5 సంతకాలు అంతులేని మోసాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 5 సంతకాలు అంతులేని మోసాలు

5 సంతకాలు అంతులేని మోసాలు

Written By news on Wednesday, June 8, 2016 | 6/08/2016


5 సంతకాలు అంతులేని మోసాలు
ఎన్నికల ముందు ఎడాపెడా హామీలిచ్చేసిన చంద్రబాబు... అధికారం చేపట్టాక తన అనుభవాన్ని అంతా రంగరించి ఆ వాగ్దానాలను తుంగలో తొక్కేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే వేదికపై నుంచి అయిదు ఫైళ్లపై సంతకాలు అయితే చేసేశారు. తొలి సంతకం రైతు, డ్వాక్రా రుణ మాఫీ ఫైలుపై పెట్టారు. రుణమాఫీని మసిపూసి మారేడుకాయ చేశారు. రెండో సంతకం పింఛన్ల పెంపుపై పెట్టారు. అయితే పింఛన్లలో భారీ కోతలు పెట్టారు. మూడో సంతకం ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకంపై పెట్టారు. ఆ తర్వాత ఆ పథకం ఒకటుందనే విషయం మర్చిపోయారు. ఇంటింటికి మినరల్‌ వాటర్‌ పంపిణీ చేస్తామనే హామీని గట్టున పెట్టేశారు.

ఇక నాలుగో సంతకం బెల్ట్‌ షాపులను రద్దు చేస్తానంటూ పెట్టిన తర్వాత వాటర్‌ ప్లాంట్లల మాదిరి బెల్ట్‌ షాపులు తెరిపించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఐదో సంతకం పెట్టి, దానిపై ఎన్నో ఆంక్షలు విధించారు. ఇలా యేరు దాటేదాక యేటి మల్లన్న.. యేరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లయినా తొలి అయిదు సంతకాలకూ దిక్కేలేకుండా పోయింది. ఇక మిగతా వాగ్దానాలు సరేసరి...   

సంతకం...1
తీరని రుణం కష్టాలు
  • చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రైతుల రుణభారం రూ. 87,612 కోట్లు
  • ఈ మొత్తానికి 14 శాతంతో చెల్లించాల్సిన వడ్డీ రూ. 24,531 కోట్లు
  • మొత్తం రైతుల రుణాలు రూ. 1,12,143 కోట్లు
  • ఇప్పటివరకు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ. 7,400 కోట్లు
అధికారం ఇస్తే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు రైతన్నలను నట్టేట ముంచేశారు. సంపూర్ణ రుణమాఫీ కాదు కదా.. రెండేళ్లయినా వడ్డీలకు సరిపడా కూడా నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు రుణగ్రస్తులుగానే మిగిలి ఉన్నారు. గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉండగా.. బ్యాంకుల నుంచి రుణాలు రాక ప్రైవేట్‌ వ్యాపారుల బారిన పడిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. రుణ మాఫీపై చంద్రబాబు మాట మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పలేదంటూ ముఖ్యమంత్రి కాగానే మాట మార్చేశారు.

కోటయ్య కమిటీ పేరుతో ఏడాది పాటు రుణమాఫీని నాన్చేశారు. ఆఖరికి సవాలక్ష ఆంక్షలతో కోటయ్య కమిటీ నివేదిక ఇవ్వడంతో దాని ప్రకారం వ్యవసాయ రుణాల ఖాతాలను వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు. కుటుంబానికి లక్షన్నర రూపాయల వరకు మాత్రమే రుణాలు మాఫీ చేస్తానంటూ ఆంక్షలు విధించారు. బంగారం రుణాలను మాఫీ పరిధి నుంచి తప్పించేశారు. ఉద్యాన పంటల  రైతుల రుణ మాఫీకి కోతలు విధించారు. ఇన్నీ చేసి రుణాలు మాఫీ చేసేసాం అని ఇప్పుడు టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వడ్డీకి కూడా చాలని మాఫీ..
రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు సంతకం పెట్టేనాటికి కోటి మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 87,612 కోట్ల అప్పు ఉంది. మాఫీ చేయకపోవడంతో ఇప్పుడు అదే రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో అప్పు రూ. 91,415 కోట్లకు పెరిగింది. చంద్రబాబు సర్కారు రూ. 7400 కోట్లు చెల్లించింది. అంటే రూ. 87,612 కోట్ల అప్పులకు 14 శాతం వడ్డీకైనా రెండేళ్లకు సరిపోవాలంటే రూ. 24,531.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే వడ్డీలో పావు వంతుకు కూడా సరిపోకుండా రైతుల రుణ మాఫీని చంద్రబాబు తీసుకువచ్చారు. ఏడాదికి కొంత చొప్పున ఐదు విడతల్లో అరకొర రుణ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు దాన్ని కూడా అమలు చేయడం లేదు. కోటిపైగా ఖాతాల్లో సగానికిపైగా ఖాతాలను ఆంక్షలు పేరుతో రుణ మాఫీ పరిధి నుంచి తొలగించారు. అలాగే ఆంక్షలతో రూ. 87,612 కోట్ల  రుణ మాఫీని ఐదు విడతల్లో కలిపి కేవలం రూ. 19 వేల కోట్లకు కుదించారు.
అదీ కూడా ఇప్పటివరకు మాఫీ చేసింది కేవలం రూ. 7,400 కోట్లే. చంద్రబాబు రుణ మాఫీ చేయకపోవడంతో వడ్డీ లేని రుణాలు దేవుడెరుగు ఇప్పుడు 14 శాతం వడ్డీ రైతులపై పడుతోంది. వడ్డీలపైన వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పుట్టక, ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో రెండో వాయిదా రుణ మాఫీకంటూ రూ. 4,300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ పైసా కూడా విడుదల చేయలేదు.  రెండో వాయిదాలో రూ. 3,000 కోట్లకు పైగా రుణ మాఫీకి నిధులు విడుదల చేయాల్సి ఉండగా గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 1,000 కోట్లకు జీవో జారీ చేసింది. అయితే నిధులను మాత్రం రైతు  సాధికార సంస్థ నుంచి రైతుల ఖాతాల్లోకి చేరలేదు.


ఆత్మస్థైర్యం కోల్పోతున్న రైతులు..
బంగారంతో సహా అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఊరారా తిరిగి చెప్పారు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోండి.. బాబు గారు వచ్చి విడిపిస్తారంటూ ఊరూరా గోడలపైన రాతలే కాక ఇంటింటికి వెళ్లి తెలుగు తముళ్లు ప్రచారం చేశారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బంగారం రుణాలను మాఫీ పరిధి నుంచి కూడా తొలగించారు. దీంతో రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా రైతులకు చెందిన రూ.15 వేల కోట్లకు పైగా బంగారంపై రుణాలను అరకొర మాఫీ పరిధి నుంచి తొలగించారు. దీంతో బ్యాంకర్లు బంగారాన్ని వేలం పాటలు వేస్తున్నారు. దీంతో రైతులు ఆత్మసై్థర్యాన్ని కోల్పోతున్నారు.


సంతకం...2
పింఛన్లలో భారీ కోత
వృద్ధులు, వితంతువులకు నెలవారీ పింఛను రూ.200 నుంచి రూ. వెయ్యికి పెంచుతామని రెండో సంతకం చేసిన చంద్రబాబు దానిని రాజకీయ లబ్ధి పథకంగా మార్చారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారినే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల లబ్ధిదారులుగా ఎంపిక చేసే విధానం అమల్లోకి తేవడంవల్ల రాజకీయ పక్షపాతం రాజ్యమేలుతోంది. విపక్షాలకు అనుకూల కుటుంబాలవారిని పింఛన్లకు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు. జన్మభూమి కమిటీల సిఫార్సులు ప్రామాణికంగా పింఛన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయడమనేది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
 
గత ప్రభుత్వంలో 44 లక్షల పింఛనుదారులు ఉండగా టీడీపీ అధికారంలోకి రాగానే ఈ సంఖ్యను 37 లక్షలకు కుదించింది. ప్రతిపక్షానికి చెందిన బతికున్న వారిని చనిపోయినట్లు రికార్డుల్లో పేర్కొని పింఛను జాబితా నుంచి తొలగించడం అధికార పక్ష అక్రమాలకు పరాకాష్ట. దీనిపై కొందరు కోర్టుకు వెళా్లరు. ‘భౌతికంగా ఉన్న వారిని చనిపోయినట్లు పేర్కొని అర్హుల జాబితా నుంచి తొలగించడం దారుణం... వెంటనే వారిని పింఛన్ల జాబితాలో చేర్చండి...’ అని కొందరి విషయంలో హైకోర్టు తీర్పులు కూడా ఇవ్వడం గమనార్హం. కోర్టు చేసిన వ్యాఖ్యలకు సర్కారుకు తలదించుకోవాల్సిన పరిస్థితి.


అప్పుల్లోనే డ్వాక్రా మహిళలు..
  • సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టేనాటికి డ్వాక్రా సంఘాల అప్పు రూ. 14, 204 కోట్లు
  • ఏడాదికి సాధారణ వడ్డీ రూ. 1,680 కోట్లు
  • ఆపరాధ రుసుముతో ఏడాదికి వడ్డీ దాదాపు రూ. 2,500 కోట్లు
  • రెండేళ్లలో అయిన వడ్డీ దాదాపు రూ.5,000 కోట్లు
  • పెట్టుబడి నిధి పేరిట ఇప్పటికి చెల్లించింది రూ. 2,423 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నీటిమూటలయ్యాయి. లక్షలాది డ్వాక్రా మహిళలు చంద్రబాబు మాటలు నమ్మి నిలువునా మోసపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి మరో నాలుగు రోజుల్లో రెండేళ్లు పూర్తి అవుతున్నప్పటికీ మహిళా సంఘాల అప్పులు తీరలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి భిన్నంగా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట మార్చడంతో మహిళా సంఘాలు అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాలలో డ్వాక్రా సంఘాలు దాదాపు రూ. 14,204 కోట్లమేర బ్యాంకులకు అప్పు చెల్లించాల్సి ఉంది. వీటిపై నెలకు రూ. 140 కోట్ల మేర డ్వాక్రా సంఘాలపై వడ్డీ భారం పడుతుంది. ఏడాదికి సాధారణ వడ్డీ భారమే రూ. 1,680 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించని పరిస్థితుల్లో వడ్డీపై అపరాధ వడ్డీలు కలిపి మొత్తం ఏడాదికి రూ. 2,500 కోట్లకు పైనే మహిళలకు వడ్డీ భారం పడుతుంది.

ఇదే రెండేళ్లలో అపరాధ వడ్డీలు కలిపి మొత్తం రూ. 5000 కోట్ల వడ్డీ భారం మహిళలపై పడింది. కాగా, రుణమాఫీ చేస్తానంటూ ఏడాదిపాటు ఊరించిన చంద్రబాబు గతేడాది అక్టోబరులో డ్వాక్రా రుణమాఫీకి బదులు సంఘాల్లోని మహిళలు అవసరమైతే కొత్త అప్పలు తీసుకోవడానికి వీలుగా ‘పెట్టుబడి నిధి’ ఆయా సంఘాల ఖాతాకు జమ చేయబోతున్నట్టు ప్రకటించారు. పొదుపు ఖాతాల్లో మూడు వేల చొప్పన డబ్బులు జమ చేశారు. 2014 మార్చి చివర నాటికి డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పులో రూపాయి కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదు. రెండేళ్ల కాలానికి అప్పులపై వడ్డీ భారం రూ. 5000 కోట్ల వరకు పెరిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టుబడి నిధి రూపేణా ఇప్పటి వరకు రూ. 2,423 కోట్లు మాత్రమే సంఘ ఖాతాల్లో జమ చేసింది. ఈ డబ్బును మహిళలు అవసరాలకు వాడుకోవాలన్నా సంఘాల నుంచి తిరిగి అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండో విడత పెట్టుబడి నిధి కింద రూ. 2,000 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు.



సంతకం...3
జాడలేనిఎన్టీఆర్‌ సుజల స్రవంతి...
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు అందిస్తామనే ఫైలుపై మూడో సంతకం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆవిషయం పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్రంలో 45 వేల  నివాస ప్రాంతాలు ఉండగా అత్యధిక గ్రామాల్లో రక్షిత మంచినీటి సదుపాయం లేదు. వారంతా బావులు, బోర్లు, చెరువులు, చెలమల్లోని కలుషిత నీరు తాగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులైతే చెలమల నీరు తాగి డయేరియా, కామెర్లు, టైఫాయిడ్‌ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు.  కఠిన జలాలు తాగడంవల్ల ఉత్తరాంధ్రలో ఎక్కువమంది మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారని శాస్త్రీయ నివేదికలు తేటతెల్లంచేస్తున్నాయి. వీటి నియంత్రణ కోసం అన్ని గ్రామాలకు ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని చంద్రబాబు  ఎన్నికల మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్నారు.
 
ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద అన్ని గ్రామాల్లో ప్రజలకు చౌకగా మినరల్‌ వాటర్‌ అందిస్తే కలుషిత నీటి సమస్య ఉండదని అందరూ భావించారు.  రాష్ట్రంలో 45 వేల ఆవాస ప్రాంతాలు ఉండగా ఏడెనిమిది వందల చోట్ల మాత్రమే ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద ఆర్వో ప్లాంట్లు పెట్టారు. ఆ తర్వాత ఆ హామీని పూర్తిగా మరిచిపోయారు. తద్వారా తన ఎన్నికల హామీని విస్మరించి ప్రజలకు మంచినీళ్లు లేకుండా చేశారు.


సంతకం...4
ఊరూరా బెల్ట్‌ షాపులు...
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మద్యం బెల్ట్‌ షాపుల రద్దు ఫైలుపై చంద్రబాబు నాలుగో సంతకం చేశారు.  రెండేళ్లయినా  బెల్ట్‌ షాపులు పెరిగాయేగానీ రద్దు కాలేదు. ఊరూరా, వాడవాడలా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేయించి  ప్రజలతో పూటుగా తాగించి మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా ఆదాయం దండుకోవాలని బాబు సర్కారు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4380 అధికారిక మద్యం షాపులు ఉండగా ఒక్కో దాని పరిధిలో పది నుంచి 15 వరకూ బెల్ట్‌ షాపులు ఉన్నాయి. జాతీయ రహదారులపై కూడా బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి.
గ్రామాల్లో సైతం బెల్ట్‌ షాపులు బార్ల తరహాలో ఉన్నాయి.  కొన్ని ప్రాంతాల్లో బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేసేందుకు వ్యాపారులు ప్రైవేటు గోదాములు నిర్వహిస్తున్నారు. ఇటీవల కృష్ణా జిల్లా తిరువూరులోని ఒక గిడ్డంగిపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేయగా రూ. పది లక్షల విలువైన డ్యూటీపెయిడ్‌ మద్యం దొరికింది. చాలాచోట్ల బెల్ట్‌షాపుల్లోనే  జనం పూటుగా తాగుతున్నారు.  బెల్ట్‌ షాపులవల్ల మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

సంతకం...5
పదవీ విరమణ వయసు పెంపు..
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామని చిట్టచివరిదైన అయిదో ఫైలుపై నాడు బాబు సంతకం చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తూ జీవో జారీ చేశారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు విషయంపై ఇప్పటి వరకూ జీవో జారీ చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తాము ప్రభుత్వ ఉద్యోగులు కాదా?  అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఆ ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ‘ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారు.

సాంకేతికంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అనే పేరు ఉన్నంత మాత్రాన వారికి పదవీ విరమణ వయసు పెంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన జీవో వారికి కూడా వర్తిస్తుంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయండి’ అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి నెలలు గడుస్తున్నా సర్కారు జీవో జారీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థల్లో పనిచేసేవారిలో కొందరు పదవీ విరమణ చేశారు. ఇక ప్రభుత్వం ఈ సంస్థల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారి పరిస్థితి ఏమిటనేది గందరగోళంగా మారింది.

జాడలేని డీఎడిక్షన్‌ సెంటర్లు...
మద్యం అలవాటును మాన్పించేందుకు వైద్య శాఖ అధికారులతో సంయుక్తంగా డీఎడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి మద్యంవల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించింది. డీఎడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. చంద్రబాబు సర్కారు మాత్రం మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్‌ శాఖకు టార్గెట్లు విధిస్తూ ప్రజలతో పూటుగా తాగించాలని ప్రయత్నాలు సాగిస్తోంది. అధికార పక్షం వారు కల్తీ మద్యం విక్రయిస్తున్నా కేసుల్లో వారి పేర్లు రాకుండా తప్పించిందనే విమర్శలు ఉన్నాయి.
Share this article :

0 comments: