ఉండవల్లిపై ఉక్కుపాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉండవల్లిపై ఉక్కుపాదం

ఉండవల్లిపై ఉక్కుపాదం

Written By news on Wednesday, June 22, 2016 | 6/22/2016


ఉండవల్లిపై  ఉక్కుపాదం
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల తొలగింపు
అటవీ శాఖ తొలి దశ సర్వేలో 2,500 కుటుంబాల తరలింపునకు ప్రతిపాదనలు
పొమ్మనకుండా    పొగ పెడుతున్న వైనం
సర్కారు కుయుక్తులతో జనం గగ్గోలు

 
విజయవాడ బ్యూరో : భూసమీకరణను వ్యతిరేకించిన తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని అభివృద్ధి సాకుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆ గ్రామం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తొలినాళ్లలో టూరిజం హబ్‌గా ఉండవల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. భూ సమీకరణను ఆ గ్రామం ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ తరువాత ఆ గ్రామానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణాకు మౌలిక వసతులు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ఉండవల్లిని ఎంపిక చేసింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనేది స్థానికుల వాదన. టూరిజం ప్రాంతం అయితే అక్కడ భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, రవాణా, విద్యుత్ సబ్‌స్టేషన్‌లకు ఎంపిక చేస్తే ఆ ప్రాంతానికి పెద్దగా క్రేజ్ ఉండదు. దీంతో అక్కడ  భూముల ధరలు పడిపోవడంతో పాటు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడి వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని ప్రకటనకు ముందే  కోట్లు పలికిన భూములు...
రాజధాని ప్రకటన రాకముందు నుంచే ఉండవల్లి ప్రాంతంలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలికాయి. ఇప్పుడు మాత్రం రాజధాని నిర్మాణం చేపట్టకముందే ఉండవల్లిలోని నివాసాలపై ప్రభావం పడుతోంది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా గతేడాది రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఉండవల్లిలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించింది. విజయవాడ - ఉండవల్లి - తుళ్లూరు - అమరావతి రోడ్ల విస్తరణకు ఇప్పటికే చాలా మంది నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉండవల్లి వద్ద రోడ్డును మరింత విస్తరించడంతో ఇళ్లు, దుకాణాలు, చిన్నపాటి బడ్డీకొట్లను తొలగించారు. రాజధాని నిర్మాణం, అటవీ భూముల అవసరం సాకుతో 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలను తరిమేసే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలను పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఇబ్బందులు పెడితే భూములైనా ఇస్తారు, ఊరైనా వదిలిపోతారు అన్నట్టు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయినా రోడ్ల విస్తరణ తదితర కారణాలతో ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాజధాని పేరుతో పొలాలు గుంజుకున్న సర్కారు ఇప్పుడు ఇళ్లనూ కూల్చేసి ప్రజలను రోడ్డున పడేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
 
 
అటవీ భూముల బూచి...
అమరావతి రాజధాని కోసం సుమారు 50 వేల ఎకరాల అటవీ భూములను డీఫారెస్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడంతో దాని ప్రభావం కూడా ఉండవల్లిపై పడనుంది. ఉండవల్లి సమీప ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పాచిక పారకపోవడంతో ఇక్కడ అటవీ భూములను తీసుకోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఉండవల్లితో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, ప్రకాష్‌నగర్, డోలాస్‌నగర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు అటవీ భూముల పరిధిలోకి వస్తాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 30 వేల ఇళ్లలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అటవీ ప్రాంతం నుంచి కదిలించాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక పర్యాయం సర్వే నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఉండవల్లి, ప్రకాష్ నగర్, డోలాస్‌నగర్, నులకపేట ప్రాంతాల్లోని అటవీ భూముల్లో 2,500 ఇళ్లు ఉన్నాయని నిర్ధారించారు. వాటితో పాటు మరో ఎనిమిది వేల ఇళ్లను కూడా వేర్వేరు కారణాలు చూపి ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా నదికి ఆనుకుని విజయవాడ-చెన్నై జాతీయ రహదారి చెంతనే ఉన్న ఉండవల్లి గ్రామం రైల్వేస్టేషన్‌కు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేలా పథక రచన చేస్తోంది.
Share this article :

0 comments: