పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం

పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం

Written By news on Friday, July 22, 2016 | 7/22/2016


ఇదో అధికార కబ్జా!
♦ పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు సీఎం వ్యూహం
♦ శ్రీ‌కాకుళం, కాకినాడల్లో ఇప్పటికే విలువైన భూములు ఎన్టీఆర్ ట్రస్టుకు సంతర్పణ
♦  రాజధానితో పాటూ జిల్లా కేంద్రాల్లోనూ భూములు కొట్టేయడానికి వీలుగా ఉత్తర్వులు
♦ శాసనసభలో బలం ఆధారంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలకు భూములు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట! టీడీపీ కార్యాలయం ముసుగులో శ్రీకాకుళంలో రూ.30 కోట్ల విలువైన రెండెకరాలు, కాకినాడలో రూ.25 కోట్ల విలువైన రెండువేల చదరపు గజాల భూమిని ఇప్పటికే కాజేశారు.

తాజాగా రాజధానితో పాటూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా అత్యంత ఖరీదైన భూములను కొట్టేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రాజధానిలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ కార్యాలయాల నిర్మాణానికి భూములను నామమాత్రపు ధరకు 99 ఏళ్లకు లీజులకు కేటాయించేందుకు వీలుగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకు కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తారు. కానీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే భూములు కేటాయించాలనే మెలిక పెట్టడం వెనుక టీడీపీకి భారీ ఎత్తున భూములు దోచిపెట్టడానికే అన్నది స్పష్టమవుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీకాకుళం, కాకినాడల్లో కాజేసిన తరహాలోనే మిగతా జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఖరీదైన భూములను గుర్తించి, వాటిని కేటాయించాలని కోరుతూ ఆపార్టీ జిల్లాల అధ్యక్షుల ద్వారా ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపారు.
 
వ్యూహాత్మకంగా ఉత్తర్వులు..
రాజకీయ పార్టీలకు రాజధాని, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఎకరం లోపు భూమిని 30 ఏళ్లకు లీజు పద్ధతిలో కేటాయించేలా ఆగస్టు 31, 1987లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో నాలుగు, జిల్లా కేంద్రాల్లో రెండెకరాలకు పైగా ఉన్న అత్యంత ఖరీదైన భూములను పార్టీ కార్యాలయాల ముసుగులో కాజేయడానికి ప్రతిపాదనలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని నిర్ణయించారు. టీడీపీ మినహా మరే ఇతర పార్టీకి భారీ ఎత్తున భూములు దక్కకుండా నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం..
 
శాసనసభలో 50 శాతం కన్నా ఎక్కువ స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో నాలుగు ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల చొప్పున కేటాయించవచ్చు.
అసెంబ్లీలో 25 శాతం నుంచి 50 శాతం లోపు స్థానాలు దక్కిన పార్టీకి రాజధానిలో అరెకరం వరకూ.. జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల వరకూ కేటాయించవచ్చు.
శాసనసభలో 25 శాతం లోపు స్థానాలుగానీ.. కనీసం ఒక్క స్థానంగానీ దక్కిన పార్టీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమిని కేటాయించవచ్చు.
తొలుత 33 ఏళ్లకు లీజుకు ఇస్తారు.. ఆ తర్వాత 99 ఏళ్ల వరకూ లీజును రెన్యూవల్ చేసుకోవచ్చు.
ఏడాదికి ఎకరానికి గరిష్ఠంగా రూ.వెయ్యి చొప్పున లీజుగా చెల్లించాలి.
కేటాయించిన ఏడాదిలోగా పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. ఆ భూమిని వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించకూడదు.
ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మినహా తక్కిన విపక్ష పార్టీలకు భూములు దక్కవు. శాసనసభలో 67 మంది సభ్యుల బలం ఉన్న వైఎస్సార్‌సీపీకి రాజధానిలో గరిష్ఠంగా అరెకరం, జిల్లా కేంద్రాల్లో వెయ్యి చదరపు గజాల భూమిని మాత్రమే లీజుకు పొందే అవకాశం ఉంది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీకి రాజధానిలో వెయ్యి, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాల భూమి కేటాయించే అవకాశం ఉంది. సంఖ్యా బలం ఆధారంగా భూములు కేటాయించడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.
Share this article :

0 comments: