
గత ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. కోడెల ఒక ప్రైవేటు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్న ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చయింది' అని తెలిపారు.
'ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు సంపాదించారు కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం సరైందేనని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి సంపాదించుకోవాలని వారు అనుకుంటున్నారు' అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్ధి రూ. 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. దానికి కొన్ని వందల రెట్లు అధికంగా డబ్బులు ఖర్చు చేశానని స్పీకర్ చెప్పటం అందరినీ విస్మయ పరిచింది.
0 comments:
Post a Comment