బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం

బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం

Written By news on Tuesday, July 26, 2016 | 7/26/2016


ఆ బాధ.. తెలుసు
ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన
 
- జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి
పార్లమెంటులో మా ఎంపీలు ఈ విషయంపై మాట్లాడుతున్నారు
బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం
 
 సాక్షి, విశాఖపట్నం : ‘‘ఆరోజు సెప్టెంబర్ 2వ తేదీన నా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ అదృశ్యమైన రోజు నేను ఎంతటి నరకయాతన అనుభవించానో ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో గల్లంతైనవారి కుటుంబాలు అంతే వేదన అనుభవిస్తున్నాయి’’అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ నెల 22న చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరి అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంతోపాటు ఆచూకీ లేకుండాపోయిన ఎనిమిదిమంది విశాఖ ఎన్‌ఏడీఉద్యోగుల కుటుంబాలను వై.ఎస్.జగన్ సోమవారం కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నించాల్సి వస్తోందని, ఇప్పటికే మూడుసార్లు మరమ్మతులకు గురైన విమానాన్ని మనుషుల తరలింపునకు ఎలా వినియోగించారని ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గట్టిగా నిలదీస్తున్నారన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

 ఆ రోజు నాన్న వస్తాడనుకున్నాం
 ‘‘భారతదేశం విమానాలను నడుపుతున్న తీరును ప్రశ్నించాల్సి వస్తోంది. ఈ కుటుంబాలు పడుతున్న బాధలు అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఆ రోజు కూడా నాన్న ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15, 20 నిమిషాలకే ఆచూకీ తెలియని పరిస్థితి. రెండు రోజుల పాటు నాన్న వస్తాడు, ఎక్కడో దిగే ఉంటాడు.. ఎక్కడో ఎవరికో కనిపించాడు..నడుస్తున్నాడు, వస్తున్నాడు అంటూ రకరకాల ఊహాగానాల మధ్య.. బతికున్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితుల్లో కాలం గడిపాం. ఈ కుటుంబాలు కూడా ఇంచుమించు అదే పరిస్థితుల్లో బతుకుతున్నాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఏమైంది,  ఎక్కడ ఉన్నారో తెలిసే పరిస్థితులు లేవు.

 విమానాలు నడుపుతున్న తీరు బాధాకరం
 విమానాలను నడుపుతున్న తీరు ఇంకా బాధాకరం. తాము పడుతున్న బాధను ఆ కుటుంబాలవారు చెబుతుంటే అర్ధమవుతోంది. ‘అన్నా దాదాపు ప్రతి సంవత్సం ఇదే జరుగుతోందన్నా.. మూడేళ్లు తప్ప ప్రతి సంవత్సరం ఓ విమానం కూలిపోతూనే ఉందన్నా, మనుషులు చనిపోతూనే ఉన్నారన్నా’ అని వారు చెబుతున్నారు. నిజంగా మానవ జీవితం వెలకట్టలేనిది. కానీ విమానం నడుపుతున్నప్పుడు విమానం బాగా పనిచేయలేదు, మూడుసార్లు ఆ విమానాన్ని రిపేరు చేశామని తెలిసినా అదే విమానాన్ని మనుషులను తిప్పడానికి ఉపయోగించడం చూస్తే ఇంకా బాధనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. జరిగిన ఈ ఘటనకు పూర్తి భాధ్యత తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చాలా చాలా గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు.

పార్లమెంటులోనిలదీస్తున్నాం                                                                                                                                                                                                                                                  పార్లమెంటులో ఇవాళ(సోమవారం) మా ఎంపీలందరూ కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇక్కడికి వచ్చే ముందు ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల తో ఇదే విషయం మాట్లాడాను. పార్లమెంటులో గట్టిగా అడగండని, డిఫెన్స్ మినిస్టర్ వద్దకు వెళ్లమని చెప్పాను. ఆయనపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి వారికి గట్టిగా చెప్పాను. నిజంగా ఒత్తిడి తీసుకురావాలి. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే అప్పుటికప్పుడు పట్టించుకోవడం, ఆ తర్వాత మళ్లీ మర్చిపోవడం, మళ్లీ అవే సంఘటనలు పునరావృతం కావడం జరుగుతోంది. మన దేశంలో విమానాలైనా అంతే.. ట్రైన్‌లైనా అంతే.. అప్పటికప్పుడు రియాక్ట్ అవుతారు. తర్వాత కథ మామూలే. ఏటా జరుగుతూనే ఉంటున్నాయి.

ఈ వ్యవస్థను నిజంగా బాగుచేయాలంటే మనలో కూడా చైతన్యం రావాలి. మనం కూడా ప్రశ్నించడం మెదలుపెట్టాలి. మళ్లీ మళ్లీ గుర్తు చేసి అడుగుతుండాలి. దీనిలో మా వంతు పాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఎంపీల ద్వారా ఏం చేయాలో అదంతా చేయిస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో బాధనేది ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని కాబట్టి.. దీనికి మీడియా సహాయం కూడా కావాలని కోరుతున్నాం. ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే మీరంతా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ తప్పులు సరిదిద్దితేనే వ్యవస్థ మారుతుంది.’’అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 ప్రాణానికి విలువలేని పరిస్థితులున్నాయి
 ‘రక్షణ రంగంలోనే కాలం చెల్లిన విమానాలు కొని నడుపున్నారంటే, వాటిలోనే మనుషులను ఎక్కించుకుని తిప్పుతున్నారంటే మానవ జీవితాలకు విలువ లేదన్న పరిస్థితికి ఇది స్పష్టంగా అద్దం పడుతోంది.  ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు నడుస్తున్నాయంటే నిజంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది’అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ అన్నారు. విశాఖకు వచ్చిన సీఎం బాధితులందరి ఇళ్లకు వెళ్లకుండా ఇద్దరి, ఇళ్లకు వెళ్లి మరొకరిని ఎయిర్‌పోర్టుకు రప్పించుకుని పరామర్శించడాన్ని ఏ విధంగా తీసుకోవాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ ‘ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టులో పరామర్శించి వెళ్లిపోయారేంటని ఆయనను మీరే అడగండి. ఆయనకే తగలాలి. అప్పుడైనా ఆయనలో మార్పు వస్తుందని ఆశిద్దాం’ అని అన్నారు. భూపేంద్ర సింగ్ మినహా మిగతా ఏడుగురిలో ఎవరికీ విమానం ఎక్కే అర్హత లేకపోయినా తీసుకువెళ్లారని, ఎవరికీ ఇన్సూరెన్స్ కూడా లేదని, ఇలాంటి వాళ్లకి ఇన్సూరెన్స్ అర్హత వచ్చేలా ఏమైనా చేయిస్తారా అనే మరో ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ప్రతి ఏటా ఉద్యోగులు వెళుతున్నందున వాళ్ల భద్రత కోసం గట్టి చర్యలు తీసుకోవాలని తప్పకుండా ప్రభుత్వాన్ని కోరతామన్నారు.
 
 ధైర్యం కోల్పోవద్దు.. అండగా మేమున్నాం
 విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలను  ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం విశాఖలో వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి కన్నీళ్లను తుడిచి ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరింత గట్టిగా గాలించేలా కేంద్రం, రక్షణ శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నామని బాధితులకు భరోసా ఇచ్చారు.   అయితే ఇంత కష్టం వస్తే, అయిన వారు ఏమయ్యారోననే ఆందోళనలో మీరుంటే కనీసం సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అదృశ్యమైన వారంతా క్షేమంగా తిరిగిరావాలని దేవుడ్ని ప్రార్థ్ధిద్దామని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేలా  ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని అన్నారు. ప్రమాదం జరిగింది సముద్రంలో గనుక విమానంలో లైఫ్‌గార్డ్స్ ఉంటాయి గనుక అందరూ క్షేమంగా ఉంటారని ఆ కుటుంబాలకు జగన్ ధైర్యం చెప్పారు.జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న జగన్ సాయంత్రం 7 గంటలకు పర్యటన ముగించుకుని తిరిగి విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
Share this article :

0 comments: