15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి

15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి

Written By news on Sunday, July 24, 2016 | 7/24/2016


ఎఫ్‌ఆర్‌బీఎంను 5 శాతానికి నిర్ధారించాలి
ఐదేళ్లు దాటినా రెవెన్యూ లోటే ఉంటుంది
ప్రైవేటు బిల్లులో ప్రతిపాదించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించారు. శుక్రవారం నాటి లోక్ సభ ప్రైవేటు మెంబరు బిజినెస్ ఎజెండాలో ఈ బిల్లుకు చోటు దక్కింది. వచ్చే శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగానికి అదనంగా పది-ఏ భాగంలో ఈ అంశాన్ని చేర్చాలని ప్రైవేటు బిల్లులో ప్రతిపాదించారు. ఈ భాగం కింద సెక్షన్ 94ఏ, 94 బీ, 94 సీ సెక్షన్లను అదనంగా చేర్చాలని కోరారు. ప్రైవేటు బిల్లు లక్ష్యాలు, కారణాలు అన్న శీర్షికతో బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నారన్న అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగిన సందర్భంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో పలు హామీలు ఇచ్చారు.

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రస్తుత మంత్రి వెంకయ్యనాయుడు ఆనాడు బిల్లు వచ్చిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నారు.  హోదాను ఐదేళ్లపాటు వర్తింపజేయాలని కోరారు.  అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఏళ్లపాటు వర్తింపజేస్తామని చెప్పారు. రెండేళ్లు గడిచినా ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఇప్పటికే పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను అమలుచేస్తోంది.ఆ రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వచ్చే ఐదేళ్ల తరువాత కూడా రెవెన్యూ లోటును ఎదుర్కొంటుందని 14వ ఆర్థిక సంఘం తెలిపింది. అందువల్ల ఇతర రాష్ట్రాలతో సమాన బలం చేకూరాలంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయడం తప్పనిసరి..’ అని వైవీ సుబ్బారెడ్డి బిల్లులో పేర్కొన్నారు.
 
 ఏ సెక్షన్ కింద ఏం కోరారంటే...
 సెక్షన్-94 ఏ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు మార్చి 2, 2014 నుంచి 15 ఏళ్ల పాటు ప్రత్యేక కేటగిరీ హోదా వర్తిస్తుంది. ఒకవేళ అవసరమైన పక్షంలో 15 ఏళ్ల తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించేందుకు తగిన ఉత్తర్వుల ద్వారా చర్యలు తీసుకుంటుంది. సెక్షన్-94 బీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కింద సాధారణ కేంద్ర సాయం, అదనపు కేంద్ర సాయం, ప్రత్యేక కేంద్ర సాయం అందించాలి. గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఈ సాయం ఉండాలి. స్పెషల్ స్టేటస్ ద్వారా పన్ను ఆదాయం, ఇతర నిధుల పంపిణీ ఇలా ఉండాలి. 1) మార్చి 2, 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే పరిశ్రమలకు ఆర్థిక శాఖ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలి. 2) ఇన్‌కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లలో రాయితీలు ఇవ్వా లి. 3) మార్చి 2, 2014 తరువాత పరిశ్రమలు తమ కార్యకలాపాలను, యూనిట్లను విస్తరించాలనుకుంటే వర్కింగ్ కేపిటల్‌లో 40 శాతం సబ్సిడీ ఇవ్వాలి..’ అని పొందుపరిచారు.  సెక్షన్-94 సీ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని జీడీపీలో ఐదు శాతానికి నిర్ధారించాలి.
Share this article :

0 comments: