మక్కీకి మక్కీ కాపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మక్కీకి మక్కీ కాపీ

మక్కీకి మక్కీ కాపీ

Written By news on Wednesday, July 6, 2016 | 7/06/2016


ఏపీ.. కాపీ
- తెలంగాణ సులభ వాణిజ్య విధానం
- ఆన్‌లైన్ దరఖాస్తు చోరీ చేసిన ఏపీ సర్కారు
- ప్రపంచ బ్యాంక్ ర్యాంకు కోసం అడ్డదారులు
- దీనితో 22 రోజుల్లో ఏకంగా 16 ర్యాంకులు ఎగబాకిన వైనం
- ఆంధ్రప్రదేశ్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
- అధికారులతో సీఎస్ భేటీ.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
- కాపీరైట్స్ చట్టం సెక్షన్ 63 కింద కేసు నమోదు
- ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్
- ఏపీ నిర్వాకంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ


 సాక్షి, హైదరాబాద్: సులభ వాణిజ్యంలో ప్రపంచబ్యాంక్ ర్యాంకు కోసం ఏపీ అడ్డదారులు తొక్కింది.. తెలంగాణ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తును మక్కీకి మక్కీ కాపీ చేసింది.. దానిని తమదిగా చూపిస్తూ కేంద్ర పరిశ్రమల శాఖకు సమర్పించింది.. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన తెలంగాణ అధికారులు ఏపీ ‘చోరీ’పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా తమ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ నిస్సిగ్గుగా చోరీ చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీసీఎస్ పోలీసులు కాపీరైట్స్ యాక్ట్ సెక్షన్-63 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఏపీ సర్కారు ‘కాపీ’ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కాపీ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు అంశాలపై ఉప్పూ నిప్పుగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ అంశం సరికొత్త వివాదానికి తెరలేపింది.

 సులభ వాణిజ్యానికి ప్రోత్సాహం కోసం..
 అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ‘డిప్’ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పేరిట ఓ వెబ్ పోర్టల్ రూపొందించింది. ఈవోడీబీ ర్యాంకును ఆశించే రాష్ట్రాలు డిప్ సూచించిన 340 ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో సమాధానాలను సమర్పించాలి. ఆయా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం, సమాధానాల పురోగతిని పర్యవేక్షించేందుకు ‘ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటు చేశారు.

 రాష్ట్రాలు శాఖల వారీగా సమర్పించే సమాచారం ఆధారంగా ‘స్కోరు’ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాలు జూన్ 30లోగా సులభ వాణిజ్యానికి వీలు కల్పించేలా తాము చేపట్టిన సంస్కరణలకు  ఆధారాలను సమర్పించాలని డిప్ గడువు విధించింది.  జూన్ 28, 29 తేదీల్లో వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆధారాల సమర్పణ గడువును జూలై ఏడో తేదీ వరకు పొడిగించింది.  జూన్ 30వ తేదీ వరకు చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

 కాపీ కొట్టిందిలా!
 న్యాయశాఖకు చెందిన ‘కమర్షియల్ కోర్ట్ ఫీ అండ్ ప్రాసెస్ ఫీ ఆన్‌లైన్ పేమెంట్’ దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న డిప్ వెబ్‌పోర్టల్‌కు సమర్పించింది. ఏపీ సర్కారు జూన్ 30 అర్ధరాత్రి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సమాచారం అప్‌లోడ్ చేయలేదు. గడువు పెంచిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దరఖాస్తును ఏపీ అధికారులు  కాపీ కొట్టి అప్‌లోడ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ దరఖాస్తులో పొందుపరిచిన ‘సబ్మిషన్ రిఫరెన్స్ నంబర్’ అనే అంశాన్ని యథాతథంగా ఉంచేశారు. ఈ అంశం తెలంగాణకు మాత్రమే ఉన్న విశిష్ట సంఖ్యా విధానం కావడంతో ఏపీ సర్కారు కాపీ వ్యవహారం బట్టబయలైంది. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వ విధానాలను కాపీ చేయడం మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు. ఈవోడీబీ ర్యాంకుల కోసం అడ్డదారి తొక్కిన ఏపీ వైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 22 రోజుల్లో 16 ర్యాంకులు పైకి..
 ఈవోడీబీలో గతేడాది ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. దీన్ని సవాలుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం  శాఖల వారీగా సంస్కరణలను చేపట్టింది.  తాజా ర్యాంకింగ్‌లో 51.93%స్కోర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో ఉండగా.. 51.76% స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో ఉంది. జూన్ 13న ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో బిహార్ ప్రథమ స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానంలో నిలిచింది. తమ సమాచారాన్ని కాపీ కొట్టడంతో ఏపీ మూడో ర్యాంకు ఎగబాకిందని తెలంగాణ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న పారిశ్రామిక ప్రణాళికలు, పరిశ్రమల వివరాలను కొందరు అధికారులు ఏపీకి చేరవేశారన్న సమాచారంతో మంత్రి కేటీఆర్ పరిశ్రమల శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగుల పనితీరును సమీక్షించారు.

 ఏపీ నిర్వాకంపై కేంద్రానికి లేఖ
 మెరుగైన ఈవోడీబీ ర్యాంకు కోసం ఏపీ సర్కారు అడ్డదారులు తొక్కిన తీరుకు సంబంధించిన ఆధారాలను అధికారులు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుకు అందజేశారు. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ‘‘సులభ వాణిజ్యం కోసం కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను తెలంగాణ గుర్తించింది. రెడ్‌టేపిజాన్ని తగ్గిస్తూ, పారదర్శక తకు పెద్దపీట వేసేలా డిప్ చేస్తున్న ప్రయత్నం పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టిస్తుందని భావిస్తున్నాం. రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణలకు సంబంధించిన ఆధారాల సమర్పణకు జూలై 7ను గడువుగా నిర్దేశించారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల వెబ్‌సైట్‌ల సమాచారాన్ని కాపీ కొడుతూ ఈవోడీబీ ర్యాంకు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ తర్వాత  డిప్‌కు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది ర్యాంకులు కేటాయించాలి..’’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ కాపీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను లేఖతో పాటు జతచేశారు.
Share this article :

0 comments: