13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయి.. కానీ గెలుపు హీరోదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయి.. కానీ గెలుపు హీరోదే

13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయి.. కానీ గెలుపు హీరోదే

Written By news on Wednesday, June 15, 2016 | 6/15/2016


సున్నా మార్కుల బాబు.. డబ్బుతో గెలవలేవు
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా
విజయవాడలో ముగిసిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం

 (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి)

 ‘ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు. 2004 ఎన్నికలకు ముందు తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా పనిచేశావు. ఆ ఎన్నికల్లో 294 సీట్లకు గాను 46 సీట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. అవినీతి, అక్రమాలతో కూడబెట్టిన నల్లడబ్బుతో ఓటుకు వేలాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయవచ్చనుకుంటున్నావేమో. ప్రజలతో పనిలేదని భావిస్తున్నావేమో. ప్రజల గుండెల్లో, మనసుల్లో  నిలవాలే తప్ప... ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన గెలవలేవు. గుర్తుంచుకో...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.

అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనను ప్రజలు వద్దంటున్నారని, ఆయన పాలనకు వందకు సున్నా మార్కులు వేస్తారన్నారు. సిగ్గు, లజ్జ లేకుండా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు పాలనను ప్రజల సహకారంతో సాగనంపి రాష్ట్రంలో రాజన్న రాజ్యం తేవడానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దిశా నిర్దేశం చేస్తోందన్నారు. విజయవాడ బందరు రోడ్డులోని ‘ఎ’ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విసృ్తత స్థాయి సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి దశ దిశ నిర్దేంచారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమం అయిదు నెలల పాటు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా వై.ఎస్.జగన్ ప్రసంగం... ఆయన మాటల్లోనే...

 పార్టీ స్థాపించి ఐదేళ్లయింది. ఈ అయిదేళ్లుగా బాధ్యతగలిగిన ప్రతిపక్షంగా, వెనకడుగు వేయకుండా ప్రజల పక్షంగా నిలుస్తున్నాం. ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా జగన్ అండగా ఉంటున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తోంది. ప్రజల ఆశీస్సులతో రెండు నుంచి 18కి నేడు 67 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాలకు పార్టీ ఎదిగింది.

 గెలవడానికి తినని గడ్డి లేదు...
 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వచ్చింది 1.30 కోట్ల ఓట్లు. టీడీపీకి వచ్చింది 1.35 కోట్ల ఓట్లు. అంటే తేడా కేవలం 5 లక్షల ఓట్లు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు తినని గడ్డి లేదు. చేయని మోసం లేదు. చెప్పని అబద్దం లేదు. చంద్రబాబుకు ఆ అబద్ధాలు బాగా సహకరించాయి. టీవీల్లో ప్రకటన లు, గోడలపై రాతలు, పేపర్లు... ఒక్కటేంటి అన్నిం టినీ అబద్దాలు చెప్పడానికి ఉపయోగించుకున్నారు.  వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లోని బంగారు ఆభరణాలను బేషరతుగా ఇప్పిస్తామన్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఆ హామీలన్నీ ఇప్పటికీ చెవుల్లో రింగు రింగుమని మారుమోగుతున్నాయి. ఎన్నికలు కాగానే బాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.

 రైతులకు అందని రుణాలు...
 బాబు సీఎం అయ్యే నాటికి రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉండేవి. ఇప్పటికి ఆ రుణాలపై వడ్డీనే రూ.25 వేల కోట్లు అయ్యింది. చంద్రబాబు రుణమాఫీ కింద ఇచ్చింది వడ్డీకి కూడా సరిపోలేదు. బాబు అబద్దపు మాటలు విని, హామీలు నమ్మినందున రైతులకు ఇప్పుడు వడ్డీలేని రూ.లక్ష రుణం, పావలా వడ్డీ చొప్పున రూ.3 లక్షల వరకు రుణాలు మంజూరు కావడంలేదు. డ్వాక్రా మహిళలకు గతం లో వడ్డీలేని రుణాలు అందేవి. చంద్రబాబు మోసం చేసినందున రూ.2, రూ.2.50, చక్రవడ్డీలు చెల్లిం చాల్సి వస్తోంది. కానీ రుణమాఫీలు జరిగిపోయాయని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా, లజ్జ అనేది లేకుండా అబద్దాలు చెపుతున్నారు. రుణాలు కట్టొద్దని బాబు చెప్పిన మాటలు నమ్మినందుకు ఇవాళ అపరాధ వడ్డీ కింద రైతులు 14 నుంచి 18 శాతం కడుతున్నారు.

 ఉన్నవీ ఊడుతున్నాయి...
 చదువుకున్న పిల్లలకు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలు ఉంటాయో, ఊడిపోతాయో తెలియడంలేదు. ఆదర్శరైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గోపాలమిత్రలు... ఇలా ఉన్న ఉద్యోగా లు ఊడిపోయాయి. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.రెండు వేలు నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. రూ. 2వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే నేనెప్పుడు చెప్పానంటూ ఇప్పుడు దారుణంగా మోసగిస్తున్నారు.

 ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానంటాడేమో...
 చంద్రబాబు గతంలో ఇచ్చిన రైతులకు వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ, బ్యాంకుల్లో బంగారు వస్తువులన్నీ ఇంటికి చేరేలా చేస్తా, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబును ఇప్పుడు ప్రశ్నించకపోతే... రానున్న ఎన్నికల్లో ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి కారు కొనిస్తా... ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వ్యవస్థలో మార్పు రావాలంటే, రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది.

 రూ.600 కోట్లు నీ అత్తగారి సొత్తా?
 రాష్ట్రంలో, దేశంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటాయి. గతంలోనూ రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశంలు ఉన్నాయి... పట్టపగలు.. ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా  ఒక్కో ఎమ్మెల్యేకి రూ.30 కోట్లు చొప్పున 20 మందికి రూ.600 కోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు  ఇచ్చి కొనుగోలు చేశారంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదేమైనా నీ అత్తగారి సొత్తా అని అడిగేవారు లేరంటే ఈ వ్యవస్థను చూసి బాధేస్తుంది. పట్టపగలు అడ్డగోలుగా తెలంగాణలోనూ ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ, ఆడియో, వీడియో టేపులలో డబ్బుతో సహా అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అనడానికి సిగ్గుపడాలి.  ఒక ముఖ్యమంత్రి ఇంత నల్లధనంతో పట్టుబడినా జైలుకు పోని పరిస్థితి మన రాష్ర్టంలో, మన దేశంలోనే ఉందంటే ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలి.  ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదు. ప్రజలతో పనిలేదు. ప్రజలకిచ్చిన మాటలతో పనిలేదు. అవినీతి విచ్చలవిడిగా చేస్తా.. ఆ డబ్బుతో అవసరమైతే ఓటుకు 3, 4 వేలిచ్చి ప్రజలను కొనుగోలు చేస్తానని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెబుతున్నారు.

 చంద్రబాబుకు ప్రజలతో పనిలేదు...
 ప్రజాస్వామ్యంతో, ప్రజలతో చంద్రబాబుకు పనిలేదు. ఆయన రూ.1000, 2000, 3000, 4000 చొప్పున ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తానని అనుకుంటాడు. కానీ ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు ఎంత డబ్బులున్నా ఏమీ పనిచేయవు. 2004 ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. అప్పుడు సాక్షి పత్రిక కూడా లేదు.  ప్రజల గుండెల్లో, మనసులో నిలవకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఎన్నికల్లో గెలవరు. 2004 నాటికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విచ్చలవిడిగా అవినీతి చేశావు. కానీ అప్పుడు వైఎస్‌ఆర్ వచ్చారు. పాదయాత్ర చేశారు. నాడు 2004లో ఎన్నికలు అయ్యేనాటికి టీడీపీకి వచ్చినవి కేవలం 41 స్థానాలు మాత్రమే. చాలా చోట్ల ఆ పార్టీ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేస్తే.. ఆ అవినీతి సొమ్ము ఖర్చు చేస్తే నువ్వు గెలవవు అని సలహా ఇస్తున్నా....

 ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి?
 కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే ఆ దీక్షను భగ్నం చేయడం, ఆయన భార్యను, కొడుకును కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోవడం అందరం చూశాం. ఇదే చంద్రబాబును అడుగుతున్నా. ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి? నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరాహార దీక్ష చేస్తే ఆ వ్యక్తిని ఇలా శిక్షించడం సరైందేనా? తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దొంగ కేసులు పెట్టాల్సిందేననే నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు.  పోలీస్ టైజాన్ని చూస్తున్నాం. పోలీసువారూ ఒక్కటి గుర్తుంచుకోండి. ఇవాళ అధికారం చంద్రబాబుది కావచ్చు. కానీ అది ఎల్లకాలం ఉండదు. జీతాలు ఇచ్చేది చంద్రబాబు అత్తగారి సొత్తు కాదు. మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను గౌరవించండి. అధికారం ఎల్లకాలం ఒకరిది కాదు. మనం ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నాం. వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నా.

 మోదీకి అల్టిమేటమ్ ఇవ్వలేరు...కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేరు...
 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన ప్రత్యేకహోదా కోసం ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు గట్టిగా అడగలేరు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తన పార్టీకి చెందిన మంత్రులను కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటానని అల్టిమేటమ్ ఇవ్వలేరు. అందుకు కారణం తన రెండేళ్ల పాలనలో ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి, 1,45,549 కోట్లు’ పుస్తకమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన పుస్తకాన్ని చూపుతూ... ఈ పుస్తకం ప్రధాని మోదీకి అందించాం. చంద్రబాబు ఏదైనా  మాట్లాడితే కేంద్రం సీబీఐ ద్వారా విచారణకు ఆదేశిస్తే తన అవినీతి బండారమంతా బట్టబయలై కటకటాల పాలవుతామనే భయం చంద్రబాబుకు ఉంది. అందువల్లే చంద్రబాబు ప్రధాని వద్ద ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలిగేలా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నా కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పలేకపోతున్నారు. ఇందుకు ఓటుకు కోట్లు కేసు కారణం. ఒకవేళ మాట్లాడితే ఆ కేసు ద్వారా కటకటాల్లోకి పంపుతారనే భయం ఉంది.

 వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంజాద్ బాషా, పి.రాజన్నదొర, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ప్రసంగించారు. గడప గడపకు వైఎస్సార్‌సీపీ అంశంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాదరావు, ప్రత్యేక హోదాపై ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, రాజధాని భూ కుంభకోణంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ ఫిరాయింపులపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాజ్యంగ వ్యతిరేక చర్యలపై ఉప్పులేటి కల్పన, అవినితిపై అంబటి రాంబాబు, నదీ జలాలపై పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొలుసు పార్థసారథి, వ్యవసాయ రంగంపై విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.

 13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయి.. కానీ గెలుపు హీరోదే

 ఇంత దారుణంగా మోసం చేసే వ్యక్తి, అబద్దాలు చెప్పే వ్యక్తి సినిమాల్లో కనిపిస్తే ఆ వ్యక్తిని విలన్ అంటాం. విలన్ క్యారెక్టర్ వేసే రాజనాల వంటివారిని చూస్తే చంద్రబాబే గుర్తుకొస్తారు. సినిమాల్లో సాధారణంగా 14 రీళ్లు ఉంటాయి. 13 రీళ్ల వరకు విలన్‌దే పైచేయిగా ఉంటుంది. ఆయన ఎన్ని మోసాలు చేసినా, అబద్దాలు ఆడినా ఎంత అన్యాయం చేసినా ఆయనదే పైచేయిగా కనిపిస్తుంది. కానీ 14వ రీల్‌కు వచ్చే సరికి కథ క్లైమాక్స్‌లో హీరో తిరగబడతారు. ప్రజలు తోడుగా నిలుస్తారు. దేవుడు ఆశీర్వదిస్తాడు. హీరో విలన్‌ను వీరబాదుడు బాదుతాడు. చివరకు విలన్ శిక్ష అనుభవిస్తాడు. ఇది ఏ సినిమాలో చూసినా కనిపిస్తుంది. జీవితం అనే సినిమాలో కూడా చివరకు ఇదే జరుగుతుంది. చంద్రబాబు మాదిరిగా సీఎం కావడానికి, సీఎం రేసులో ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, సీఎం కుర్చీలో కూర్చోడానికి ఏ గడ్డయినా తింటానంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఈ వ్యవస్థ బాగుపడుతుందా అని అడుగుతున్నా...

 మాట తప్పితే ఎవరికైనా చెప్పులు.. చీపుర్లే.. గతి
 రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటుంది. నాయకులు మోసగిస్తే ప్రజలు చెప్పులు, చీపుర్లు చూపిస్తామనే స్థాయికి రావాలి. ఇది రాజకీయ నాయకులందరికీ వర్తించాలి. అబద్ధాలు ఆడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించండి.  ఈ చాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది. ఫలానావాడు మా నాయకుడని కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా మార్పు రావాలి. మనమంతా కలసికట్టుగా అడుగులు వేస్తేనే అది సాధ్యమవుతుంది.
Share this article :

0 comments: