ఈ దొంగ కేసులన్నింటిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ దొంగ కేసులన్నింటిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం

ఈ దొంగ కేసులన్నింటిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం

Written By news on Tuesday, July 19, 2016 | 7/19/2016


పాల్మన్‌పేటలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
- ఈ మోసకారి సీఎంను ఏం చేయాలో మీరే నిర్ణయించండి..
- రౌడీ రాజ్యం నడుపుతున్నారు.. తప్పు చేసిన మంత్రిని బర్తరఫ్ చేయకుండా రక్షిస్తారా
- ఈ అరాచక పాలన బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది
- పాల్మన్‌పేట ఘటనలపై విచారణ జరిపిస్తాం..
- నిందితులందరినీ జైలుకు పంపిస్తాం..
- బాధితులకు అండగా ఉంటాం.. న్యాయం కోసం పోరాడతాం.
 
 సాక్షి, విశాఖపట్నం : ‘రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. రౌడీ రాజ్యం నడుస్తోంది. మాఫియాను సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ నాకింత నీకింత అని గ్రామాలు పంచుకుంటున్నారు. తప్పు చేసిన మంత్రిని బర్తరఫ్ చేయడం మానేసి, అతన్ని కాపాడుకోవడానికి అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మోసం చేశారు. బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టారు. ఎల్లకాలం చంద్రబాబు పాలనే సాగదు. మా ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు అరాచక పాలనను బంగాళాఖాతంలో కలిపేసే రోజొస్తుంది. మా ప్రభుత్వం రాగానే పాల్మన్‌పేట కేసులపై విచారణ జరిపి దాడికి సహకరించిన వారితో సహా అందరినీ జైలుకు పంపిస్తాం’.. అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట గ్రామంలో టీడీపీ గూండాల దాడికి గురైన గ్రామస్తులను సోమవారం ఆయన పరామర్శించారు. ఇంటింటికీ వెళ్లి జరిగిన దారుణాన్ని కళ్లారా చూశారు. బాధితులతో మాట్లాడారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడి ఎలిమెంటరీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆసాంతం కదలకుండా నిలబడి ఆయన ప్రసంగాన్ని విన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

 అరాచకాన్ని అడిగే నాథుడు లేడు
 ‘‘అకారణంగా తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసేందుకు గత నెల 24న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారన్న ఒకే ఒక్క కారణంతో ‘మాపైనే కేసుల పెడతారా, మమ్మల్ని పంపిన వ్యక్తి యనమల కృష్ణుడు అని మీకు తెలియదా’ అని 26న రెండోసారి దాడులు చేశారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే అదే పరిస్థితి, ఎస్సై సత్యనారాయణ కేసులు నమోదు చెయ్యడు, ఎవరినీ అరెస్ట్ చేయడు. 28న మత్స్యకార గ్రామస్తులంతా కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయాలనుకుంటే, మీరు ధర్నా చేసేంత గొప్ప వ్యక్తులా అంటూ కృష్ణుడు గూండాలను పంపించాడు. 400 మంది మనుషులను పంపించి ఆడా మగా తేడా లేకుండా దాడులు చేసి తలలు పగులగొట్టినా, చిన్న పిల్లల్ని కూడా గాయ పరిచినా.. ఇళ్లలో దూరి బీరువాలు పగులగొట్టి, బంగారం, డబ్బులు లూటీ చేసినా.. ఆస్తులు ధ్వంసం చేసినా అడిగే నాథుడు లేడు. ఇవన్నీ ఎస్సై సత్యనారాయణ సమక్షంలో జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. 24వ తేదీన, 26వ తేదీన, 28వ తేదీన మూడుసార్లు దాడులకు పాల్పడటం దారుణం. 28నజరిగినది ఎంత దారుణమైన ఘటన అంటే.. మొత్తం రాష్ట్రం అంతా, చంద్రబాబు పరిపాలనకు సిగ్గుతో తలవంచుకోవాలి.

 బాబు మొసలి కన్నీరు
 వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామానికి వచ్చారని, మత్స్యకారులంతా ఏకమవుతున్నారని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు. దాడుల్లో నష్టపోయిన వారందరికీ రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ఎంతటి మోసగాడంటే.. మీలో ఎంత మందికి రూ.50 వేలు అందలేదో రెండు చేతులెత్తి చెప్పండి.. (జగన్ అడగ్గానే అందరూ చేతులెత్తి అందలేదని చెప్పారు.) చంద్రబాబుకు మోసాలు కొత్తకాదు. కుర్చీ కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. మొన్న ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి రైతన్నలు, ఆడవాళ్లు, చిన్న పిల్లలు.. అందరికీ అబద్ధాలు చెప్పి మోసం చేశారు.

పాల్మన్‌పేట వాసులను మోసం చేస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గ్రామంలో ముగ్గురికి మాత్రమే లక్షన్నర, మరో ముగ్గురికి లక్ష, మిగిలిన వారందరికీ ఐదు పదివేలు అందాయట. నిజంగా మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రి ఈ ఊరి మీద పడమని చెప్పి పురమాయిస్తే .. నాలుగొందల మంది ఊరిమీదకు వచ్చి దౌర్జన్యం చేస్తూ బీరువాలు పగుల గొట్టి నగలు, డబ్బులు దోచుకుపోతే ఆ మంత్రిని బర్తరఫ్ చేయకుండా, ఆ మంత్రి చేసిన తప్పును సమర్ధిస్తూ తప్పుడు వాగ్దానాలు చేయడం మీకు ఎంత వరకూ సమంజసం అని చంద్రబాబును అడుగుతున్నా. చంద్రబాబు పరిపాలన చూస్తుంటే మన రాష్ట్రం ఆటవిక  రాష్ట్రమో, ఏ బీహారో అనిపించే పరిస్థితి ఉంది. ఈ రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతి మాత్రం చేశారు. రౌడీ రాజ్యం సృష్టిస్తూ ఇసుకను, మట్టిని సైతం వదలకుండా గ్రామగ్రామాన మాఫియాను సృష్టించి నాకింత నీకింత అని భాగాలు పంచుకుంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఈ మాఫియా చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా బంగాళాఖాతంలో కలిపే రోజు తొందరలోనే వస్తుంది.

 బాధితులపైనే కేసులా?
 వీళ్ల రాజకీయాలు ఎంత నీచానికి దిగజారాయంటే వాళ్లొచ్చి ఈ గ్రామంపై మూడుసార్లు దాడులు చేస్తే వారి మీద కేసులు పెట్టడం మానేసి, ఇదే గ్రామంలోని 18 మందిపై ఎదురు కేసులు పెట్టారు. ఎంత దారుణం చేస్తున్నారంటే పక్క గ్రామంలో 70 ఏళ్ల ముసలాయన చనిపోతే ఆయనను నీళ్లలో పడేసి ఈ గ్రామం వాళ్లే చంపేశారని కౌంటర్ కేసులు పెట్టి జైళ్లకు పంపారంటే ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా? మీ కేబినేట్‌లో ఉన్న మంత్రి 400 మందిని పంపిస్తాడు. యనమల రామకృష్ణ తమ్ముడు కృష్ణుడు వాళ్లని తీసుకువస్తే వాళ్లంతా ఇక్కడ కొట్టి దౌర్జన్యం చేయడమే కాకుండా లూటీ చేస్తే ఆ మంత్రిని బర్తరఫ్ చేయడం మానేసి, మంత్రులను కాపాడుతూ, దొంగతనాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ముఖ్యమంత్రేనా? ఆయనకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే అర్హత ఉందా?  ఈ దొంగ కేసులన్నింటిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తాం.

వీళ్లకు సహకరించిన ఎస్సై సత్యనారాయణతో సహా అందరినీ జైలుకు పంపిస్తాం. ఈ రెండేళ్లు కాస్తో కూస్తో కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉన్నా ధైర్యంగా ఎదుర్కొందాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా, తోడుగా ఉంటుంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సాగదు. రెండేళ్లకో,  ఏడాదికో మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వీళ్లు చేసిన దానికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష తప్పదు. న్యాయ స్థానం మీద నమ్మకం ఉంది.  మంచి లాయర్లను పెడదాం. న్యాయ స్థానంలో పోరాడదాం. ఆ కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.’’అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ పర్యటనలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
 
 ఈ ముఖ్యమంత్రిని ఏం చేయాలి?

  అంతకుముందు మునగపాకలో జరిగినసభలో జగన్ మాట్లాడుతూ... ‘‘ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఏమీ చేయకపోతే.. మోసం చేస్తే.. ఆ వ్యక్తిని ఏం చేయాలి?.. నేను సీఎం కదా, ముఖ్యమంత్రి అభ్యర్ధిని కదా ఏం చేసినా చెల్లుతుందంటే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది.. మోసకారి బాబును ఏం చేద్దాం? మీరే నిర్ణయించండి. మా నాయకులకు ఒకటే చెబుతున్నా.. ఇవాళ మనం చేయాల్సిందేమిటంటే.. ప్రజల్లోకి వెళదాం. వారు పడుతున్న బాధలు చూద్దాం. వారందరికీ మనం తోడుగా ఉన్నామన్న భరోసా ఇద్దాం.. చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలు అయ్యాక ఏం చేశారు అనేది ప్రజలకు చెబుదాం. ఎన్నికల్లో గెలవడం కోసం బాబు చెప్పిన అబద్ధాలను ప్రజలల్లో తీసుకువెళ్లి ప్రజల చేతే మార్కులు వేయించండని ప్రజా బ్యాలెట్ ఇచ్చాం.

చంద్రబాబు ఇచ్చిన హామీలు, మాటలు ఆ పాంప్లెట్‌లో ఉంచాం.  బాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీలన్నింటినీ నిలబెట్టుకున్నారా అని ప్రజలనే అడగండని, ప్రజల చేతే అలోచింపజేయండని చెప్పాం. గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమం పేరుతో ప్రజల్లో వెళ్లమని చెప్పా. చంద్రబాబు పాలనపై మార్కులు వేయించమని చెప్పాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వచ్చి వారికి ఏదో చేస్తానని ప్రజలతో పని అయిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజలకు మేలు చేయకపోతే, మోసంచేస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిని కదా ఏమైనా చేయెచ్చు, నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నా కదా ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లుతుందంటే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది. పాలక వ్యవస్థ మారాలన్నా, రాజకీయ వ్యవస్థ మారాలన్నా మనలో చైతన్యం రావాలి.

ఫలానా పని చేస్తానని మైక్‌పట్టుకుని చెప్పిన వ్యక్తి చేయకపోతే రేప్పొద్దున్న జనం నిలదీస్తారన్న భయముంటేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకుల్లో మార్పు రావాలన్నా, వ్యవస్థను మార్చాలన్నా మనమంతా ఒక్కటై ‘ఆరోజు ఎన్నికల ముందు ఏ చెప్పావ్, ఎన్నికలయ్యాక మోసం చేస్తావా’ అని నిలదీయాలి. అందుకే గడప గడపకు వైఎస్సార్ ప్రారంభించాం. వైఎస్సార్‌సీపీకి మీరందరూ తోడుగా ఉండాలి. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది.’’ అని వివరించారు.
Share this article :

0 comments: