Home »
» వైఎస్ జగన్ జలదీక్షకు పోటెత్తిన జనం
వైఎస్ జగన్ జలదీక్షకు పోటెత్తిన జనం
కర్నూలు: కృష్ణా జలాల నీటి మళ్లింపు, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్షకు జనంపోటెత్తారు. వైఎస్ జగన్ చేస్తున్న నిరాహారదీక్ష మంగళవారం రెండోరోజుకు చేరుకుంది. కర్నూలులోని నంద్యాల రోడ్డులో కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఉన్న దీక్షావేదిక వద్దకు వేలాదిమంది ప్రజలు తరలిస్తూ వైఎస్ జగన్ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారు. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అన్ని వర్గాల వారు సంఘీభావం తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్ తో ఫొటోలు దిగి, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు. సోమవారం నుంచి వైఎస్ జగన్ మూడురోజుల పాటు నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు దీక్ష వేదిక వద్ద వైఎస్ జగన్ ను పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వేదికపై పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, ఏపీ ప్రభుత్వం చేతగానితనాన్ని దుయ్యబట్టారు.
కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులన్నీ పూర్తయితే కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోకి చుక్కనీరు కూడా రాదని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తాగడానికి కూడా నీళ్లు దొరకవని చెప్పారు. చంద్రబాబు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి రావాల్సిన నీటి వాటా కోసం అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ చేస్తున్న జలదీక్షకు ప్రతిఒక్కరూ సంఘీభావం తెలపాలని కోరారు.
0 comments:
Post a Comment