సీఎం మాట మార్చినా.. మా పోరాటం ఆగదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం మాట మార్చినా.. మా పోరాటం ఆగదు

సీఎం మాట మార్చినా.. మా పోరాటం ఆగదు

Written By news on Thursday, July 28, 2016 | 7/28/2016


సీఎం మాట మార్చినా.. మా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట మార్చారని.. అయినా హోదా కోసం తమ పోరాటం మాత్రం ఆగబోదని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ సీపీ గత రెండేళ్లుగా హోదా కోసం పోరాడుతోందని, ఇప్పుడు కూడా హోదా ఇవ్వకపోతే ఎంతకాలమైనా పోరాటం చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే...

‘‘సమైక్యాంధ్రప్రదేశ్ ను విభజించింది ఎంత వాస్తవమో.. ఏపీకి అన్యాయం చేసిందన్నది కూడా అంతే నిజం. ఈ చర్చ సందర్భంగా కొన్ని ముఖ్యమైన న్యాయపరమైన విషయాలు లేవనెత్తి, వాటికి ఆర్థిక, న్యాయశాఖ మంత్రులు సమాధానంచెబుతారనుకున్నాను. కానీ వాళ్లు ఈ సభలో లేకపోవడం దురదృష్టకరం. ఈ సవరణ బిల్లు ఆర్థిక బిల్లు కాబట్టి రాజ్యసభలో పెట్టడం కుదరదని రెండురోజుల క్రితం ఆర్థికమంత్రి సభలో అన్నారు. నిజానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును 2014లో ఆమోదించినప్పుడు దానికి రాజ్యాంగ సవరణ అవసరం. కానీ అలా చేయలేదు. సభ్యులందరికీ ఆ విషయం

తెలుసు. అలాంటప్పుడు సవరణను ఆర్థిక బిల్లుగా ఎలా పరిగణిస్తారు? రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల అధికారపక్షం దీన్ని ఆర్థికబిల్లుగా పరిగణించవచ్చు. కానీ న్యాయపరంగా చూస్తే మాత్రం ఇది ఆర్థికబిల్లు కాదు. ఒకవేళ దీనికి కొన్ని సవరణలు చేయాలన్నా.. అందుకు రాజ్యాంగంలోని నాలుగో అధికరణ ప్రకారం కొన్ని అవకాశాలున్నాయి. నిజానికి ప్రతి బిల్లులోనూ ఎంతోకొంత ఆర్థికాంశాలు ఉంటాయి. ఆ లెక్కన చూసుకుంటే 70-75 శాతం వరకు బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే. ఆ లెక్కన వాటిని రాజ్యసభలో ప్రవేశ పెట్టకూడదంటే ఉభయ సభల విధానమే ప్రమాదంలో పడుతుంది. అందువల్ల దీన్ని ఆర్థిక బిల్లుగా పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ సభలో ఓటింగుకు అనుమతించాలని అడుగుతున్నాను

రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల‍్లుపై విస్తృతంగా చర్చ జరిగినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా 6 హామీలు ఇచ్చారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ప్రధాని స్వయంగా ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నప్పుడు వెంకయ్య నాయుడు ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం నిరంతరం ఉంటుందని, పార్టీలు అధికారంలోకి రావచ్చు, పోవచ్చని ఆర్థికమంత్రి చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం నిరంతరం ఉంటే.. నాటి ప్రధాని ఇచ్చిన హామీని నేటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే.. సభాహక్కుల ఉల్లంఘన అవుతుందా అనే అనుమానం కూడా నాకుంది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయానికి వస్తే.. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు తమ మేనిఫెస్టోలలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి ర్యాలీలోను, విశాఖ సభలో కూడా స్వయంగా చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం పూర్తిగా మాట మార్చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఆయన అంటున్నారు. కానీ వాస్తవానికి అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజీవనే అవుతుంది. అందువల్ల దాన్ని తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. నాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది, అలాగే రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలి.’’
Share this article :

0 comments: