వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి

వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి

Written By news on Wednesday, May 18, 2016 | 5/18/2016


హరీశ్ రాజీనామా చేయాలి
♦ మంత్రిగా ఉండి బెదిరింపులా..: వైఎస్సార్‌సీపీ
♦ ఏపీ ప్రయోజనాల కోసం జగన్ దీక్ష చేస్తున్నారు
♦ వీలైతే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి
♦ అంతేగానీ దబాయింపులకు దిగడమేమిటని ప్రశ్న
♦ వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన
♦ నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు, నీటి వినియోగంపై తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... మానుకోట చేస్తా అంటూ హరీశ్‌రావు బెదిరింపులకు దిగడమేమిటని నిలదీసింది. మంత్రి హోదాలో ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా హెచ్చరికలు చేస్తున్న హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, గత రెండేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఎంత బడ్జెట్ విడుదల చేశాయో ప్రకటించాలన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యాలయంపై దాడిని, హైదరాబాద్‌లో పలు చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా గద్దెలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాచరికం అనుకుంటున్నారా?: నల్లా
‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతున్నదని అనుకుంటున్నారా? తామేమైనా అభినవ నిజాం నవాబు అనుకుంటున్నారా..’  అని నల్లా సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయిన హరీశ్‌రావు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి మానుకోట పునరావృతమవుతుందంటూ హెచ్చరికలు చేయడం... రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. హరీశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు జగన్ దీక్ష చేస్తుంటే.. ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమేమిటని నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి, జెండా గద్దెల కూల్చివేతను ఖండించారు.
వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇవ్వాలి: రాఘవరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో వైఎస్ ప్రారంభించిన 36 ప్రాజెక్టుల్లో ఆరు పూర్తికాగా, 9 నిర్మాణదశలో ఉన్నాయని.. 21 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు రూ.10వేల కోట్లు కేటాయిస్తే వాటన్నింటినీ పూర్తి చేసి ఏకంగా 49 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వొచ్చన్నారు. కానీ అవి పూర్తయితే వైఎస్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే పక్కన పెట్టారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని జగన్ దీక్ష చేస్తున్నారని...
ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా మానుకోట పునరావృతం అవుతుందంటూ హరీశ్ హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వీలైతే జగన్ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని.. అలాగాకుండా ఏవేవో మాట్లాడడం సమంజసం కాదన్నారు. పచ్చకామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా టీఆర్‌ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని రాఘవరెడ్డి విమర్శించారు. ఏ ఎన్నికలు వచ్చినా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోయి, డబ్బు వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సోమవారం జేఏసీ పేరిట కొందరు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడాన్ని ఖండించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే.. తాము ముందుండి అఖిలపక్షంతో కలసి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పారు.
Share this article :

0 comments: