అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు

అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు

Written By news on Saturday, May 14, 2016 | 5/14/2016


అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు
విజయవాడ :విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... విజ్ఞాన యాత్రకు వెళ్లిన  టీడీపీ కార్పొరేటర్ చంటిబాబు విమానంలో చేసిన పోకిరీ చేష్టలు వివాదాస్పదమయ్యాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ భీముడు అతడిని  అదుపులోకి తీసుకున్నారు.
సుమారు అరగంట సేపు విచారణ నిర్వహించారు. ఈ విషయాన్ని తోటి కార్పొరేటర్లు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్లు సమాచారం. గత నెల 29న విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం ఢిల్లీ నుంచి శుక్రవారం తిరుగు ప్రయాణం కట్టారు. కొందరు టీడీపీ కార్పొరేటర్లు విమానం, మరికొందరు రైల్లో బయలుదేరారు. అయితే చంటిబాబు విమానంలో పక్క సీట్లో ఓ మహిళ ఉన్నారు.

తనతో చంటిబాబు అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గన్నవరం సెక్యూరిటీ వింగ్ రంగంలోకి దిగింది. విమానం గన్నవరం చేరుకోగానే సదరు కార్పొరేటర్‌ను సెక్యూరిటీ అధికారులు చుట్టుముట్టారు. అనూహ్య పరిణామంతో టీడీపీ కార్పొరేటర్లు కంగుతిన్నారు. అందరూ కలిసి ఉంటే బుక్కైపోతామని భావించారు.  డెప్యూటీ మేయర్ గోగుల రమణారావును చంటిబాబు వద్ద ఉంచి మిగితా వారంతా బయటకు వచ్చేశారు. అనంతరం ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు.

వారు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి చంటిబాబును అక్కడ నుంచి తప్పించారు. గతనెల 30వ తేదీన పూణే లో ఓ కార్పొరేటర్ ట్రయిన్‌లో మద్యం సేవించి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కార్పొరేటర్ల ఆగడాలతో తలలు పట్టుకున్న టీడీపీ నాయకులు కనీసం ఖండన ఇచ్చే ధైర్యం చేయలేదు. ఈ వివాదం సద్దుమణగక ముందే మరో కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే చంటిబాబును వదిలేశారని గన్నవరం పోలీసులపై విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావటం వల్లే అతడిని వదిలేసినట్లు తెలుస్తోంది. మహిళలతో టీడీపీ కార్పొరేటర్ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.sakshi.com/news/hyderabad/case-filed-on-ummadi-venkateswarrao-vijayawada-corporator-341710


Share this article :

0 comments: