ఇంగ్లీషులో మాట్లాడితే మోదీకి తెలుస్తుందనా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంగ్లీషులో మాట్లాడితే మోదీకి తెలుస్తుందనా..?

ఇంగ్లీషులో మాట్లాడితే మోదీకి తెలుస్తుందనా..?

Written By news on Monday, August 1, 2016 | 8/01/2016

మభ్యపెట్టే మరో డ్రామా!
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి బట్టబయలు
కేంద్రంలో కొనసాగడమంటే జైట్లీ ప్రకటనను సమర్థించినట్లేగా!

≈ ఇంగ్లీషులో మాట్లాడితే ప్రధాని మోదీకి తెలుస్తుందనా..?
≈ కేంద్రంపై, బీజేపీపై పరుష వ్యాఖ్యలూ లేకుండా జాగ్రత్త
≈ సహకరించడం లేదంటూ ప్రతిపక్షంపై బాబు ఎదురుదాడి
≈ విభజన గాయాలను మళ్లీ రేపే ప్రయత్నం..
≈ ప్రజల దృష్టి మరల్చడమేనని విశ్లేషకుల వ్యాఖ్య
≈ మంత్రులను ఉపసంహరిస్తే బీజేపీపై ఒత్తిడి పెరగదా?
≈ అదే జరిగితే తనకు ఇబ్బంది అనుకుంటున్నారా?

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కేంద్రంతో గట్టిగా పోరాడతారని, ప్రత్యేక హోదా సాధన దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తారని ఆశించిన ఐదుకోట్ల మంది తెలుగు ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

కలసి ఎన్నికల్లో పోటీ చేసి, కలసి అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు ఇపుడు కేంద్రం నుంచి తన మంత్రులను మాత్రం ఉపసంహరించుకోకుండా పూర్తి నెపాన్ని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేయడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్ష పెరగడం, వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో దాని నుంచి బైటపడడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. తన అసమర్థత బైటపడకుండా కాపాడుకోవడంకోసం ఈ నెపాన్ని బీజేపీపై వేయడానికి అనుకూల మీడియా సహాయంతో వేస్తున్న ఎత్తుగడ అని విశ్లేషకులంటున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి వెంటనే మంత్రులను ఉపసంహరించేవారని వారంటున్నారు.

రెండేళ్లుగా రకరకాల ప్రకటనలతో ఏమార్చుతూ వచ్చిన చంద్రబాబు ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. పోరాటమే భవిష్యత్ కార్యాచరణగా నిర్దేశించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఏదో కఠిన నిర్ణయం తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ కేంద్రంలో కొనసాగుతూనే బీజేపీపై నెపం మోపడం, విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం, వనరులు లేవంటూ వాపోవడం, నిరసనలను నివారించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ప్రత్యేకహోదాపై ప్రజలను మభ్యపెట్టేందుకు మరోమారు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు.

అసలు రాష్ర్టవిభజనకు తన లేఖే కారణమన్న సంగతిని దాచిపెట్టి.. రాష్ట్రాన్ని నాడు అడ్డగోలుగా విభజించారంటూ విభజన గాయాలను రేపడం ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ అని వారంటున్నారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నామనడాన్ని బట్టి చూస్తే కేంద్రంలో తాము పదవులను వదులుకునేది లేదని పరోక్షంగా తేల్చిచెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీని పల్లెత్తుమాట అనకుండా.. నాడు విభజనకు కారణమైన కాంగ్రెస్‌పైనా, ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు సిద్ధమౌతున్న ప్రతిపక్షాలపైనా, ప్రశ్నలడుగుతున్న విలేకరులపైనా విరుచుకుపడడం చూస్తుంటే చంద్రబాబు ఈ అంశాన్ని పక్కదారిపట్టించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులంటున్నారు.
 
బీజేపీ చేయడం లేదని ఇంగ్లిషులో చెప్పండి...
ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీ కారణమని చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించడం చూస్తే నెపం పూర్తిగా వారిపైకి నెట్టేయడం ద్వారా ఈ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఒకవైపు వారిపై నెపం నెట్టేస్తూనే బీజేపీపై వ్యక్తిగత విమర్శలకు పోవద్దని నాయకులకు నిర్దేశించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం ఏమీ చేయడంలేదని తెలుగుమీడియాలో మాట్లాడుతున్న చంద్రబాబు అవే విషయాలను జాతీయమీడియాతో మాత్రం చెప్పకపోవడానికి మోడీకి తెలుస్తుందన్న భయమే కారణమని వారు ప్రస్తావిస్తున్నారు.
 
మభ్యపెట్టడంలో సరిలేరెవ్వరూ..
ప్రత్యేకహోదాపై ఎన్నికల ముందు నుంచి నేటి విలేకరుల సమావేశం వరకు వివిధ సందర్భాలలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎన్నిరకాలుగా మభ్యపెడుతున్నారో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ప్రత్యేక హోదా కనీసం పదిహేనేళ్లయినా ఉండాలి అనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.  అదే చంద్రబాబు ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా సంజీవని కాదనడం, హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది అని ఎద్దేవా చేయడం, కేంద్రం హోదా ఇస్తానంటే వద్దంటామా..? కోడలు మగబిడ్డను కంటానంటే  ఏ అత్తయినా  వద్దంటుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించడాన్ని పేర్కొంటున్నారు.

ఇపుడు ప్రజలు ప్రత్యేక హోదా సంజీవని అని గ్రహించారని, అందుకే తిరగబడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ చైతన్యం చూసే చంద్రబాబు మళ్లీ స్వరం మార్చారని, హోదా అవసరమే అని ఇపుడు చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు.
 
ఈ దశలో వినతిపత్రమా?
ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకుంటామని, పార్టీ ఎంపీలతో వినతిపత్రాన్ని పంపిస్తామని చంద్రబాబు చెబుతుండడాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పటికి 37 సార్లు ఢిల్లీ వెళ్లారు.. ఒకటో రెండోసార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఇపుడు మరోమారు వినతిపత్రం ఇస్తామనడంలో అర్ధమేమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రత్యేకహోదా సాధ్యం కాదని  అంత స్పష్టంగా చెప్పినా ఇంకా వినతిపత్రం పంపిస్తామని చంద్రబాబు చెప్పడంలో అర్ధం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాను అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఇదేనా అని సామాన్యప్రజలకు సందేహం కలుగుతోందని పరిశీలకులంటున్నారు. ఈ దశలో వినతిపత్రం ఇస్తామని చెప్పడం మభ్యపుచ్చడానికి.. ఏమార్చడానికేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
 
ఎన్నో ఎత్తుగడలు..
ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో తమ మనోభావాలు దెబ్బతినడం, ఉద్యమాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమను మభ్యపుచ్చడం కోసమే చంద్రబాబు రకరకాల వ్యాఖ్యలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, వనరులు లేవని వాపోవడం వాటిలో భాగమే. అలవిమాలిన దుబారా, ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు, అనేక దేశాలకు టూర్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు ప్రకటనలు, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న వ్యాఖ్యలు చూసినవారెవరైనా వనరులు లేవన్న మాటలు నమ్ముతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఇక బంద్‌లు, ఆందోళనలు వద్దని, జపాన్ తరహాలో ఎక్కువ పనిచేసి నిరసన తెలపాలని చంద్రబాబు వారించడం కేంద్రంపై వత్తిడి పెరగకుండా చూడడం కోసమేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేకహోదాపై బాధను వ్యక్తంచేస్తూనే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం పక్కనపెట్టిందని ఆందోళనవ్యక్తం చేయడం ఆయన అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 20మంది ఎమ్మెల్యేలను 30నుంచి 40 కోట్లిచ్చి కొనుగోలు చేసిన చంద్రబాబు వారికి రాజకీయ పునరావాసం కల్పించలేకపోతామే అని బాధపడుతున్నారు తప్ప లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శకులంటున్నారు.
 
కేంద్రంలో కొనసాగడమంటే సమర్థించినట్లేగా..?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కొనసాగడమంటే ఆ ప్రకటనకు మద్దతిస్తున్నట్లేనని విశ్లేషకులంటున్నారు. అరుణ్‌జైట్లీ ఆర్థికమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడమంటే ఆ ప్రకటనను సమర్థించినట్లేనని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మంత్రులను ఉపసంహరించకుండా ఎన్ని చెప్పినా అవన్నీ మభ్యపుచ్చడానికి ఆడుతున్న నాటకాలుగానే భావించాల్సి ఉంటుందని విమర్శకులంటున్నారు.

అసలే ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ, అనేక అవినీతి ఆరోపణలతోనూ సతమతమవుతున్న చంద్రబాబు ఇపుడు మంత్రులను ఉపసంహరించడంపై బీజేపీ కన్నెర్ర చేస్తే తట్టుకునే స్థితిలో లేరని, అందుకే ఆయన కేంద్రంపై తాను వత్తిడి చేయకపోగా ఎవరూ ఒత్తిడి చేయకూడదని కోరుకుంటున్నారని వారంటున్నారు.ఎల్లోమీడియాలో ఎన్నో ప్రయాసలు..
ఒకవైపు కేంద్రంలో కొనసాగుతూనే, మరోవైపు కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లుగా కనిపించేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకూల మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేయిస్తున్నారు. అరుణ్‌జైట్లీ హోదాపై ప్రకటన చేసిన అరగంటలోపే కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇపుడో ఇంకాసేపట్లోనో మంత్రులను ఉపసంహరించేస్తారని కథనాలు ప్రసారమయ్యాయి.

ఆదివారం విలేకరుల సమావేశం తర్వాత కూడా చంద్రబాబు ఎంపీలపైనా, కేంద్రంలోని తమ పార్టీ ఇద్దరు మంత్రుల పైనా ఆగ్రహం వ్యక్తంచేశారని, ప్రత్యేక హోదాపై మరింత  గట్టిగా పోరాడాలని క్లాస్ పీకారని కథనాలు వచ్చాయి. కావాలంటే మంత్రివర్గం నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ఇద్దరు మంత్రులు చెప్పినట్లుగా కూడా చానళ్లు చెప్పేస్తున్నాయి. చంద్రబాబులో నిజంగా అలాంటి చిత్తశుద్ది ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చేదే కాదని, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాతనైనా వెంటనే మంత్రులను ఉపసంహరిస్తే ప్రజలు నమ్మేవారని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
Share this article :

0 comments: