జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్

జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్

Written By news on Wednesday, June 8, 2016 | 6/08/2016


జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలందరి దృష్టికి...
-  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
-  రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళ్లాలని పార్టీశ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
13న విజయవాడలో పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం
-  చంద్రబాబు మోసాలపై నేడు పోలీస్ స్టేషన్లలో కేసులు: పార్థసారథి

 సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిరోజైన జూలై 8 నుంచి ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు, అవి అమలు జరగని తీరును ఈ సందర్భంగా పార్టీశ్రేణులు ప్రజలకు వివరించనున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో మంగళవారం అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు సమావేశమై ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు.

సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రతి ఇంటికీ పార్టీ శ్రేణులు వెళ్లాలని, రెండేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు.. అవి అమలు జరగని తీరును ప్రజలకు తెలపాలన్నారు. అదే సమయంలో వైఎస్ హయాంలో సంక్షేమ పథకాలు అమలైన తీరును వివరిస్తూ... నిరుపేద ప్రజలంతా విద్య, వైద్యం వంటి అవసరాలకు సంబంధించి అప్పట్లో ఎంత నిశ్చింతగా ఉండేవారో గుర్తు చేయాలని కోరారు. జూలై 8న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఆయా శాసనసభా నియోజకవర్గంలోని ఇళ్లన్నింటినీ పూర్తిగా సందర్శించేవరకూ కొనసాగాలని ఆయన సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతున్నది. గడప గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్లినపుడు ప్రజల సమస్యలు, స్థానికంగా ఉండే సమస్యలు కూడా తెలుసుకునేలా చేయాలని జగన్ నిర్దేశించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని బాధ్యతగల సీనియర్ నేతలు పర్యవేక్షించాలని, జిల్లా నేతలు, స్థానిక నేతలందర్నీ కలుపుకుని సమన్వయంతో ముందుకుపోవాలని సూచించారు.

 13న విజయవాడలో సమావేశం
 పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 13న విజయవాడలో జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యనేతల సమావేశానంతరం నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడిస్తూ... విజయవాడ భేటీలో భవిష్యత్తులో పార్టీ చేయబోయే కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు రాష్ట్రప్రజలకు చేసిన మోసాలు, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తామని వివరించారు.  పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

 బాబు మోసాలపై నేడు కేసులు..
 బేషరతుగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగమివ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చనందుకుగాను సీఎం చంద్రబాబుపైన, టీడీపీ ప్రభుత్వం పైనా ఈ నెల 8న  అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడతామని పార్థసారథి వివరించారు. ప్రజల్ని మోసం చేసినందుకుగాను ఏఏ సెక్షన్లు వర్తిస్తాయో వాటికిందనే కేసులు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: