న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం

న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం

Written By news on Wednesday, July 13, 2016 | 7/13/2016


'న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం'
ఏలూరు : చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ పక్క డబ్బులు లేవంటూనే సీఎం మరోవైపు విమానాల్లో విదేశాలకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాల్లో విదేశాలకు వెళ్లడం కాదని, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విస్మరించారన్నారు.

రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావటం లేదని, మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. రుణాలపై బ్యాంకులు రూపాయిన్నర నుంచి రెండు రూపాయిలు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాయని, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకూ పొగాకు కొనుగోళ్లు చేపట్టలేదని వైఎస్ జగన్ అన్నారు. జులై వచ్చినా సగం పొగాకు కూడా కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు. జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. ఒక్క పొగాకు రైతులే కాదని, వరి నుంచి పామాయిల్ రైతుల వరకూ అందరి పరిస్థితి ఇదేనన్నారు. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. గిట్టుబాటు ధర రాక రైతులందరూ అవస్థలు పడుతున్నారన్నారు.

ఎన్నికలు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్నారో చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడితే తాను రూ.5వేల కోట్లతో పెడతానని చంద్రబాబు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆ విషయాన్ని మరచిపోయారని ధ్వజమెత్తారు.  రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కొత్త రుణాలు రాక, పాత రుణాలు రెన్యువల్ కాక రైతులు కష్టాల్లో కూరుకుపోయారన్నారు. పొగాకుకు రూ.20 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.70 లక్షలు ముష్టి వేశారని వైఎస్ జగన్ అన్నారు. పొగాకు ఉత్పత్తిని 65 మిలియన్ క్వింటాళ్ల నుంచి 35 మిలియన్ క్వింటాళ్లకు తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు. పొగాకు కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. స్థిరీకరణ నిధిని తీసుకొచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. అప్పుడైనా పొగాకు బోర్డు స్పందించి, రైతులకు న్యాయం చేస్తుందని వైఎస్ జగన్ అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పొగాకకు కనీసం రూ.165 మద్దతు ధర లభిస్తే...చంద్రబాబు గత ఏడాది 114 రూపాయలే ఇచ్చారన్నారు. అలాగే పామాయిల్ విషయానికి వస్తే వైఎస్ఆర్ హయాంలో రూ.10 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కి పడిపోయిందన్నారు. ఉత్పత్తి ధర పెరుగుతు ఉంటే, మద్దతు ధర మాత్రం తగ్గుతోందన్నారు. నాయకులు మాట మీద నిలబడాలని, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలన్నారు. లేకుంటే చంద్రబాబు ప్రతి ఒక్కరికీ విమానం లేదా కారు కొనిస్తానంటారని ఎద్దేవా చేశారు.
మాట నిలబెట్టుకోకపోతే నిలదీసే పరిస్థితి రావాలని, అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులకు పరిహారం విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ కింద ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తే, చింతలపూడి కింద రూ.12 లోలే ఇస్తున్నారన్నారు. రైతులు కొట్టుకోవాలి, ఉద్యమాలు రావాలి...ప్రాజెక్టులు కట్టకుండా కాలయాపన చేయాలనేది చంద్రబాబు ఉద్దేశమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ చంద్రబాబు వదిలిపెట్టమని, రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Share this article :

0 comments: