పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

Written By news on Tuesday, July 5, 2016 | 7/05/2016


ప్రజాభిమానమే రక్ష
పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం

 సాక్షి, హైదరాబాద్ :రాష్ట్రంలో నిరంకుశమైన రీతిలో దోపిడీ పాలనను సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎదుర్కోవడానికి ప్రజాభిమానం సంపాదించుకోవడం ఒక్కటే పరిష్కారమని, అందుకే పార్టీ శ్రేణులు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి జరిగే ‘గడప గడపకూ వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా పాలు పంచుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ధనబలంతో రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబును నిలువరించాలంటే వైఎస్సార్‌సీపీ నిత్యం జనంతో మమేకం కావాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, సీనియర్ నేతల సమావేశానికి జగన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి ‘గడప గడపకూ వైఎస్సార్‌సీపీ’ ఎంత ముఖ్యమైనదో, ప్రతిష్టాత్మకమైనదో వివరించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 2004 ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు డబ్బు భారీగా కుమ్మరించారని, ఆరోజు ప్రతిపక్ష నేతగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పరిమిత వనరులతోనే ఎన్నికల్లో పోరాడటం తాను చూశానని జగన్ గుర్తు చేశారు. ఆరోజున వైఎస్ ప్రజాబలాన్ని కూడగట్టుకోవడం వల్లనే భారీ ఆధిక్యంతో గెలుపొందారని... డబ్బును వెదజల్లిన చంద్రబాబుకు 46 సీట్లు మాత్రం దక్కాయని చెప్పారు.

 ప్రతి గడపకూ చంద్రబాబు అవినీతిని వివరిస్తాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 తప్పుడు వాగ్దానాలతో గద్దె నెక్కి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసి చంద్రబాబు అవినీతి అక్రమాలు, దోపిడీ గురించి రాష్ట్రంలోని ప్రతి గడపకూ తెలియ జేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన పార్టీ కనుక ఈ నెల 8వ తేదీన ఆయన జయంతి రోజునే ‘గడప గడపకూ వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమాన్ని ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభిస్తామన్నారు. ఆ రోజున ఉదయాన్నే వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రతి కుగ్రామానికి, ప్రతి ఇంటికి పార్టీ నేతలు వెళ్లాలన్నారు.

చంద్రబాబు రెండేళ్ల పాలన , ఆయన అవినీతిపై ఒక కరపత్రాన్ని ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తామని... దానిని విడుదల చేశారు. ఇదే కరపత్రంలో చంద్రబాబు తన పాలనలో పాసయ్యారా? ఫెయిలయ్యారా? అని ప్రజలనే కోరుతూ వంద ప్రశ్నలతో ప్రజా బ్యాలట్‌ను కూడా పొందు పరిచామని దీనిపై మార్కులు వేయాలని వారినే కోరతామని చెప్పారు. చంద్రబాబు ఈ రెండేళ్లలో చేసిన అవినీతి, కుంభకోణాల్లో ఇప్పటివరకూ  రూ 1,45,549  కోట్ల అవినీతికి పాల్పడ్డారని పార్టీ ఇప్పటికే అన్ని ఆధారాలతో సహా ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే పుస్తకం ప్రచురించిందని, ఇందుకు సంబంధించిన అంశాలను కూడాకరపత్రంలో పొందుపర్చామని వివరించారు. పార్టీ తరపున అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు అందజేసే కరపత్రాలతో పాటు స్థానిక సమస్యలపై కూడా కరపత్రం ముద్రించి పంపిణీ చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి రోజూ ఈ కార్యక్రమం ఎలా జరుగుతోందో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉంటామన్నారు. వైఎస్ పరిపాలించేటపుడు పార్టీ రహితంగా ఎలా ప్రజలు పథకాల లబ్ధి పొందారో కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తామని ఆయన తెలిపారు.

 చంద్రబాబు అన్నింటా విఫలం...
 రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమవడమే కాక, యథేచ్ఛగా దోపిడీని సాగిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. అన్నింటా అవినీతి విలయతాండవం చేస్తోందని, ప్రజాభిమతానికి విలువే ఇవ్వకుండా పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండేళ్లలోనే పదేళ్ల ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నారని చెప్పారు. ఇపుడు కూడా డబ్బుతోనే ఎన్నికల్లోకి పోవాలనే వ్యూహంతో చంద్రబాబు కదులుతున్నారని, అందుకే ప్రజాభిమానం చూరగొనడం వైఎస్సార్‌సీపీకి చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజల మద్దతు పొందడానికి షార్ట్‌కట్ పద్ధతులేమీ ఉండవని కచ్చితంగా వారిలోకి వెళ్లి పని చేయాల్సిందేనని దిశానిర్దేశం చేశారు.

గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించేటపుడు మూడు రోజులకు మించి మధ్యలో విరామం రావడానికి వీలు లేదని, స్థానిక, లేక ఇతర కారణాల వల్ల సమన్వయకర్తలుగా ఉండేవారు మూడు రోజులు మధ్యలో నిలిపి వేసినా నాలుగోరోజు నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు తాను నియోజకవర్గాల  నుంచి సమాచారం తెప్పించుకుంటూ ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొనలేకపోతే అలాంటి అసెంబ్లీ సమన్వయకర్తలను పిలిచి మాట్లాడతానని, ఆశక్తత ప్రదర్శించే చోట్ల పునరాలోచన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనపై అక్రమంగా ఓ వైపు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను, నేతలను క్షేత్రస్థాయిలో పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అధికారపక్షం వైఎస్సార్‌సీపీపై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు విరుగుడు ప్రజాభిమానం చూరగొనడం ఒక్కటే కనుక ‘గడప గడపకూ’ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు, నేతలంతా కసితో విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Share this article :

0 comments: