది. వాసెమ్ యజమానుల గురించి పనామా పేపర్స్‌లో ప్రస్తావిస్తూ దానిలో బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెన్లెమ్ లిమిటెడ్‌కు 40 శాతం వాటా వున్నట్లు పేర్కొంది. ఆ కెన్లెమ్ యజమాన్యంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అసలు వ్యక్తుల పేర్లు యజమానులుగా ఆ కంపెనీ చూపించడం లేదని, బినామీ పేర్లతో నడుస్తోందన్న అభియోగాల్ని పనామా పేపర్స్ మోపింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... మోటపర్తి ప్రసాద్‌కు కెన్లెమ్‌లో 24 శాతం వాటా వుంది. అలాగే కెన్లెమ్‌లో మరో 17 శాతం వాటా రఫెల్ హోల్డింగ్స్‌కు వుంది. ఈ రఫెల్ హోల్డింగ్స్ అసలు యజమానులు కూడా వేరే వ్యక్తులని పనామా పేపర్స్ వెల్లడించింది. టోగోలోని వాసెమ్ సిమెంటు కంపెనీలో 89 శాతం షేర్లు ఆ దేశానికి చెందినవారికి కావు. ఈ కంపెనీ ప్రధాన వాటాదారుల్లో మోటపర్తి ప్రసాద్ ఒకరు.

బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే....
హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా 2014 జూలై నెలలో ఐదేళ్ల కాలానికి ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన కంపెనీకి ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2014 జూన్ నెలలో కొత్త ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాబు పదవిలోకి వచ్చిన నెలరోజులకే ప్రసాద్‌కు హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా కూర్చోబెట్టడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఘనా, టొగో తదితర దేశాల్లో పలు కంపెనీలు స్థాపించిన ప్రసాద్  ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన  దేశంలో, ముఖ్యంగా  రాష్ట్రంలో ఉన్నపుడు చంద్రబాబు నిర్వహించే ప్రతి సమావేశంలో పాల్గొనే వారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన  హెరిటేజ్‌లో ఉన్నతోద్యోగి అని చెప్తుండేవారని, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఇంత పెద్ద వ్యాపార, బినామీ సంబంధాలున్నాయని తమకు తెలియదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నా యి. అయితే ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఈ దేశంలో వుండే ఒక వృత్తినిపుడినో, పారిశ్రామికవేత్తనో ఎంచుకోకుండా, ఎక్కడో ఘనా దేశంలో వుంటున్న ఒక ఎన్నారైని నియమించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.  

హైదరాబాద్‌లోనూ ఎన్నో కంపెనీలు
ప్రసాద్‌కు హైదరాబాద్‌లో సైతం పలు రిజిష్టర్డ్ కంపెనీలున్నాయి. చాలా కంపెనీలకు ఆయన చైర్మన్‌గా, డెరైక్టరుగా, భాగస్వామిగా ఉంటున్నారు. డిజైన్ ట్రయిబ్, విండ్సర్ ఎడిఫిసెస్, వోల్టా ఫ్యాషన్స్, వోల్టా ఎస్టేట్స్ , వోల్టా ఇంపాక్స్, తోషాలి సిమెంట్స్, ప్రకృతి సిమెంట్స్, పేపర్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దక్కన్ ఆటో, పృధ్వీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్స్ వీటిలో కొన్ని. ఇందులో చాలావరకూ హైద రాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని హౌస్ నంబర్ 123/3, మూడో ఫ్లోర్‌లో వున్నట్లు ఆల్ కంపెనీ డేటా.కామ్ సైట్ వెల్లడిస్తోంది. అయితే ఆ భవనంలో ఇప్పుడు అవేవీ లేవు. మరో కార్పొరేట్ గ్రూప్ కంపెనీలు అక్కడ వుండటం గమనార్హం. పనామా పేపర్స్‌లో  ఆయన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రసాద్ స్పందిస్తూ ఘనా, టోగో దేశాలతో సహా పలు దేశాల్లో తనకు పలు కంపెనీలున్నాయని, అవన్నీ హోల్డింగ్ కంపెనీలని, చట్టబద్దమైనవేనన్నారు.తాను హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్‌నని ఆయన పేర్కొన్నారు. మోటపర్తి ప్రసాద్ కుమారుడు సునీల్ అమెరికా, హైదరాబాద్‌ల్లోని స్టార్టప్ కంపెనీల్లో దాదాపు రూ. 40 కోట్లు పెట్టుబడి చేశారు.  
 
ఎవరీ ప్రసాద్...
కృష్ణాజిల్లాకు చెందిన మోటపర్తి ప్రసాద్ చాలా కాలం క్రితం ఆఫ్రికా దేశాలకు వెళ్లి వ్యాపారాలతో బాగా సంపాదించారు.  వరంగల్ నిట్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. ముంబై, గుజరాత్‌ల్లో ఇనుము, ఉక్కు ఫౌండ్రీల నిర్వహణకు సంబంధించి అనుభవం సంపాదించారు. 1985లో పటాన్‌చెరు వద్ద మార్టోపెరల్ అల్లాయిస్ అనే కంపెనీని స్థాపించి, దాని టర్నోవర్‌ను నాలుగేళ్లలో రూ. 5 కోట్లకు తీసుకెళ్లారంటూ ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించే వోల్టాస్ ఫ్యాషన్ ప్రొఫైల్‌లో వివరించారు.

అటుతర్వాత సిమెంటు తదితర రంగాల్లోకి ప్రవేశించి, పలు దేశాల్లో వివిధ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఆ ప్రొఫైల్‌లో వివరించారు. దీని సంగతి పక్కనబెడితే...ఆయన చంద్రబాబునాయుడుకి సన్నిహితుడంటూ పారిశ్రామిక, రాజకీయ వర్గాలు చెపుతుంటాయి. అందుకే ఘనా దేశంలో వుంటున్న ఎన్నారైను ఏరికోరి తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టరుగా నియమింపచేశారని చెప్పుకుంటుంటారు. ప్రసాద్ కుమారుడికి  రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివిస్ లేబరోటరీస్ యజమాని మురళీ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
 
అజయ్ దేవ్‌గణ్ తర్వాత....
ఆంధ్రప్రదేశ్‌తో ఏ విధమైన సంబంధం, అనుబంధం లేని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికచేసుకున్న కొద్దిరోజులకే ఆ హీరో పేరు పనామా పేపర్స్‌లో ప్రముఖంగా వెల్లడయ్యింది. హిందీ సినిమాల విదేశీ ప్రదర్శనా హక్కుల్ని పొందేందుకు బ్రిటిష్ వర్జిన్ ఐలెండ్స్‌లో ఒక కంపెనీని నెలకొల్పడంపై జరిగిన భాగోతాన్ని పనామా పేపర్స్ ఈ నెల మొదటివారంలో బయటపెట్టింది. ఇది జరిగి వారం తిరక్కుండానే బాబు కుటుంబ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ డెరైక్టర్ ప్రసాద్ పేరు పనామాలో పొక్కడంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి

http://www.sakshi.com/news/hyderabad/ap-cm-chandrababus-heritage-director-motaparthi-prasad-name-in-panama-papers-341031?pfrom=home-top-story
Share this article :

0 comments: